క్యాన్సర్​​పై గెలవాలంటే..

క్యాన్సర్​​పై గెలవాలంటే..

శరీరంలో ఎక్కడో ఒక చోట చిన్న గడ్డ చేతికి తగులుతుంది... ‘చిన్న గడ్డే తగ్గిపోతుందిలే!’ అనుకుంటారు కొందరు. ఆ గడ్డ రోజు రోజుకి పెరుగుతుంటే కనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే.. క్యాన్సర్​ని మొదటి స్టేజీలోనే గుర్తిస్తే, సర్జరీ సరిపోతుంది. కోలుకునే అవకాశాలు ఎక్కువే. క్యాన్సర్​ లక్షణాలు ఏ రూపంలో బయట పడినా వెంటనే డాక్టర్​ని కలవాలి. ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్​ డే  థీమ్, ​క్యాన్సర్​ కేర్​ గురించి ​​ డాక్టర్​ సి.ఎస్​ రావు చెప్తున్న విషయాలివి... 

‘క్లోజ్​ ది కేర్ గ్యాప్’... ఈ ఏడాది ‘వరల్డ్ క్యాన్సర్​ డే’ థీమ్​. డబ్బు ఉన్నవాళ్లు, పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన ట్రీట్మెంట్​ అందించడమే ఈ థీమ్​ ఉద్దేశం. మనదేశంలో ప్రతి లక్షమందిలో 100 నుంచి 110 మంది కొత్తగా క్యాన్సర్​ బారిన పడుతున్నారు. ఈ సంఖ్య తగ్గాలంటే... క్యాన్సర్​ మీద  అవేర్​నెస్ కల్పించాలి. క్యాన్సర్​ గురించి చెప్పడం, క్యాన్సర్​ గురించిన అపోహల్ని తొలగించడం చాలాముఖ్యం.
మొదట్లోనే గుర్తించాలంటే...
క్యాన్సర్​ని ముందుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ టైమ్​ తగ్గడమే కాదు.. తొందరగా కోలుకోవచ్చు కూడా. క్యాన్సర్​ని గుర్తించడం ఎలా అంటే... ఎవరికి వాళ్లు సెల్ఫ్​ ఎగ్జామినేషన్​ చేసుకోవడాన్ని మించింది లేదు. క్యాన్సర్లలో రకాలు, వాటి లక్షణాల గురించి ఆశా వర్కర్లు, నర్సులకి ట్రైనింగ్​ ఇవ్వాలి. ప్రతిజిల్లాలో క్యాన్సర్​ బ్లాక్​ ఏర్పాటు చేయాలి. దాంతో ఫస్ట్​ స్టేజీలోనే క్యాన్సర్​ని గుర్తించే అవకాశం ఉంది. ఇలాచేస్తే కొన్నిరకాల క్యాన్సర్లని సర్జరీతో నయం చేయొచ్చు. అడ్వాన్స్​డ్​ స్టేజీలో గుర్తిస్తే మాత్రం కీమోథెరపీ చేయాల్సిందే.  
కొందరికే కీమో క్యాన్సర్​ వచ్చిందంటే కీమోథెరపీ తప్పదు అను కుంటారు చాలామంది. కానీ, అందరికీ కీమో అవసరం ఉండదు. క్యాన్సర్​ రకాన్ని బట్టి, అడ్వాన్స్​డ్​ స్టేజీలో ఉంటే కీమో చేస్తారు. అయితే, కొన్ని క్యాన్సర్లు మొదటి దశలో ఉన్నా కీమో చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం.. క్యాన్సర్​ ఉన్నవాళ్లందరి జుట్టు ఊడిపోదు. కీమో థెరపీ మందుల ఎఫెక్ట్​ వల్ల జుట్టు ఊడిపోతుంది. ఈ కండీషన్​ని ‘అలోపేషియా’ అంటారు. అయితే, ఆఖరి కీమో అయిన నాలుగు వారాల నుంచి జుట్టు రావడం మొదలవుతుంది. 
క్యాన్సర్లలో రకాలు
బ్రెస్ట్​ క్యాన్సర్​, సర్వైకల్​ క్యాన్సర్​, ఓవరీస్​ క్యాన్సర్లు వంటివి ఆడవాళ్లలో ఎక్కువ. నెలసరి ఆగిపోయిన తర్వాత రొమ్ములో గడ్డలు ఏర్పడడం, రొమ్ముల నుంచి రక్తం కారడం బ్రెస్ట్​ క్యాన్సర్​ సంకేతాలు.  మగవాళ్లలో రక్తహీనత సమస్య ఉంటే, అది క్యాన్సర్​కి దారి తీసే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో క్యాన్సర్​ రావడానికి కారణం  జెనెటిక్​ మ్యుటేషన్స్​.  కొన్నేమో హెరిడిటరీ. 5 నుంచి10 శాతం క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి.  
కారణాలు ఇవీ
శరీరంలో  ఒకచోట చిన్న గడ్డలా  మొదలై ఒళ్లంతా వ్యాపిస్తుంది క్యాన్సర్​. క్యాన్సర్​ రావడానికి ప్రధాన కారణం కార్సినోజెన్స్​. పొల్యూషన్​, ఫుడ్​ ద్వారా ఇవి శరీరంలోకి వెళ్తాయి. సిమెంట్​ ఇండస్ట్రీ, కోల్​మైన్స్​, దుమ్ము, ధూళి ఎక్కువగా వచ్చే ప్లేస్​ల్లో పనిచేసేవాళ్లు క్యాన్సర్​ బారిన పడే ఛాన్స్​ ఎక్కువ. బరువు పెరగడం వల్ల  బ్రెస్ట్​ క్యాన్సర్​, కోలన్​ క్యాన్సర్​, ప్రొస్టేట్​ క్యాన్సర్, ఓవరీస్​ క్యాన్సర్​ వంటివి వస్తాయి. ఆల్కహాల్ బాగా తాగేవాళ్లకి నోటి క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉంది.  సిగరెట్ తాగడం​, పొగాకు, గుట్కా, తంబాకు  నమలడం వల్ల నోటి క్యాన్సర్​, గొంతు క్యాన్సర్​, లంగ్​ క్యాన్సర్​ రిస్క్​ ఎక్కువ. మన దేశంలో నమోదయ్యే మూడొంతుల క్యాన్సర్లకి ఈ అలవాట్లే  కారణం.
ఈ జాగ్రత్తలు పాటిస్తే... 
ఫ్యాట్స్​ ఉన్న ఫుడ్​ తినొద్దు. కార్సినోజెనిక్​ ఏజెంట్స్​ ఎక్కువ ఉండే రెడ్​మీట్ తినొద్దు. సిగరెట్, పొగాకు నమలడం మానేయాలి. క్యాన్సర్​ లక్షణాలుంటే వెంటనే డాక్టర్​ని కలవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి.  రెగ్యులర్​గా వాకింగ్​ చేయాలి.  
రెండింటికే వ్యాక్సిన్​ 
60 శాతం క్యాన్సర్లని నయం చేయొచ్చు. అయితే, చాలామంది​ అడ్వాన్స్​డ్​ స్టేజీలో డాక్టర్​ దగ్గరకు వస్తారు. ట్రీట్మెంట్​ ఆలస్య మవడంతో రికవరీ ఛాన్స్​ తగ్గుతుంది. ఆడవాళ్లలో వచ్చే  సర్వైకల్​ క్యాన్సర్​కి వ్యాక్సిన్​ ఉంది. 15 ఏండ్లు దాటిన ఆడపిల్ల లకి హెచ్​పీవీ (హ్యూమన్​ పాపిలోమ వైరస్)​ వ్యాక్సిన్​ ఇస్తే, సర్వైకల్​ క్యాన్సర్​ నుంచి కాపాడొచ్చు. అలాగే లివర్​ని దెబ్బతీసే హెపటై టిస్​–బి క్యాన్సర్​కి కూడా వ్యాక్సిన్​ ఉంది.  
వ్యాక్సిన్​ వేసుకోవచ్చు
 క్యాన్సర్​ ఉన్నవాళ్లు కరోనా వ్యాక్సిన్​ వేసుకోవాలా? వద్దా?  అని ఆలోచిస్తుంటారు. డయాబెటిస్​, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ల లెక్కనే వీళ్లకి కూడా వ్యాక్సిన్​లో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈమధ్యే క్యాన్సర్​ నుంచి కోలుకున్నవాళ్లు, ట్రీట్మెంట్​ తీసుకుం టున్నవాళ్లు కూడా కరోనా వ్యాక్సిన్​ వేసు కోవచ్చు. అయితే,  లుకేమియా వంటి బ్లడ్​ క్యాన్సర్​ ఉన్నవాళ్లు మాత్రం  తీసుకోవద్దు.  

-డాక్టర్ సీఎస్ రావు, చీఫ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ,రెనోవా  సౌమ్య క్యాన్సర్ సెంటర్, సికింద్రాబాద్