
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో వాగుల ఉధృతికి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.జనజీవనం స్థంభించిపోయింది. మరోవైపు తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంది.
బంగాళాఖాతాంలోవాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవ హిస్తున్నాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సిటీలో ఉదయం నుంచి ముసురు వర్షం కురుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్థంభించింది.ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మహబూ బాబాద్ జిల్లాలో మున్నేరువాగుకి భారీగా వరద చేరుకుంటుంది. బయ్యారం పెద్ద చెరువు, మాదన్నపేట, పాకాల చెరువులు మత్తడిపోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.
ర్రుపాలెం మండలంలో కుండపోతవానలకు... నర్సింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మధిర నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. మధిర మున్సిపాలిటీలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరదనీరు రావడంతో జనం ఇబ్బందిపడ్డారు. కృష్ణాపురం దగ్గర పాలవాగు ఉధృతికి పంటపొలాలు నీటమునిగాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో ఏడు మెలికల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నల్గొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. మిర్యాలగూడలో రోడ్లపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షానికి రహదారులు, లోత ట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో చెరువులు,కుంటలు అలుగుపారుతున్నాయి. త్రిపురాం మండలం బాబుసాయి పేట దగ్గర కుక్కడం - త్రిపురరాం ప్రధాన రోడ్డుపై వరద నీరుప్రవహిస్తుంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు జనం. కోదాడ వద్ద హైదరాబాద్ , విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఊట్కూరు మండలం మల్లేపల్లిలో వరద ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. జడ్చర్లలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణమంతా వరద నీటి మయమైంది. ఆస్పత్రిలోకి వెళ్లడానికి వీలు లేకుండా ఉల్లివాగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
నారాయణపేట జిల్లాలో సింగారం వాగు మత్తడి పోస్తోంది. అటు నాగర్ కర్నూల్ జిల్లాలోని ధన్వాడ మండలం పాతపల్లిలో రోడ్లపై వరద ఉప్పొంగుతోంది. సిరసవాడ దగ్గర దుందుభి వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. ధన్వాడలో ఇవాళ ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న వాగును దాటికి స్కూళ్లకు వెళ్లారు విద్యార్థులు.
హైదరాబాద్ సిటీలోనూ ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఇవాళ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, బేగంబజార్ ఏరియాల్లో మోస్తరు వానకురిసింది. సిటీ శివార్లలోనూ వర్షం పడింది.
కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, జీడిమెట్ల సహా పలు ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది.రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో తంగడపల్లి వెంకిర్యాల వాగు ఉధృతికి రాకపోకలు స్థంభించాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో మోస్తరు వానకురిసింది. మేడ్చల్ జిల్లాలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది.
తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చిచేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలంకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. 3లక్షల 26 వేల 481 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 8గేట్లు ఎత్తి 3లక్షల 499 క్యూసెక్కుల నీటిని సాగర్ కు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. శ్రీశైలంనీటిమట్టం, నీటినిల్వ సామర్థ్యం పూర్తిస్థాయికి చేరింది.
శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగావరద పోటెత్తుతుంది.దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. సాగర్ కు ప్రస్తుతం 3లక్షల 35 వేల 596 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 26గేట్లు ఎత్తి 3లక్షల 35 వేల 586 క్యూసెక్కుల వాటర్ ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు.సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312టీఎంసీలుకాగా.. ప్రస్తుతం308.7టీఎంసీల నీరుంది.