ట‌మాటా, ప‌చ్చి మిర్చి దోపిడీ.. అర్థరాత్రి ట్రాలీలో ఎత్తుకెళ్లిన దొంగ‌లు

ట‌మాటా, ప‌చ్చి మిర్చి దోపిడీ.. అర్థరాత్రి ట్రాలీలో ఎత్తుకెళ్లిన దొంగ‌లు

టమాటా, పచ్చిమిర్చి ధరల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పంట పొలాల్లో కూరగాయలను చోరీ చేయడం చూశాం. ఇప్పుడు పెరిగిన ధరల వల్ల దొంగలు కూరగాయల మార్కెట్ లోనూ కూరగాయలను దొంగిలిస్తున్నారు. ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో చోటు చేసుకుంది.

టమాటా చోరీ..

డోర్నకల్ పట్టణంలోని గాంధీ సెంటర్ లోని కూరగాయల మార్కెట్ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలను అమ్ముకునే దుకాణం దారులు.. రాత్రి వేళల్లో దుకాణాలకు తాత్కాలిక నెట్ లను వేసి ఇండ్లకు వెళ్లిపోతారు. అయితే ఇక్కడ కూరగాయల మార్కెట్ లోని లకుపతి అనే దుకానందారుడి షాప్ లోని  టమాటా, పచ్చి మిర్చి,చిక్కుడు కాయలతో పాటు మరికొన్ని కురగాయలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అర్థరాత్రి వేళ దొంగలు ట్రాలీలో కూరగాయలను ఎత్తుకెళ్లారు. పొద్దున వచ్చి చూసేసరికి కూరగాయల షాపు గందరగోళంగా ఉంది. కూరగాయలన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీంతో లబోదిబోమన్న  బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కూరగాయల చోరీ వల్ల దాదాపు రూ. 50 వేల వరకు నష్టం జరిగిందని వ్యాపారి తెలిపారు. 

సీసీ కెమెరాల్లో రికార్డు..

దుండగులు టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డ వంటి, చిక్కుడుకాయల వంటి ధరలు ఎక్కువగా ఉన్న కూరగాయలను దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే కూరగాయలు చోరీ కావడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. డోర్నకల్ కూరగాయల మార్కెట్ లో వాచ్ మెన్ లేకపోవడంతో టమాటాలు, ఇతర కూరగాయాలు చోరీకి గురవుతున్నాయని వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా కూరగాయల దొంగతనం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు చోరీ అవుతుండటంతో రాత్రి వేళ కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.