బ్యాంకుల సొమ్ము బడాబాబుల జేబుల్లోకి

బ్యాంకుల సొమ్ము బడాబాబుల జేబుల్లోకి
  • దేశంలో 100 మంది ఖాతాల్లోనే రూ. 4 లక్షల 46 వేల కోట్ల ఎన్​పీఏలు
  • మొత్తం మొండి బకాయిలు రూ. 10 లక్షల 9వేల కోట్లకు పైగానే
  • కిందటి ఏడాది చివరి నాటికి ఇదీ లెక్క.. వెల్లడించిన ఆర్బీఐ
  • ప్రభుత్వ రంగ బ్యాంకులే డిఫాల్టర్ల టార్గెట్​
  • విజయ్​ మాల్యా, నీరవ్​ మోడీ ముంచిందే రూ. 23వేల కోట్లు
  • టాప్​ 20 మంది డిఫాల్టర్ల బకాయిలే రూ. 2.36 లక్షల కోట్లు
  • పేర్లు బయటపెట్టని ఆర్బీఐ

 

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులను కొందరు బడా బాబులు కొల్లగొడుతున్నారు! ఆ కంపెనీ ఈ కంపెనీ అని లెక్కలేని డాక్యుమెంట్లు సృష్టించి.. అందినకాడికి లోన్ల​ రూపంలో దోచేసుకుంటున్నారు!! పదో, ఇరవయో శాతం కిస్తీలు కట్టి.. అటు తర్వాత ఎగవేతలు మొదలుపెడుతున్నారు. వీరిలో కొందరైతే చెప్పాపెట్టకుండా ఇతర దేశాలకు ఉడాయిస్తున్నారు. దేశంలో బ్యాంకులకు రావాల్సిన మొత్తం మొండి బకాయిలు (నాన్​ పర్​ఫార్మింగ్​ అసెట్స్​–ఎన్​పీఏ) రూ. 10 లక్షల 9వేల 286 కోట్లు. అందులో సుమారు 50 శాతం అంటే.. రూ. 4 లక్షల 46 వేల 158 కోట్లు కేవలం 100 మంది ఖాతాల్లోనే  ఇరుక్కుపోయాయి.  ఇది 2018 డిసెంబర్​ 31 వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లోని లెక్క. ఇటీవల ఓ మీడియా సంస్థ ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించి ఆర్బీఐని వివరాలు కోరగా ఈ సమాచారం వెల్లడైంది. వంద ఖాతాల్లో పేరుకుపోయిన మొండి బకాయిలు మన రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది బడ్జెట్​ కంటే ఎక్కువే.

ప్రభుత్వరంగ బ్యాంకులకే కుచ్చుటోపీ

మొత్తం మొండి బకాయిల సొమ్ములో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినదే 80 శాతానికి పైగా ఉంది. కిందటి ఏడాది అంటే 2018 చివరి నాటికి బ్యాంకుల ఎన్​పీఏలు రూ. 10,09,286 కోట్లని, అందులో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావాల్సినవే రూ. 8 లక్షల 64వేల 433 కోట్లని ఈ ఏడాది ఫిబ్రవరి 5న రాజ్యసభలో కేంద్రం ప్రకటించింది. మిగతా బకాయిలు ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందినవని పేర్కొంది. 100 మంది బడా బాబులు, వారి కంపెనీలు కట్టాల్సిన సుమారు రూ. 4.5 లక్షల కోట్ల మొండి బకాయిల్లో  ఎక్కువ భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావాల్సినవే.  దీన్ని బట్టి చూస్తే  ప్రభుత్వ రంగ బ్యాంకులనే చాలా మంది సతాయిస్తున్నట్లు లెక్క.  ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం బ్యాంకు రుణాల్లో మొండి బకాయిల వాటా 9.3 శాతం అని ఆర్బీఐ తెలిపింది. వీటిని వసూలు చేసే పనిలో ఉన్నామని, వసూలు కాని పక్షంలో అప్పుతీసుకున్నోళ్ల  ఆస్తులను జప్తుచేస్తున్నామని బ్యాంకులు పేర్కొంటున్నాయి.

ఆ ఇద్దరు ఎగవేసిన మొత్తమే రూ. 23 వేల కోట్లు

మొండి బకాయిలు ముదిరి ఎగవేతకు దారితీస్తున్నాయి. కొందరు బడా వ్యాపారులు బ్యాంకులకు టోపీ పెట్టేసి విదేశాలకు పారిపోతున్నారు. ఇలాంటివారిలో విజయ్​ మాల్యా, నీరవ్​ మోడీ వంటి వారు ఉన్నారు. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు సుమారు 13వేల కోట్ల రూపాయలను నీరవ్​ మోడీ ఆయన చుట్టం మేహుల్​ చౌక్సీ ఎగవేశారు. వీరికి ముందు ‘కింగ్​ ఫిషర్స్​’  విజయ్​ మాల్యా బ్యాంకులను సుమారు 10వేల కోట్ల రూపాయల మేరకు ముంచేశాడు. అంటే.. వీళ్లు ఎగవేసిన సొమ్మే రూ. 23వేల కోట్లు. వీరు ముంచింది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులనే. ఇంకో లెక్క ప్రకారం.. 2018 మార్చి 31 నాటికి దేశంలో టాప్​ 20 డిఫాల్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగవేసిన మొత్తం సొమ్ము రూ. 2.36 లక్షల కోట్లు. ఈ మొత్తం బ్యాంకుల ఎన్​పీఏలో 20 శాతానికి పైగానే ఉంటుంది.

 ఆ 100 పేర్లు కూడా అంతే..

మొండి బకాయిదారుల వివరాలను కూడా బ్యాంకులు ప్రకటించడం లేదు. ఇటీవల ఓ మీడియా సంస్థ ఆర్టీఐ చట్టం ప్రకారం వివరాలు కోరగా.. 100 మంది దగ్గరే రూ. 4.5లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నట్లు ఆర్బీఐ చెప్పింది. కానీ, ఆ వంద మంది పేర్లను, ఖాతాల వివరాలు మాత్రం బయటపెట్టలేదు. వారికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

మొండి బకాయిలు తగ్గాయంటున్న కేంద్రం

మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. 2018‌‌‌‌‌‌‌‌–19 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్​ చివరి నాటికి మొండి బకాయిలు  రూ.31,168 కోట్లు తగ్గాయంది. 2017‌‌‌‌‌‌‌‌–18 ఆర్థిక సంవత్సరం  చివరి నాటికి రూ. 8లక్షల 95వేల 601 కోట్ల మేరకు ఎన్​పీఏలు పేరుకుపోయాయని, 2018 డిసెంబర్​ చివరి నాటికి అంటే తొమ్మిది నెలల్లో అవి రూ.8లక్షల 64వేల 433 కోట్లు అయ్యాయని పేర్కొంది.

డిఫాల్టర్ల పేర్లు చెప్పని ఆర్బీఐ

బ్యాంకులకు బకాయిలు ఎగివేసే డిఫాల్టర్ల పేర్లను ఆర్బీఐ బయటపెట్టడానికి నిరాకరిస్తోంది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ఆదేశించినా వెనుకడుగు వేస్తోంది. డి ఫాల్టర్ల పేర్లను బయటపెట్టేలా ఆర్బీఐని ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ను ఏప్రిల్ 26న విచారించిన సుప్రీంకోర్టు.. వారి పేర్లను పబ్లిక్​లోకి తీసుకురావాల్సిందేనని గట్టిగానే చెప్పింది. డి ఫాల్టర్ల పేర్లను ప్రకటించాలని లేకపోతే కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని ఆర్బీఐని హెచ్చరించిం ది. అడపాదడపా ఒకరిద్దరి పేర్లను మాత్రమే ప్రకటిస్తున్న బ్యాంకులు అందరి పేర్లు బయటపెట్టడం లేదు. ఈ మధ్యనే యూకో బ్యాంకు ప్రముఖ పారిశ్రామికవేత్త యశోవర్ధన్​ బిర్లా ను విల్ ఫుల్ డి ఫాల్టర్​గా ప్రకటించింది.బ్యాంకింగ్​ రెగ్యు లేటరీ యాక్ట్​ ప్రకారం తాము నడుచుకుంటున్నామని, మొండి బకాయిలను వసూలు చేసే పనిలోనే ఉన్నామని బ్యాంకులు చెప్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.