కాకా యాదిలో: పోరాటమే శ్వాసగా.. తెలంగాణమే ధ్యాసగా

కాకా యాదిలో: పోరాటమే శ్వాసగా.. తెలంగాణమే ధ్యాసగా
  • గరీబోళ్ల గుండె గొంతుకై కడవరకు కలబడి నిలబడిన 
  • మహనీయుడు మన కాకా..ఇయ్యాల జి. వెంకటస్వామి జయంతి

నా తెలంగాణ గడ్డ నిత్య పోరాటాలతో రక్తమోడింది. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే మలిదశ తెలంగాణ ఉద్యమ విజయం వరకు తెలంగాణ గడ్డ ఉద్యమిస్తూనే ఉంది. అన్యాయం జరిగిన ప్రతిసారీ పిడికిలి బిగించింది. ఆ క్రమంలనే సాయుధ పోరాటం ముగిసిన కొన్ని రోజులకే అంటే 1952ల గైర్ ముల్కీ ఉద్యమం తెలంగాణ చరిత్రను ఎరుపెక్కించింది. అందరు తొలిదశ తెలంగాణ ఉద్యమం అంటే 1969 ముచ్చటే చెపుతరు. కానీ దానికి ముందే హక్కుల కోసం తెలంగాణ కొట్లాడింది.          - కాకా ఆత్మకథ ‘మేరా సఫర్​’ నుంచి..

గరీబోళ్ల గుండె చప్పుడు కాకా

కాకా జీవితం కార్మికులు, పేదలతోనే మమేకమైంది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ వారి చుట్టూనే తిరిగేవి. నిలువ నీడలేని నిరుపేదలకు కనీసం గూడు కల్పించాలని గుడిసెల పోరాటం చేశారు. 1949లో నేషనల్ హట్స్ యూనియన్ స్థాపించి ఖాళీ జాగల్లో గుడిసెలు వేయించారు. సర్కారు, బడా భూస్వాముల స్థలాల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేదోళ్లకు మద్దతుగా నిలబడ్డారు. 20 ఏండ్ల పాటు పోరాడి దాదాపు 80 వేల పైచిలుకు గుడిసెల్ని వేయించిన ఘనత కాకాది. అందువల్లే ఆయనను అంతా ‘గుడిసెల వెంకటస్వామి’ అని కూడా పిలిచేవారు. 1973–1977 వరకూ కేంద్ర మంత్రిగా ఉన్న కాకా నిరుపేదలకు గూడుతోపాటు కూడు ఉండాలన్న ఉద్దేశంతో నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరకు అందించే రేషన్ షాపుల ఏర్పాటు ఆలోచన చేశారు. ఇప్పటికీ కోట్లాది మంది పేదలకు తినడానికి తిండి దొరుకుతోందంటే అది కాకా చలవే.
కంపెనీ పెట్టి చూపిస్త అని..
హైదరాబాద్ ఆస్ బెస్టాస్ కంపెనీలో మూడు రూపాయల ఇంక్రిమెంట్ ఇవ్వాలని కార్మికులు సమ్మె చేశారు. అయినా యాజమాన్యం మొండిపట్టు వీడలేదు. పైగా పోలీసులతో లాఠీచార్జ్​ చేయించింది. ఇదేమి అన్యాయమని నిలదీస్తే మీకు ఫ్యాక్టరీలు పెట్టడం చేతకాదని దాని యజమాని ఎగతాళి చేశాడు. అహం దెబ్బతిన్న వెంకటస్వామి ‘బిడ్డా! ఇదే కంపెనీని నేను పెట్టి చూపిస్తా’ అని చాలెంజ్​ విసిరారు. ఫ్యాక్టరీ లైసెన్సు తీసుకునేంత వరకు నిద్రపోలేదు. కానీ, యూనియన్ పనుల ఒత్తిడిలో ఫ్యాక్టరీ పెట్టలేకపోయారు. ఆ లోటును వెంకటస్వామి కుమారుడు వివేక్ తీరుస్తూ.. విశాక ఆస్ బెస్టాస్ ఫ్యాక్టరీని స్థాపించారు. అలాగే కార్మిక సంఘాలకు ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్ ను తెచ్చింది కాకానే. అలాగే 1990 దశకంలో దాదాపు ఖాయిలా పడ్డ సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రూ.1,100 కోట్లు అప్పుగా ఇప్పించి, మళ్లీ సంస్థ లాభాల బాట పట్టేలా చేయడంలో కాకా కృషి మరువలేనిది. కాకా సింగరేణికి అండగా నిలబడకుంటే ఇప్పుడు సంస్థ నిలదొక్కుకోవడం కష్టంగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. 
పెన్షన్​ స్కీం ఆయన తెచ్చిందే..
కేంద్ర కార్మిక మంత్రిగా కాకా ఉన్నప్పుడే ప్రపంచం మెచ్చిన పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టారు. దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో అదో మైలురాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు, కూలీలకు ముసలితనంలో భద్రత ఇవ్వాలన్నదే ఈ స్కీం ఉద్దేశం. ‘ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటారు. కార్మికుడు ఏం పాపం చేసిండు?’ అన్న ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి పార్లమెంట్​లో బిల్లు పెట్టేంత వరకు పట్టువదల్లేదు. పెన్షన్​ స్కీం వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నేషనల్​ లేబర్​ ఆర్గనైజేషన్​ కాకాను జెనీవాకు ఆహ్వానించింది. 1995లో బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీం రూపొందించిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. కాకా పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలైన సందర్భాల్లో కూడా ఆయన బాధపడేవారు కాదు. ప్రజల తీర్పును అంగీకరించినా వారికి దూరమయ్యే వారు కాదు. ఆయన గెలిచినప్పుడు నియోజకవర్గంలో ఎన్ని పర్యటనలు చేశారో ఓటమి తర్వాత అంతకన్నా ఎక్కువగా పర్యటించేవారు.
అందరికీ చదువు అవసరమని..
తాను చదువుకోకున్నా, పిల్లలకు మంచి చదువులు చెప్పించటానికి కాకా వెనుకాడలేదు. తాను ఇంగ్లిష్​ నేర్చుకోవడానికి ఎలాంటి మొహమాటం పడేవారు కాదు. 1950లో మొదటిసారి అంబేద్కర్ ను కలిసినప్పుడు ‘వెంకటస్వామి.. నీకున్న పేరుతో దళితులు, పేదలకు ఉన్నత చదువులు అందించే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు?’ అని ప్రశ్నించారట. అట్టడుగువర్గాలకు చదువు అందించాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు కాకా. అదే స్ఫూర్తితో, రాజకీయాల్లో బిజీగా ఉన్నా, తన ఆలోచనలకు రూపం ఇచ్చారు. 1973లో బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని ప్రారంభించి ఎంతో మందికి విద్యనందిస్తున్నారు.
                                                                                                                                                                             - డా.శ్రవణ్ దాసోజు, జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ

ఇంటి పేరు ‘గడ్డం’
అందరూ పిలిచే పేరు ‘కాకా’. అంబేద్కరిజాన్ని నమ్మి గరీబోళ్ల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు కాకా వెంకటస్వామి. కన్నుమూసే వరకూ పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ గా బతికారు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ముందువరుసలో ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకత గురించి పాలకులకు చెప్పి ఒప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. గరీబోళ్ల గుండె చప్పుడుగా నిలిచిన కాకా వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. కాకా జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత.

ఆయన ఆశ, శ్వాస.. తెలంగాణ
నైజాం గడ్డ మీద పుట్టి, జీవితకాలం తెలంగాణయే ఆశగా, శ్వాసగా బతికిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి. పార్టీ సీనియర్​ నాయకునిగా ఉండి, పదవి పోతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం కోసం గొంతెత్తారు. 1969లో తెలంగాణ కోసం జైలుకు వెళ్లి ఆ తదుపరి పోలీసు కాల్పులకు ఎదురునిలిచారు. దేశ రాజకీయాల్లో అవినీతి అనే మరక అంటని నాయకుడు కాకా. ఆయన అడుగుజాడలను ఇప్పుడు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని కష్టాలొచ్చినా, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వీడని యోధుడాయన. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న ఇప్పటి తరం నాయకులకు కాకా నడిచిన బాట ఒక పాఠం లాంటిది. భవిష్యత్​ తరాలకు కూడా కాకా మార్గదర్శిలాంటి వారు.

అందరివాడు

కాకా వెంకటస్వామి పేద ప్రజల పెన్నిధి. అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించే నాయకుడయ్యారు. ఆయన ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. నేల మీదే ఉండి పనిచేశారు. హైదరాబాద్​లో వేలాది మంది పేదల తరఫున భూపోరాటాలు చేసి వారికి ఇంటి స్థలం ఇప్పించిన ఘనత కాకాదే.
అలుపెరుగని పోరాటం
తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో కాకా అలుపెరుగని పోరాటం చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​తోనూ గొడవకు దిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే అంటూ సీడబ్ల్యూసీ లాంటి సమావేశం నుంచి కూడా బయటకు వచ్చేశారు. ఉద్యమానికి వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థికంగానూ ఎంతో చేయూత అందించారు. స్థిరమైన రాజకీయాలు, నమ్మిన సిద్ధాంతాలను దాటి ఎన్నడూ భిన్నంగా కాకా వ్యవహరించిన దాఖలాలు లేవు. నిత్యం కార్మికులు, పేదోళ్ల కోసం పోరాడే వారు. సామాన్యుడు సైతం కాకాను ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం ఉండేది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పోలీసులు నక్సలైట్ల పేరిట అమాయకులను తీసుకెళ్లి కాల్చి చంపిన సందర్భాల్లో అలాంటి ఘటనలను బహిరంగంగానే ఖండించేవారు. ఎలాంటి శషబిషలు లేకుండా బాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించేవారు. ఆయన తర్వాత ఆయన చిన్న కొడుకు గడ్డం వివేక్  వెంకటస్వామి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. 
ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం
ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు అనే ఆలోచన ఆయనకు ఉండేది కాదు. సహాయం కోసం వచ్చే ప్రతీ ఒక్కరినీ కాకా స్వయంగా కలిసి చేతనైనంత సాయం చేసే వారు. ఈ అలవాటు.. అలాంటి మానవ సంబంధాలు ప్రతి ఒక్కరితో మెయింటైన్ చేయడంలో కాకా చిన్న కొడుకు వివేక్​ దిట్ట. కాకా పెద్ద కొడుకు, మాజీ మంత్రి గడ్డం వినోద్ కూడా ఈ విషయంలో మెరుగుగానే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో వివేక్ తోటి పార్టీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి హైకమాండ్​పై ఒత్తిడి తెచ్చారు. పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. 
సింగరేణి అంటే ఎంతో ప్రేమ
కాకాకు నల్లబంగారు నేల అన్నా.. అక్కడి మనుషులన్నా ఇష్టం. ప్రేమ. కాకా మొత్తంగా 101 కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. సింగరేణిని కాపాడటంలో కాకా కీలకంగా వ్యవహరించారు. కేంద్రం నుంచి అప్పు.. మారిటోరియం ఇప్పించారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని కోరారు. ఏ విషయాన్ని అయినా కాకా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ఆయన వద్ద దాపరికాలు డాంబికాలు ఉండేవి కావు. కాకా ఒక తెరిచిన పుస్తకం లాంటి వారు. ఓపెన్ హార్ట్.. ఓపెన్ హ్యాండ్స్ కాకాకే సొంతం. ప్రాణహిత--–-చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం కాకా అప్పటి ఉమ్మడి రాష్ట్రం సీఎం దివంగత వైఎస్సార్ తో తలపడ్డారు. ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజు అక్కడికి వచ్చి సభలోనే తన ఆశయం నెరవేర్చినందుకు వైఎస్సార్ కు ధన్యవాదాలు చెప్పారు. అదీ కాకా వ్యక్తిత్వం. కాకా లాంటి నేతలు అరుదు. ఆయన వేసిన బాటో ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
                                                                                                                                                                                                             - ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్
కార్మికులతో విడదీయలేని బంధం
కాకా జీవితంలో ఎక్కువ భాగం కార్మిక లోకంతోనే గడిచింది. యూనియన్ లీడర్ గానే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సుదీర్ఘ కాలం కార్మిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే శ్రామికులకు పెద్ద దిక్కుగా నిలబడ్డారు. కార్మికులు కన్నీళ్లు పెడితే దేశం బాగుండదు అన్న సిద్ధాంతాన్ని జీవించినంత కాలం పాటించిన గొప్ప శ్రామికవాది. నాగార్జునసాగర్ కడుతున్నప్పుడు వేలాది మంది శ్రామికులు రక్త మాంసాల్ని ధారబోసి డ్యాం, కెనాల్ పనులు చేస్తుంటే.. కనీస వేతనాలు, తలదాచుకోవటానికి వసతుల గురించి పట్టించుకున్న వారే లేరు. వాళ్లందర్నీ సమీకరించి, అన్యాయాల్ని ఎలుగెత్తి చాటిన లేబర్ లీడర్ వెంకటస్వామి. సాగర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంటుగా వర్కర్స్ హక్కులకై ఆయన పోరాటాలు సాగించారు. శ్రీశైలం ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు వర్కర్స్ తో యూనియన్లు పెట్టి, కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతూనే.. మరోవైపు వాళ్లు నివసించే ప్రాంతాల్లో మెరుగైన జీవన స్థితిగతులు కల్పించడానికి కృషి చేశారు.


తెలంగాణ కోసం  తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి.. 


తెలంగాణ నేతలతో రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌ల ఇందిరాగాంధీ సమావేశమయింది. చెన్నారెడ్డి, మేల్కోటె, కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు ఎంతోమంది ఇందిరను కలిసినం. నేను కూడా ఆమెతో మాట్లాడిన. తెలంగాణ ఇస్తనని ఆ సమావేశంలనే ఇందిరాగాంధీ క్లియర్‌‌‌‌‌‌‌‌గా చెప్పింది. అయితే కొంచెం ఓపిక పట్టాలని కోరింది. చెప్పాపెట్టకుండా ఇందిరాగాంధీ రావడం, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడంతో బ్రహ్మానందరెడ్డి పరేషాన్ అయిండు. ఆ క్రమంలనే ముషీరాబాద్ జైల్ల ఉన్న విద్యార్థి, రాజకీయ నేతల హత్యకు కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు వందలాదిగా ముషీరాబాద్ జైలును ముట్టడించిన్రు. ముషీరాబాద్ విషయం తెలిసిన వెంటనే నేను అక్కడికి పోయిన. నన్ను చూడంగనే ఉద్యమకారులకు ధైర్యం వచ్చింది. పోలీసులు శాన మంది ఉన్నా, లెక్కచేయకుండా జైలు లోపలికి సొచ్చుకుపోవడానికి కోశిష్‌‌ చేసిన్రు. పోలీసులు టియర్ గ్యాస్ వదిలిన్రు. అయినా నిరసనకారులు వెనుకకు తగ్గలేదు. దాంతో ఫైరింగ్ చేసిన్రు. పోలీస్ కాల్పులల్ల నా పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయిన్రు. నా తలకు దెబ్బ తాకింది. నేను బేహోష్ అయిన. నన్ను ఆసుపత్రికి తీసుకపోవడానికి కొంతమంది జీపు తీసుకొచ్చిన్రు. ఆ జీపుపైనా పోలీసులు కాల్పులు జరిపిన్రు. ఆ గందరగోళంల జీపు పల్టీ కొట్టింది. జీపు నా మీద పడ్డది. నా ముక్కు నుంచి, నోట్ల నుంచి మస్తు రక్తం పోయింది. ఆ పరిస్థితిల నన్ను చూసిన ఏ ఒక్కరికీ నేను బతుకుతనన్న నమ్మకం లేకుండె. అయినా ఆశ చావక ఆసుపత్రికి తీసుకపోయిన్రు. నాకు దెబ్బలు తాకిన విషయం తెలవడంతో చెన్నారెడ్డి గాబరాగా దవాఖానకు వచ్చిండు. అద్దరాత్రి రెండు గంటల దాక నా బెడ్ పక్కనే కూర్చున్నడు. ఈ విషయం నేను స్పృహలోకి వచ్చినంక తెలిసింది. నేను మొండోన్ని. చచ్చిపోతడని అంతా అనుకున్న నాకు ఏం కాలేదు. మూడు రోజుల తరువాత నాకు హోష్ వచ్చింది.  ముషీరాబాద్ ఆందోళన, నాపై కాల్పులు జరపడంతో ఉద్యమం ఇంకా ఉధృతమవుతుందని బ్రహ్మానందరెడ్డి భయపడ్డడు. అందుకే చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, బద్రీ విశాల్ పిట్టి, హషీం, మాణిక్యరావు, పద్మనాభన్, రఘువీర్ రావు వంటి ఉద్యమ నేతలను రాత్రికిరాత్రే అరెస్ట్ చేయించిండు. తెలంగాణ జైళ్లల ఉంచితే ప్రమాదమనుకున్న ప్రభుత్వం రాజమండ్రితో పాటు మరికొన్ని ఆంధ్రా జైళ్లకు తరలించింది. ముషీరాబాద్ జైలు ఘటనకు నిరసనగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ నడిపిన్రు. కార్మికులు భారీ ర్యాలీలు తీసిన్రు. స్పృహలోకి వచ్చినంక మేల్కోటె, లక్ష్మీబాయిలను నేను కలిసిన. బ్రహ్మానందరెడ్డి తీరుకు నిరసనగ ఎంపీ పదవులకు రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నం. మా మీటింగ్ అయిన తెల్లారే.. బ్రహ్మానందరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిండు. అయితే అదంతా డ్రామా. ఎందుకంటే రిజైన్ లెటర్‌‌‌‌‌‌‌‌ను గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఇయ్యకుండా అప్పటి పార్టీ ప్రెసిడెంట్ నిజలింగప్పకు ఇచ్చిండు. “కాంగ్రెస్ అధిష్ఠానం తదుపరి నిర్ణయం తీసుకునేదాకా మీరే కొనసాగండి” అని బ్రహ్మానందరెడ్డితో నిజలింగప్ప చెప్పిండు. అప్పటికే ఉద్యమం తీవ్రంగా కొనసాగడం, పోలీసు కాల్పులు, విద్యార్థుల మరణాలతోతెలంగాణ మంత్రుల్లో కదలిక వచ్చింది. వాళ్లు రాజీనామాకు రెడీ అయిన్రు. అది తెలిసే బ్రహ్మానందరెడ్డి రాజీనామా డ్రామా ఆడిండు.

తెలంగాణ ప్రజలపై సాగుతున్న దమనకాండను నిరసిస్తూ 1969 ఆగస్టు18న నేను, మేల్కోటె పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ల లొల్లి చేసినం. చనిపోయిన అమరుల ఫొటోలను పట్టుకుని నిరసన తెలిపినం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసినం. వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినం. నెత్తురు ఏరులై పారుతున్న తెలంగాణ నుంచి వచ్చినం. తుపాకీ గుండ్లను తప్పించుకుని వచ్చినం. ఇప్పటికే 250 మంది ఉద్యమకారులను కాల్చి చంపిన్రు. వందలాది మందిని పీడీ చట్టం కింద అరెస్ట్ చేసిన్రు. యాభై వేలమందిని అక్రమంగ జైల్ల పెట్టిన్రు. ఈ రాక్షస కాండను ఖండిస్తున్నం. మాపై వలసవాదుల పెత్తనం వద్దు. మేం ఎవరికీ బానిసలం కాదు తెలంగాణ సాధించే దాక మా పోరాటం కొనసాగుతుంది.