ప్రజావాణికి 1,267 ఫిర్యాదులు

ప్రజావాణికి 1,267 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు:  బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. డబుల్ ​బెడ్రూం ఇండ్లు, భూ సమస్యలు, వైద్యవిధాన పరిషత్​ స్టాఫ్ ​నర్సులు, విద్యుత్​ శాఖలో లైన్​మెన్​గా ఎంపికైన జూనియర్ లైన్​మెన్లు దరఖాస్తులు ఇచ్చారు. నోడల్ ​అధికారి దివ్య పర్యవేక్షణలో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 1,267 ఫిర్యాదులు  వచ్చాయని  తెలిపారు.

ప్రమోషన్ ​లేదు..హెల్త్ కార్డు లేదు  

వైద్య విధాన పరిషత్​లో సుమారు 1,600 మంది స్టాఫ్​ నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది 317 జీవోతో స్థానికత కోల్పోతున్నామని వ్యతిరేకిస్తున్నారు. మిగతా 1,400 మంది జీవోను అమలు చేయాలని కోరుతున్నారు. 1999 నుంచి స్టాఫ్​నర్సులుగా చేస్తున్నామని,317 జీవో అమలు కానందున పదోన్నతి కోల్పోయామన్నారు.  తమకు ట్రెజరీ నుంచి 010  పద్దు  కింద జీతాలు రావాలని వైద్యవిధాన పరిషత్​నర్సులు సునీత, సరోజ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగామని, అయినా ఫలితం దక్కలేదన్నారు. 25 ఏండ్లుగా జాబ్ చేస్తున్నామని, రిటైర్మెంట్​ వయస్సు వచ్చినా పదోన్నతి దక్కకపోవడం అన్యాయమన్నారు.

పోల్ టెస్ట్ పాసైనా జాబ్ లు ఇవ్వట్లేదు

విద్యుత్​ శాఖలో పోల్​టెస్టు పాసైనా జాబ్ ఇవ్వడం లేదంటూ జూనియర్ ​లైన్​మెన్లు ఆరోపించారు.  మెరిట్​ లిస్టులో పేర్లు ఉన్నా.. తమను తీసుకోకుండా రిటైర్డ్ ఉద్యోగులను డ్యూటీలోకి  తీసుకుంటున్నారని  శ్రీశైలం, శ్రీనివాస్, అనిల్, నగేశ్​పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందన్నారు.