రామగుండం కార్పొరేషన్లో సమ్మక్క, సారలమ్మ జాతర స్థలంలో టన్నుల కొద్దీ చెత్త

రామగుండం కార్పొరేషన్లో సమ్మక్క, సారలమ్మ జాతర స్థలంలో టన్నుల కొద్దీ చెత్త

రామగుండం కార్పొరేషన్ పరిధిలో సేకరించే చెత్తను తెచ్చి కొన్నాళ్లుగా గోదావరిఖనిలోని నది ఒడ్డున డంప్​చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర స్థలం మొత్తం ప్రస్తుతం చెత్తతో నిండిపోయింది. గద్దెలను ఆనుకొని దాదాపు 35 ఎకరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. త్వరలోనే జాతర మొదలుకానుంది. కార్పొరేషన్​, సింగరేణి అధికారులు స్పందించి చెత్తను తరలించకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన గోదావరిఖని జాతరకు దాదాపు 5 లక్షల మంది వస్తుంటారు. మేడారం దాకా పోలేనివారు, ఇక్కడి గద్దెలను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో జాతర స్థలంలో భారీగా పేరుకుపోయిన చెత్తను తరలించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా, డెయిలీ115 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు.

ఈ మొత్తాన్ని గతంలో జల్లారం సమీపంలో సింగరేణి స్థలంలో డంప్​చేసేవారు. కొన్నాళ్లుగా సింగరేణి అధికారులు అందుకు అనుమతించకపోవడంతో కార్పొరేషన్ కు డంప్​యార్డ్​ లేకుండా పోయింది. దీంతో గోదావరి నది ఒడ్డున ఉన్న జాతర స్థలంలో పోస్తున్నారు. అధికారుల తీరుతో పుణ్య స్నానాల కోసం గోదావరికి వచ్చే భక్తులు చెత్తతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది తీర ప్రాంతమంతా కంపు కొడుతోంది. గాలికి చెత్త, చెదారం వచ్చి నదిలో కలుస్తోంది. కార్పొరేషన్‌‌ అధికారు అడ్డగోలుగా వ్యహరిస్తున్నా పొల్యూషన్‌‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

భారీ వర్షాలు కురిసినప్పుడు చెత్త నేరుగా వరదనీటితోపాటు గోదావరి నదిలో కలుస్తోంది. చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు కాల్చుతుండడంతో వచ్చే పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జాతరను దృష్టిలో పెట్టికుని ఇప్పటికైనా చెత్తను క్లియర్​చేయాలని, ప్రత్యేకంగా డంపింగ్​యార్డ్​ఏర్పాటు చేసి, ఇక నుంచి ఇక్కడ చెత్త పోయకుండా చూడాలని ఫైట్‌‌ఫర్‌‌ బెటర్‌‌ సొసైటీ కోరుతోంది.
– వెలుగు, గోదావరిఖని