రైతులను మాత్రం వేయొద్దంటున్నడు.. ఇదేం పద్ధతి?

రైతులను మాత్రం వేయొద్దంటున్నడు.. ఇదేం పద్ధతి?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పి కేసీఆర్​ మాత్రం ఫామ్​హౌస్​లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని పీసీసీ చీఫ్‌‌‌‌  రేవంత్‌‌‌‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఎర్రవల్లిలో రచ్చబండ పెట్టి కేసీఆర్‌‌‌‌ వరి సాగు చేస్తున్న పొలాలను అందరికీ చూపిస్తానన్నారు. ‘‘యాసంగిలో రైతులు వరి పంట వేయాలి. కేసీఆర్‌‌‌‌ ఎట్ల వడ్లు కొనరో, కొనకుంటే గద్దె మీద ఎట్లా ఉంటరో చూస్త. ఆయనను గద్దె దించుడే కాదు.. బొంద పెడ్తం” అని  హెచ్చరించారు.  ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో రేవంత్​ మీడియాతో మాట్లాడారు. ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫామ్​హౌస్​లో వరి సాగవుతున్నదంటూ పలు ఫొటోలను ఆయన చూపించారు. ‘‘నీ భూమి పచ్చగుంటే.. నీ కడుపు నిండితే.. నీ కుటుంబం సల్లగుంటే సరిపోతదా కేసీఆర్​! నీ ఫామ్​హౌస్​లో 150 ఎకరాల్లో వరి వేస్తూ.. రైతులను మాత్రం ఎందుకు వేయొద్దంటున్నవ్​?” అని నిలదీశారు. ప్రభుత్వం వడ్లు కొనక రైతులు గుండె ఆగి చనిపోతున్నారని, వారిని ఆదుకోవాలనే సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. యాసంగిలో వరి వేయొద్దంటూ గ్రామాల్లో ప్రచారానికి ఎవరొచ్చినా చెప్పుతో కొట్టాలన్నారు. 

కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌ చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు పోదామా?
చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సీఎం భూపేశ్‌‌‌‌ భగేల్‌‌‌‌  మద్దతు ధర కన్నా రూ. 600 ఎక్కువ ఇచ్చి వడ్లు కొంటున్నారని రేవంత్​ అన్నారు. ‘‘చత్తీస్​గఢ్​లో పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించేందుకు ఎకరానికి రూ. 9 వేల చొప్పున బోనస్‌‌‌‌ ఇస్తూ.. సాగు చేసే పంటల కొనుగోళ్లకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నది. మంత్రులు కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌ రావు వస్తే నేను అతిథులుగా వారిని చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు తీసుకెళ్లి.. అక్కడి ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టిన చర్యలు చూపిస్త” అని ఆయన చెప్పారు. 1960లో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎమ్మెస్పీ విధానం తీసుకువచ్చిందని, దేశంలో 23 రకాల పంటలకు మద్దతు ధర కల్పించిందన్నారు. ఎమ్మెస్పీ ఉన్న పంటలను కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం విధిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఈ విషయం ఎమ్మెస్పీ చట్టంలోనే ఉందని, కేసీఆర్‌‌‌‌కు చదువు రాకుంటే చదువు వచ్చిన వాళ్లతో ఆ చట్టం చదివించుకోవాలని విమర్శించారు.దేశంలో పండే పంటలన్నింటినీ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్‌‌‌‌కు పిచ్చి ముదిరిందని, దానికి మందు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేసినట్టే బియ్యం ఎగుమతి చేయాలని, దీనిపై కేంద్రాన్ని అడిగితే లైసెన్స్‌‌‌‌ ఇస్తుందన్నారు. మిల్లర్లు, దళారులతో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను కొల్లగొడుతోందని ఆరోపించారు.

రైతు ఉద్యమంలో చనిపోయినోళ్లకు చేస్తామన్న సాయమేది?
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌‌‌‌ గజగజ వణుకుతున్నారని, అందుకే కేంద్రం తీసుకువచ్చిన అగ్రి చట్టాలపై నోరు మెదపలేదని రేవంత్​ దుయ్యబట్టారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు పార్లమెంట్‌‌‌‌ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాహుల్‌‌‌‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్​ పార్టీ కొట్లాడితేనే ప్రధాని మోడీ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని, ఇప్పుడు అవే చట్టాలు మళ్లీ తీసుకువస్తామని కేంద్ర మంత్రి తోమర్‌‌‌‌ అంటున్నారని, ఆ చట్టాలు మళ్లీ తెస్తే కేసీఆర్‌‌‌‌ రైతుల వైపు ఉంటారా.. మోడీ వైపు నిలబడతారా చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ఢిల్లీ బార్డర్లలో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పు పరిహారం ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకున్న కేసీఆర్‌‌‌‌ ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి కూడా  సాయం చేయలేదని రేవంత్​ అన్నారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.