క్రిప్టో ట్రేడింగ్ యాప్ పేరుతో వెయ్యి మందికి టోకరా

క్రిప్టో ట్రేడింగ్ యాప్ పేరుతో వెయ్యి మందికి టోకరా

షాద్ నగర్, వెలుగు: క్రిప్టో ట్రేడింగ్ యాప్​లో పెట్టుబడులు పెడితే ఐదు నెలల్లోనే రూ.లక్షకు 3 లక్షలు వస్తాయంటూ నమ్మించిన ఇద్దరు వ్యక్తులు వందలాది మందిని మోసం చేశారు. దుబాయ్ కంపెనీ అంటూ వీరే యాప్ ను క్రియేట్ చేసి ఒకరి ద్వారా ఒకరితో డబ్బులు పెట్టించారు. మొత్తంగా రూ. 15 కోట్ల మేరకు దండుకుని ఉడాయించారు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు గురువారం షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ కు చెందిన ఖాజా మొయినుద్దీన్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాజీవ్ రంజన్ విశ్వకర్మ అనే ఇద్దరు కలిసి క్రిప్టో ట్రేడింగ్ పేరుతో మోసానికి స్కెచ్ వేశారు. మ్యాక్స్ క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ పేరుతో యాప్​ను క్రియేట్ చేశారు. ఈ ఆన్​లైన్ బిజినెస్ యాప్ దుబాయ్​కి చెందిన కంపెనీది అని, ఇందులో డబ్బులు పెడితే 150 రోజుల్లో మూడింతల డబ్బు వస్తుందంటూ ప్రచారం చేశారు.

ఈ ఏడాది పిబ్రవరి నుంచి దందా మొదలుపెట్టిన వీరు.. ఇందులో చేరిన కొందరికి 15 రోజులకోసారి, నెలకోసారి కొంత మొత్తంలో ఆన్​లైన్ ద్వారా డబ్బు పంపించి నమ్మించారు. డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఒకరి ద్వారా ఒకరు.. దాదాపుగా వెయ్యి మంది వరకూ ఇందులో జాయిన్ అయ్యారు. వీలును బట్టి రూ. 50 వేలు, రూ. 80 వేలు, రూ.లక్ష వరకు డబ్బులు కట్టారు. తీరా రెండు నెలల నుంచి వీరికి ఎలాంటి డబ్బులు రాకపోవడంతో మొయినుద్దీన్​ను ప్రశ్నించారు. ఇప్పుడు, అప్పుడు అంటూ చెప్తూ వచ్చిన ఖాజా.. చివరకు సెల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన 70 మంది బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. 

లక్షలు వస్తాయంటూ ఆశ చూపి..  

క్రిప్టో ట్రేడింగ్ ద్వారా తాను గత ఆరు నెలలుగా ప్రతి నెలా రూ. 25 లక్షల నుంచి 30 లక్షలు సంపాదిస్తున్నట్లు ఖాజా నమ్మబలికాడు. కంపెనీ నుంచి రూ. 50 లక్షల విలువైన విల్లాను కూడా పొందినట్లు చెప్పాడు. ముందుగా తనకు తెలిసిన వాళ్లకు ఎర వేశాడు. వాళ్లను ఇందులో చేర్పించి, వాళ్ల అకౌంట్లలో అప్పుడప్పుడూ డబ్బులు వేశాడు. ఆ తర్వాత మీటింగ్ లు పెట్టి తాను లక్షలకు లక్షలు సంపాదిస్తున్నానని, ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మరింత మందిని నమ్మించాడు. ఒక బీఎండబ్ల్యూ సహా ఏడు కార్లను గెలుచుకునే అవకాశం కూడా ఉందన్నాడు. కొందరిని టీం లీడర్లుగా చేర్చుకున్నాడు. ఇందులో ఎక్కువ మందిని చేర్పిస్తే మీరు కూడా లక్షలు సంపాదించొచ్చని ఆశపెట్టాడు. ఇలా ఒకరి ద్వారా ఒకరు మోసపోయారని, దాదాపు వెయ్యి మంది వరకు ఇందులో చేరారని బాధితులు చెప్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని షాద్ నగర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు.  

రూ. 83 వేలు కట్టి మోసపోయిన..  

షాద్​నగర్​కు చెందిన ఓ ఫ్రెండ్ ద్వారా ఈ ట్రేడింగ్ యాప్ గురించి తెలుసుకున్నా. ఇందులో రూ. 83 వేలు పెట్టుబడి పెట్టాను. నాకు తెలిసిన కొంత మంది కూడా రూ. 50 వేలు, లక్ష, 3 లక్షలు, 5 లక్షల వరకు పెట్టారు. మాకు రోజూ రెండు శాతం చొప్పున 20 రోజుల వరకు అకౌంట్​లో డబ్బులు పడ్డాయి. ఆ తర్వాత యాప్ బ్లాక్ అయిపోయింది. ఖాజాను అడిగితే మూడు నెలలుగా అప్పుడు, ఇప్పుడు అని చెప్తూ దాటవేస్తున్నాడు. మాలాగే చాలా మంది ఇందులో డబ్బులు పెట్టారు. ఆ చీటర్లను పట్టుకుని మాకు న్యాయం చెయ్యాలి.  -  బాలరాజ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా  

నమ్మించి మోసం చేసిండు 

నా ఫ్రెండ్ ద్వారా ఖాజా మొయినుద్దీన్ పరిచయం అయ్యాడు. క్రిప్టో ట్రేడింగ్​లో మూడింతలు ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించాడు. నేను కూడా ఇందులో డబ్బులు కట్టి చేరాను. కొన్ని రోజుల వరకు రోజూ నా అకౌంట్లో రూ. 1600 పడ్డాయి.  ఆ తర్వాత డబ్బులు రావడం ఆగిపోయింది. డబ్బులు ఇప్పుడు పడతాయి అప్పుడు పడతాయి అని చెప్తూ వచ్చిన ఖాజా చివరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని పట్టుకుని మా డబ్బులు ఇప్పించాలి.  -  సిరాజ్, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా