ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టినం

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టినం

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని  కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అందులో 19 మంది పాక్ టెర్రరిస్టులని, 152 మంది కశ్మీరీ టెర్రరిస్టులని ఆయన చెప్పారు. గత ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 37 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది 34 మంది మరణించారని ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో నుంచి దేశంలోకి ముష్కరుల చొరబాట్లకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేశామని చెప్పారు.

మరోవైపు పొరుగు దేశాల నుంచి భారత్‌లోకి బోర్డర్‌‌ నుంచి డ్రగ్స్ రాకుండా అడ్డుకోవడానికి విస్తృతంగా ఆపరేషన్లు చేశామని విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో 815 ఎఫ్ఐఆర్‌‌లు నమోదు చేయగా.. 400 కేసుల్లో చార్జ్‌షీట్లు ఫైల్ చేశామన్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో నార్కోటిక్ కేసులకు సంబంధించి 1,465 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ బాధితుల డేటా బేస్‌ను కూడా రూపొందించి, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.

కాగా, కశ్మీర్‌‌లో నిన్న రాత్రి   మరో ఎన్ కౌంటర్ జరిగింది.  శ్రీనగర్ శివారులో జరిగిన ఎన్ కౌంటర్ లో  ముగ్గురు ఉగ్రవాదులు  హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్  తెలిపారు. వీరిలో  ఒకరిని జైషే మహ్మద్  సంస్థకు  చెందిన సుహాలి అహ్మద్ గా  గుర్తించామన్నారు. ఈ నెల  13న  భద్రతా బలగాల బస్సుపై ఎటాక్  చేసిన  వారిలో  వీరు కూడా ఉన్నారని  చెప్పారు. బస్సుపై దాడి చేసిన  ఉగ్రవాదులందరిని మట్టుపెట్టామన్నారు.  ఉగ్రవాదుల కాల్పుల్లో  ముగ్గురు పోలీసులు, ఒక CRPF  జవాన్ కు గాయాలయ్యాయని  అధికారులు చెప్పారు. వారిని  హాస్పిటల్ కు తరలించామని..  ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.