పురుషుల హాకీ సెమీస్‌లో భారత్ ఓటమి.. బ్రాంజ్‌ పైనే ఆశలు

పురుషుల హాకీ సెమీస్‌లో భారత్ ఓటమి.. బ్రాంజ్‌ పైనే ఆశలు

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత జట్టు నిరాశపర్చింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కు చేరుకునే చాన్స్ ఉన్నప్పటికీ అంచనాలను అందుకోవడం విఫలమైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పటిష్టమైన బెల్జియం చేతిలో మూడు గోల్స్ తేడాతో ఇండియా ఓటమిపాలైంది. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో భారత్‌పై బెల్జియం ఆధిపత్యం సాధించింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పవర్‌ఫుల్ డ్రాగ్‌ఫ్లిక్‌తో ఓ గోల్ చేశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి.

కొద్ది సేపటికే మణిందర్ సింగ్ ఓ అద్వితీయమైన గోల్‌తో భారత్‌ను లీడ్‌లోకి తీసుకెళ్లాడు. కానీ రెండో ప్రథమార్థంలో బెల్జియం బలంగా దూసుకొచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నాలుగు పెనాల్టీ కార్నర్ షాట్లను గోల్స్‌గా మలిచి భారత్‌పై తీవ్రంగా ఒత్తిడి పెంచింది. బెల్జియం స్కోరును అందుకోవడానికి భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ప్రత్యర్థి డిఫెన్స్ ముందు నిలవలేకపోయారు. దీంతో బెల్జియం ఫైనల్ బెర్తు కన్ఫర్మ్ చేసుకుంది. ఇక, కాంస్య పతకం కోసం మరో సెమీస్‌లో పోటీ పడనున్న ఆస్ట్రేలియా, జర్మనీల మధ్య ఓడిపోయిన టీమ్‌తో భారత్ తలపడనుంది.