నేడు  వరల్డ్  అల్జీమర్స్​ డే

V6 Velugu Posted on Sep 21, 2021

అప్పటిదాకా చూసిన ముఖాలు గుర్తుండవు. రోజూ చేసుకునే  పనులు కూడా మర్చిపోతారు. ఉన్నట్టుండీ అంతా కొత్తగా అనిపిస్తుంది.  ఇవన్నీ అరవైయ్యేళ్లు దాటిన వాళ్లని చాలా ఇబ్బంది పెడతాయి. జ్ఞాపకాల్ని పూర్తిగా తుడిచేసే అల్జీమర్స్​లో కనిపించే లక్షణాలివి​. అల్జీమర్స్​ లక్షణాల్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రెయిన్​ని యాక్టివ్​గా ఉంచే పనులతో అల్జీమర్స్​ తీవ్రతని తగ్గించొచ్చు అంటున్నారు న్యూరోసర్జన్​ రంగనాధం.  

మతిమరుపు అనేది అందరిలో ఉండేదే. అయితే కొందరు మాత్రం కొన్ని విషయాలు, పనుల్ని పూర్తిగా మర్చిపోతారు. మెదడులోని కణాలు కొన్ని కారణాల వల్ల నెమ్మదిగా తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే అల్జీమర్స్​ అంటారు. ఇలాంటి వ్యాధి ఒకటుందని 1901లో గుర్తించారు. అల్జీమర్స్​లో ‘ఎర్లీ ఆన్​సెట్ అల్జీమర్స్​’​, ‘లేట్ ఆన్​సెట్ అల్జీమర్స్’ అని రెండు రకాలున్నాయి. అల్జీమర్స్​ కేసులు అరవై యేళ్లు పైబడ్డవాళ్లలోనే ఎక్కువ. కానీ, ఈ మధ్య ముప్పయ్యేళ్లు దాటిన వాళ్లలో కూడా​ కనిపిస్తోందని స్టడీలు చెబుతున్నాయి. మన దేశంలో అరవైయ్యేళ్లు దాటినోళ్లలో ప్రతి 27 మందిలో ఒకరు అల్జీమర్స్​ బాధితులే. మగవాళ్ల కంటే ఆడవాళ్లలో అల్జీమర్స్​ కేసులు రెండు శాతం ఎక్కువట.  
అంతా మెదడులోనే...
అల్జీమర్స్​ బారిన పడేవాళ్ల మెదడులో ఉండే ‘సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్​’ శాతం పెరుగుతుంది. దాంతో  బ్రెయిన్​ సైజ్​ 25 శాతం తగ్గుతుంది. బ్రెయిన్​లో నీరు పెరుగుతుంది. బ్రెయిన్​లోని ‘ఎమలాయిడ్’ ప్రొటీన్ పెరగడం వల్ల ‘క్లాట్స్​’ ఏర్పడతాయి. ‘టౌ’ ప్రొటీన్లు పెరగడం వల్ల ‘ట్యాంగిల్స్’ వస్తాయి. దీనివల్ల శరీర భాగాలకి సిగ్నల్స్​ అందవు. దాంతో మూత్రం కంట్రోల్​లో ఉండదు. నడకలో తేడా వస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. మనుషుల్ని, వస్తువుల్ని గుర్తు పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీరియస్​ అల్జీమర్​లో నడవడం, కూర్చోవడం, తినడం కూడా కష్టమవుతుంది. సొంతంగా పనులు చేసుకోలేరు. ఒక్కోసారి మల్టీ ఆర్గాన్​ డిస్​ఫంక్షన్​కి దారి తీసే ఛాన్స్ ఉంది.
కారణాలివి...
వయసు పైబడడం వల్ల బ్రెయిన్​ సెల్స్ తగ్గడమే అల్జీమర్స్​కి ప్రధాన కారణం. బ్రెయిన్​ సెల్స్​ తగ్గడానికి స్ట్రెస్​, ​నిద్రలేమి, లైఫ్​స్టయిల్​ మార్పులు, విటమిన్స్​(బి1, బి12, బి6) లోపం, ట్రాఫిక్​ సౌండ్ వంటివి కూడా కారణాలే. జెనెటికల్‌గా కూడా అల్జీమర్స్​ వస్తుంది. డిప్రెషన్, మూడీగా ఉండడం కూడా అల్జీమర్స్​ లక్షణాలే. ఆల్కహాల్, డ్రగ్స్​, పొగతాగే అలవాట్లు ఉన్నవాళ్లు అల్జీమర్స్​ బారిన పడే ఛాన్స్​ ఎక్కువ. గుండె జబ్బులు ఉన్నవాళ్లు అల్జీమర్స్​ బారిన పడే అవకాశం కొంచెం ఎక్కువ.  వీళ్లలో మెదడులోని చిన్నరక్తనాళాలు బ్లాక్​ అవడం వల్ల మతిమరుపు వస్తుంది. దీన్ని ‘వాస్క్యులార్​ డిమెన్షియా’ అంటారు. బ్రెయిన్​ ట్యూమర్స్, థైరాయిడ్​ లోపం​ ఉన్న వాళ్లలో కూడా అల్జీమర్స్​ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమస్యల్ని అల్జీమర్స్​ అనుకుని పట్టించుకోకపోతే ట్రీట్మెంట్​ ఆలస్యమవుతుంది.   
టెస్ట్ చేయడం ఇలా...
బ్రెయిన్​లో క్లాట్​ ఉందా?  బ్రెయిన్​లో నీరు చేరిందా?  ట్యూమర్​ ఉందా? అనేది సిటి స్కాన్​, ఎంఆర్​ఐలతో తెలుస్తుంది. పెట్​(పాజిట్రాన్​ ఎమిషన్​ టోమోగ్రఫీ) స్కాన్​ చేయించుకుంటే ఎమలాయిడ్​ ఎంత ఉంది? టౌ ప్రొటీన్​ పెరిగిందా? అనేవి తెలుసుకోవచ్చు. ఫంక్షనల్​ ఎంఆర్​ఐ చేయించుకుంటే బెటర్​.   
మెడిసిన్స్​ 
అల్జీమర్స్​కి ఫలానా మెడిసిన్​ అంటూ లేదు. రిలీఫ్​నిచ్చే మెడిసిన్స్​ అయితే దొరుకుతున్నాయి. గాలంటమైన్,​ డొనేపెజిల్​, మెమాంటిన్, అడుకానుమాబ్​ (అమెరికా డ్రగ్​) వంటి మెడిసిన్స్​ అల్జీమర్స్​ లక్షణాల తీవ్రతని తగ్గిస్తాయి. అయితే వీటిని డాక్టర్ సలహాతోనే వాడాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్​లో అల్జీమర్స్​ పేషెంట్లకి హైపర్​బారిక్​ ఆక్సిజన్​ ట్రీట్మెంట్​ చేస్తారు. 
ఈ జాగ్రత్తలు ముఖ్యం
అరవైయ్యేళ్లు దాటాక మానసికంగా యాక్టివ్​గా ఉండాలి. అందుకోసం ఏదో ఒక పని కల్పించుకోవాలి. ఫారెన్​ లాంగ్వేజ్​, ఇను​స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, మ్యూజిక్​, బుక్​ రీడింగ్, పజిల్స్​వంటివి మెదడుని యాక్టివ్​గా ఉంచుతాయి. ​అల్జీమర్స్​ పేషెంట్ దగ్గర ఫోన్​ ఉంటే ఆ ఫోన్​కి మొబైల్​ లొకేటర్​ ఉండాలి. వాళ్ల గదిలో  హాయినిచ్చే ఫొటోలు, మెమొంటోలు పెట్టాలి. వాళ్ల కదలికలపై నిఘా కోసం గది తలుపులు, కిటికీలకి అలారం పెట్టిస్తే మరీ మంచిది. వీళ్లకి ఒక వస్తువు ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రూంలో ఎక్కువగా అద్దాలు ఉంచొద్దు. బాత్రూమ్​లో సపోర్ట్ కోసం హ్యాండిల్స్​ ఏర్పాటుచేయాలి. 
ఫుడ్​ కూడా ముఖ్యమే
తినకూడనివి: చక్కెర ఫుడ్స్ తగ్గించాలి. వైట్​ షుగర్​, వైట్ బ్రెడ్​, సాల్ట్ చిప్స్​, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్​ఫుడ్​, పేస్ట్రీలు, ప్రాసెస్డ్​ మీట్​ వంటివి తక్కువ తినాలి. వీటితో పాటు బిపి, షుగర్​ కంట్రోల్​లో ఉంచుకోవాలి.
తినాల్సినవి: ముదురు రంగులో ఉన్న పండ్లు ఎక్కువ తినాలి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్​ ఫ్రీరాడికల్స్​ని తొలగిస్తాయి. ఆలివ్​ ఆయిల్​, నట్స్, అవకాడో, అప్రికాట్‌​, బెర్రీలు, యాపిల్​, బీన్స్​ డైట్​లో ఉండాలి. కూరగాయలు, చేపలు, కోడిగుడ్డు ఎక్కువ తినాలి. మెడిటేరియన్​ డైట్(​ కూరగాయలు, పండ్లు, నట్స్​, తృణధాన్యాలు) తింటే బెటర్​.  
పల్లెల్లోనే ఎక్కువ
అల్జీమర్స్​ కేసులు సిటీల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువట. అందుకు కారణం అల్జీమర్స్​కి దారితీసే కారణాల్లో ఒకటైన స్మోకింగ్​ పల్లెజనంలో ఎక్కువ. ఊళ్లల్లో ఉండేవాళ్లు  రోజుకు 15 సిగరెట్లు/ బీడీలు తాగుతున్నారట. అది కూడా చిన్నవయసు లోనే స్మోకింగ్​కి అలవాటు పడుతున్నారు.  

మన దగ్గర తక్కువ, పసుపు వల్లనే  
అమెరికా, జపాన్​ వంటి దేశాలతో పోల్చితే మనదగ్గర అల్జీమర్స్ కేసులు దాదాపు నాలుగు శాతం కంటే తక్కువ.  అందుకు కారణం మన వంటకాల్లోని పసుపు. దీని లోని కర్క్యుమినాయిడ్​ మెదడు మీద ఎమలాయిడ్​ చేరకుండా చూడడమే కాకుండా పేరుకున్న ఎమలాయిడ్​ని కరిగించేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్​ మెదడులోని నీటిని తగ్గిస్తుంది. నల్ల మిరియాలు, నెయ్యి వంటివి కూడా అల్జీమర్స్​ను తగ్గించే పదార్థాలే.                                                                   డా​.పి.రంగనాధం న్యూరోసర్జన్​ సన్​షైన్ హాస్పిటల్స్ హైదరాబాద్​

Tagged health, life style, , World Alzheimer\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'s Day

Latest Videos

Subscribe Now

More News