- సమ ఉజ్జీల సమరంలో గెలుపెవరిదో..?
అహ్మదాబాద్: ఐపీఎల్ –14లో బలాబలాల పరంగా సమంగా ఉన్న రెండు పెద్ద జట్ల మధ్య పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో గెలిచిన ఢిల్లీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఈ మ్యాచ్బరిలోకి దిగుతోంది. మరోపక్క చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడి...తొలి ఓటమి రుచి చూసిన బెంగళూరు తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టింది. ఏదేమైనా సమ ఉజ్జీల్లా కనిపిస్తున్నా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు తమ మిడిలార్డర్లో డొల్లతనాన్ని సరి చేసుకోవాలి. చెన్నై మ్యాచ్‌లో ఆర్సీబీ మిడిలార్డర్ పెవిలియన్‌కు క్యూకట్టింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు కెప్టెన్ కోహ్లీ, పడిక్కల్‌కు మిడిలార్డర్ నుంచి సపోర్ట్ దొరక్కపోతే గెలవడం కష్టమే. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ తమ వంద శాతం ఇస్తేనే ఢిల్లీపై ఆర్సీబీ పైచేయి సాధిస్తుంది. ఇక, బౌలింగ్‌లో కోహ్లీసేనకు పెద్దగా సమస్యల్లేవు. లాస్ట్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో జడేజాకు 37 రన్స్ ఇచ్చుకున్న హర్షల్ పుంజుకుంటాడో లేదో చూడాలి. ఇక, ఢిల్లీకి ఎలాంటి సమస్యల్లేవు. ఓపెనర్లు ధవన్, పృథ్వీ సూపర్ ఫామ్‌లో ఉండగా స్మిత్, కెప్టెన్ పంత్ వీరికి అండగా నిలుస్తున్నారు. స్టోయినిస్, హెట్మయర్తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్ విషయానికొస్తే స్పిన్నర్ అశ్విన్ సీజన్‌నుంచి తప్పుకోవడంతో అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేసర్లు అవేశ్, రబాడ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం.
