ఇయ్యాల బహుజనుల హీరో కాన్షీరాం జయంతి

 ఇయ్యాల బహుజనుల హీరో  కాన్షీరాం జయంతి

దేశంలో అణగారిన కులాలకు ఆయన ఒక  హీరో. ఏండ్ల కొద్ది బహుజనులను అణచివేస్తున్న కుల వివక్షను ఎదిరించి, బలహీన వర్గాలను బలమైన బహుజన శక్తిగా పరివర్తన చెందేందుకు కృషి చేసిన మహానేత కాన్షీరాం. ‘‘ఓట్లు మావి రాజ్యం మీదా?’’ అనే నినాదంతో అగ్రకుల రాజ్యాధికారాన్ని ప్రశ్నించిన రాజకీయవేత్త. పాలితులుగా ఉన్న చిన్న కులాలను పాలకులుగా మార్చేందుకు కృషి చేసిన ఉద్యమ నాయకుడు. దేశంలో ఉన్నత భావాలు కలిగిన బహుజన నేత.. బహుజన రాజకీయ వ్యూహకర్త కాన్షీరాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసిన ఆ మహనీయుడు జయంతి ఇయ్యాల్నే.

పంజాబ్ రాష్ట్రం రోపార్ జిల్లాలో ఖ్యాస్పూర్ గ్రామంలో భీష్ణషింగ్ కౌర్, హరిసింగ్ దంపతులకు 1934 మార్చి​ 15న  కాన్షీరాం పుట్టాడు. ఆయన పూర్వీకులు మిలటరీ ఉద్యోగులు. అందువల్ల కాన్షీరాంకు చిన్నతనం నుంచే ఆత్మ గౌరవం, క్రమశిక్షణతో కూడిన జీవితం అలవడింది. ఆయన స్వతహాగా హేతువాది, మానవతా వాది. బీఎస్సీ పూర్తి చేసి 1958లో మహారాష్ట్ర పూణే సమీపంలోని కీర్కిలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఎక్స్​క్లూజివ్ రీసెర్చ్ డిఫెన్స్ లేబరేటరీలో చేరాడు. అప్పుడే సహచర ఉద్యోగులతో కలిసి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి, వాల్మీకి జయంతి సెలవుల గురించి పైఅధికారులను ప్రశ్నించి సస్పెన్షన్‌‌కు గురయ్యాడు. ఆ తర్వాత తన తోటి వారిని తిరిగి ఉద్యోగంలో చేర్పించడంలో, అంబేద్కర్​, వాల్మీకిల జయంతులను సెలవులుగా ప్రకటించాలని పోరాటం చేసి విజయం సాధించాడు. 

అంబేద్కర్​ రాజకీయ సిద్ధాంత స్ఫూర్తితో..

1971లో కాన్షీరాం తన ఉద్యోగాన్ని వదిలేశాడు. పెళ్లి, కుటుంబం గురించి ఆలోచించకుండా అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతం స్ఫూర్తితో బహుజన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాడు. అంబేద్కర్ రచించిన ‘కులనిర్మూలన’ రచనను అధ్యయనం చేసి, ఆయన రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (రిప్​) లో 8 ఏండ్లు పని చేశాడు కాన్షీరాం. అంబేద్కర్ మరణించిన తర్వాత ఆయన రాజకీయ ఉద్యమం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​లోనూ వెనుకబడింది. మహారాష్ట్రలో అంబేద్కర్ రాజకీయ ఉద్యమం మొత్తంగా అంతరించిపోయింది. అంబేద్కరిస్టులుగా తమను పిలుచుకునే వారు చెంచాలుగా, దళారులుగా మారిపోయారు. ఈ తీరు కాన్షీరాంను పూర్తిగా కలిచివేసింది. తనదైన శైలిలో రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అనుకున్నాడు. అయితే రాజకీయేతర మూలాలను బలోపేతం చేసిన తర్వాతే రాజకీయ ఉద్యమం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉద్యోగులను సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. ఉద్యోగ సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేశాడు. చివరకు 5 సంవత్సరాల కఠోరశ్రమ, అధ్యయనం, పరిశీలన తర్వాత ‘బాంసెఫ్’ అనే పేరుతో ఉద్యోగుల సంఘాన్ని ప్రారంభించాడు. 

బాంసెఫ్​ సంస్థ ద్వారా..

ఏ సమాజం నుంచి పుట్టామో ఆ సమాజం రుణం తీర్చుకోవాలని ఉద్యోగులకు బోధిస్తూ ‘పే బ్యాక్ టు ది సొసైటీ’ అనే నినాదంతో బాంసెఫ్‌‌ సంస్థను స్థాపించాడు కాన్షీరాం. బహుజన సమాజానికి ఉద్యోగులు తమ ఆలోచనలను, ప్రతిభను, ధనాన్ని, సమయాన్ని కేటాయించాలని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులను చైతన్య పరిచాడు. ‘అంబేద్కరిజం పునర్జీవిస్తుందా?’ అనే అంశంపై దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించి అంబేద్కర్ రాజకీయ భావజాలాన్ని విస్తృతంగా బహుజనంలోకి తీసుకెళ్లాడు. అంబేద్కర్ మేళా రథయాత్ర పేరుతో అంబేద్కర్ జీవితాన్ని పోరాటాన్ని ఫొటోలను, చిత్రపటాలతో ప్రదర్శిస్తూ 9 రాష్ట్రాల్లో అంబేద్కర్ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అట్టడుగు స్థాయి నుంచి అధికారం సాధించే స్థాయికి ఎదగాలని కాన్షీరాం తన ప్రసంగాల్లో పదే పదే బోధించేవాడు. బాంసెఫ్ సంస్థ ద్వారా వేలాది క్యాడర్ క్యాంపులు, సెమినార్లు వర్క్ షాపులు నిర్వహించాడు. ఆయన సంఘటన్ అనే పత్రిక కూడా నడిపాడు. బుద్ధిస్ట్ రీసెర్చ్ సెంటర్ స్థాపించాడు. బహుజన వెనుకబడిన వర్గాలను తమ చేతుల్లో తోలుబొమ్మలుగా (చెంచాలుగా ) అగ్రకులాలు ఎలా ఉపయోగించుకునేవాళ్లో తన ‘చెంచాయుగం’ పుస్తకంలో చెప్పాడు. 

బహుజన సమాజ్​ పార్టీ ఆవిర్భావం..

1984 ఏప్రిల్ 14న ఢిల్లీలో లక్షలాది ప్రజల సమక్షంలో నీలిజెండాలు రెపరెపలాడగా బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భవించింది. బహుజనులలో ఓటు చైతన్యాన్ని పెంచేందుకు వారు తమ ఓటు తమకే వేసుకునేందుకు, అగ్రకుల పార్టీలకు ఓటును అమ్ముకోకుండా ఉండేందుకు, వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కాన్షీరాం విస్తృత ప్రచారం చేశాడు. ఓట్లు మావి.. -రాజ్యం మీదా! ఇకపై సాగదు- ఇకపై సాగదు!! పార్లమెంటుకు నడువు నీ కాళ్లపై నువ్వే నడువు అంటూ.. ఇలా నిరంతరం బహుజనుల్లో రాజకీయ చైతన్యాన్ని నింపుతు కాన్షీరాం తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. రాజకీయ కార్యక్రమాలను రూపకల్పన చేసి  రాజ్యాధికార సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా ప్రజల్లోకి  తీసుకువెళ్లి, ఒక మిషనరీలా రాజకీయాలు నడిపాడు. రాజకీయ కార్యాచరణ ద్వారా సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి సాధ్యమని కాన్షీరాం దృఢంగా విశ్వసించేవాడు. ‘‘రాజకీయ ఉద్యమాన్ని ఎలా నడపాలో నేను బాబాసాహెబ్ నుంచి నేర్చుకున్నాను” అని ఆయన తరచూ అనేవాడు.  తద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా మహిళా నేత అయిన మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశాడు.

రాజకీయ వ్యూహకర్తగా..

కాన్షీరాం అట్టడుగు సమాజం నుంచి నీతి, నిజాయతీ, నిబద్ధత, సమర్ధత కలిగిన లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను తయారు చేశాడు. కింది వర్గాల ప్రజలను ఉన్నత వర్గాల ప్రజలు  ఎలా పరిపాలించారో వివరించాడు. బానిస కులాలను పాలకులుగాఎదిగేలా చేశాడు. రాజకీయ వ్యూహరచనలో అంబేద్కర్​కు కాన్షీరాంకు ఏకరూపకత కన్పిస్తుంది. కాన్షీరాం రాజకీయ వనరులు రెండు మార్గాల ద్వారా సమకూర్చుకున్నాడు. ఒకటి కార్యకర్తలను తయారు చేసి పటిష్టమైన రాజకీయ పార్టీ నిర్మించడం. రెండోది బహుజనుల సాంస్కృతిక అంశాలను రాజకీయ అధికారం అనే అంశంపై చర్చగా మార్చాడు. సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి కోసం పాదయాత్ర చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించాడు. ఆయన తననెప్పుడూ నాయకుడిగా ప్రకటించుకోలేదు. తాను బహుజన సమాజాన్ని నిర్మించే ఉద్యమ ఆర్గనైజర్‌‌‌‌నని మాత్రమే అంటుండే వాడు. కాన్షీరాం ఈనాడు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ దేశంలో 85 శాతానికి పైగా ఉన్న బహుజనులకు దిశానిర్దేశం చేసిన ఒక బలమైన సంస్థను నిర్మించి ఇచ్చాడు. బీఎస్​పీ ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా ఆయన వారసత్వ సంపదగా మనకు అందించాడు. ఆయన చూపిన బాటలో నడిచి బహుజన రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.
- కర్రోల్ల రాజు బహుజన్, సోషల్​ ఎనలిస్ట్​