
- గ్రేటర్ సిటీలో టాయిలెట్లు క్లీన్ గా ఉండట్లేదు
- మొత్తం 7,500లకు ఉన్నవి 2,250 మాత్రమే
- ఏజెన్సీల మెయింటెనెన్స్ కింద 5 వేల టాయిలెట్లు
- ఏ ఒక్కదానికి క్యూఆర్ కోడ్ కనిపించడం లేదు
- స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కోసమే క్లీనింగ్ చేయిస్తూ..
- వాటినే చూపుతున్న బల్దియా అధికారులు
- పార్కింగ్‌లోనే మొబైల్ బయో టాయిలెట్లు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌లో టాయిలెట్ల మెయింటెన్స్ కు బల్దియా భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నా వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అవి కంపు కొడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారులు వచ్చినప్పుడు మాత్రమే టాయిలెట్లను క్లీన్ చేసి వాటినే చూపించి ర్యాంకులు కొట్టేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రేటర్‌లో 7,500 టాయిలెట్లను ఒక్కోదానికి రూ. 3 లక్షలతో బల్దియా ఏర్పాటు చేసింది. అవసరం మేరకు మరిన్ని తీసుకొస్తామని చెప్పింది. ప్రస్తుతం అన్ని జోన్లలో కలిపి 5,295 టాయిలెట్లు ఉన్నాయి. ఇందులో 5,036 టాయిలెట్ల మెయింటెనెన్స్ బాధ్యతను జోనల్ కమిషనర్లు ఏజెన్సీలకు అప్పగించారు. టాయిలెట్లు క్లీన్ చేయకపోవడం, నీళ్లు లేకపోవడం, కొన్నిచోట్ల బకెట్, మగ్గులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలు ఉన్నా పట్టించుకోవట్లేదు
ఏరియాని బట్టి ఒక్కో టాయిలెట్‌కు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ
చెల్లిస్తుంది. వీటి నిర్వహణకు నెలకు రూ.2 కోట్లకు పైనే ఖర్చు చేస్తుంది. మిగతావి యాడ్స్పర్పస్లో ఏర్పాటు చేసినా అవి ఎక్కడా కనిపించడం లేదు. అన్ని చోట్ల డ్యామేజ్ కావడంతో వాటిని తొలగించారు. హైదరాబాద్ మెట్రో సిటీ కావడంతో కమర్షియల్ ఏరియాల్లో ఒక కిలో మీటరుకు, నార్మల్ ఏరియా అయితే 2 లేదా 3 కిలో మీటర్లుకు ఒక పబ్లిక్ టాయిలెట్ మస్ట్ గా ఉండాలని నిబంధనలున్నాయి. కానీ కిలోమీటర్ల మేర టాయిలెట్లు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిర్వహణ కోసం టెండర్ల సమయం గడిచినా కూడా రీ టెండర్లు వేయకుండా అలాగే కొనసాగిస్తున్నారు.
సర్వే ఆఫీసర్లను తప్పుదోవ పట్టిస్తూ..
స్వచ్ఛ సర్వేక్షణ్ – 2023 అవార్డుల కోసం ప్రస్తుతం గ్రేటర్‌లో సెంట్రల్ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా టాయిలెట్లు క్లీన్‌గా ఉన్నాయా? లేదా అనే వివరాలు తీసుకుంటున్నారు. ఈ సర్వేలో క్లీన్‌గా ఉన్న టాయిలెట్లను మాత్రమే జీహెచ్ఎంసీ అధికారులు సర్వే ఆఫీసర్లకు చూపిస్తున్నారు. సర్వే కోసం వెళ్లే ఏరియాల్లో సిబ్బందికి ముందుగానే సమాచారం ఇస్తున్నారు. వచ్చే సమయానికి క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
క్యూఆర్ కోడ్ మాటే లేదు
ఏజెన్సీలకు అప్పగించిన టాయిలెట్లకు క్యూఆర్ కోడ్ కేటాయించి క్లీన్ చేసే సమయం, నిర్వహణపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్, అడిషనల్ కమిషనర్లతో పాటు జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తెలుసుకుంటామని గతంలో చెప్పారు. ఆ టాయిలెట్లను డైలీ మూడు నుంచి ఐదు సార్లు క్లీన్ చేసేందుకు ఆయా ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ను ఇచ్చారు. కమర్షియల్ప్రాంతాల్లో రోజుకు నాలుగు సార్లు, నాన్ కమర్షియల్ ప్రాంతాల్లో మూడుసార్లు క్లీన్ చేయాల్సి ఉంది. నీట్ గా చేయకపోతే కూడా ఏజెన్సీలకు ఫైన్లు వేస్తామని హెచ్చరించినా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క టాయిలెట్ వద్ద కూడా క్యూఆర్ కోడ్ కనిపించడంలేదు.
పార్కింగ్ కే పరిమితం
నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా రూపొందించారు. వీటిలో స్ర్తీలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇలా గ్రేటర్‌లో 30 మొబైల్టాయిలెట్లు ఉండగా.. రద్దీ ప్రాంతాల్లో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. మొదట్లో భాగానే మెయింటెనెన్స్ చేసినా ప్రస్తుతం నిర్వహణను పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం పార్కింగ్ కే పరిమితం అయ్యాయి. సికింద్రాబాద్ జోన్ కి కేటాయించిన 5 మొబైల్ బయో టాయిలెట్లలో నాలుగు ఇందిరాపార్కు పక్కన ఎన్టీఆర్ స్టేడియంలోనే పార్కింగ్ చేశారు. వాటిని బయటకు తీయడం లేదు