బంజారాల ఆరాధ్య దైవం సంత్​సేవాలాల్ మహారాజ్​

బంజారాల ఆరాధ్య దైవం సంత్​సేవాలాల్ మహారాజ్​

బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ మహారాజ్. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, గుత్తి సమీపంలోని రాంజీ నాయక్ తండాలో 1739 ఫిబ్రవరి15న జన్మించారు. సంత్ సేవాలాల్ మహారాజ్, క్రమశిక్షణ కలిగిన ఒక బాలజ్ఞానిగా, బంజారా జాతి కులదైవంగా భావించే “సాత్ భవానీ” ఏడుగురు దేవతలలో ఒకరైన “మెరమ్మయాడి”కి భక్తి భావం కలిగినవాడిగా, పశువులను కాసే ఓ సాధారణ లంబాడీ తల్లి బిడ్డగా పెరిగాడు. 18వ శతాబ్దంలో సంభవించిన ఓ కరువుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బంజారా జాతికి ధైర్యం, భరోసానిచ్చి, భవిష్యత్తుకు బాట వేసిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్. బంజారా జాతిలో ప్రధానంగా ఉన్న మూఢ నమ్మకాలను ఆయన పోగొట్టాడు. అప్పటి బ్రిటీష్​వారు బంజారాలను “క్రిమినల్ ట్రైబ్స్”గా చిత్రీకరించిన సందర్భంలో సంఘ ద్రోహాలుగా, బందిపోట్లుగా ముద్ర వేస్తే అటువంటి వాటికి దూరంగా ఉండాలని, జంతువులను వేటాడరాదని, హింస చేయకూడదని, సంచార జీవనం సాగించకుండా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, నలుగురికి మంచి చేయాలే తప్ప చెడు చేయవద్దని, పాశ్చాత్య సంస్కృతి పారదోలాలని, బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని సందేశం ఇచ్చాడు.

మహారాజ్​ గంజ్​ అనే ప్రాంతం

చిన్న పిల్లలు, గొడ్లు గోదా చనిపోతుంటే వాటికి నాటు వైద్యం చేసి బతికించే సందర్భంలో సంత్​సేవాలాల్​ను అందరూ దైవంగా భావించే వారు. బంజారాల పూజా విధానం, పండుగలు చేసుకునే విధానం, పెళ్లి ఆచారాలు ఒక క్రమ పద్ధతిలో కూర్చిన మహా జ్ఞాని సేవాలాల్ మహారాజ్. సామాజిక సేవకుడిగా, ప్రతి తండా తిరిగి బంజారాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపేవాడు. ఆయన వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని జాతికి అంకితం చేశారు. నాటి బ్రిటీష్ పరిపాలకులు చేస్తున్న మత మార్పిడులకు, శిక్షించే విధానాలకు వ్యతిరేకంగా జాతి రక్షణ కోసం పోరాడాడు.

నిజాం రాజు, అలాగే సూరజ్ ఖండ్ రాజులు, బంజారాలు అడవుల్లో జీవిస్తున్న అమాయకులను బంధిస్తుంటే వారితో పోరాడి విముక్తి కలిగించాడు. అలా నేటి హైదరాబాద్ లోని “మహారాజ్ గంజ్" అనే ప్రాంతం సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఉంది. అలాగే ‘బంజారా దర్వాజా’ గోల్కొండ కోటలో బంజారా సైన్యం ఆహార ధాన్య రవాణా చేసే ద్వారంగా చెబుతారు. అలా ఆయన దేశ వ్యాప్తంగా బంజారాలను చైతన్యపరుస్తూ తండాల అభివృద్ధికి ఒక ప్రణాళిక చేసుకోవాలని, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని, హక్కుల కోసం పోరాడాలని కోరాడు. సేవాలాల్​1806 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని యాత్మల్ జిల్లా డిగ్రాస్ తాలూకాలోని ‘రుయి తండా’లో మరణించాడు.

మహారాష్ట్రలోని ‘పోహ్రా దేవిగడ్’ సమీపంలో ఆయనను సమాధి చేశారు. అది బంజారాల తీర్థస్థలి. ప్రతి దసరాకు అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. బోగ్ కార్యక్రమం సేవాలాల్ జయంతి రోజు నిర్వహిస్తారు. ఇలా సంత్ సేవాలాల్ మహారాజ్ పట్టణ, గ్రామ సంస్కృతులకు భిన్నంగా తండాల సంస్కృతిని ఏర్పాటు చేయడంలో ఆ సంస్కృతి రక్షణ కోసం ఒక ‘ఫేరి ఉద్యమాన్ని’ నడిపించాడు. దేశమంతా సంచరించి ఆంగ్లేయులపై పాశ్చాత్య సంస్కృతిపై యుద్ధం ప్రకటించాడు. ప్రతి బంజారా ఒక సైనికుడి వలే తన జాతి సంరక్షణ కోసం పాటుబడాలని పిలుపునిచ్చాడు. అందుకే బంజారాలు ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఎంతో ఇష్టమైన లాప్సి, చుర్మోలను నైవేద్యంగా ‘బోగ్ బండారో’ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. బంజారా జాతి ఉన్నతికి కృషి చేసిన తమ పూర్వీకులను, ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్​పై గల భక్తిని, ప్రేమగా చాటుకుంటారు.

- డా. వెంకటేశ్​ చౌహాన్