సీఎం కేసీఆర్కు రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్కు  రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ

విద్యుత్ చార్జీల భారంపై  సీఎం కేసీఆర్​ కు టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘విద్యుత్​ ఏసీడీ చార్జీల పేరిట పేదోడి జేబుకు చిల్లుపెట్టడానికి సిద్ధమయ్యారు. మీ తొమ్మిదేళ్ల అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యం’ అని  రేవంత్​ రెడ్డి విమర్శించారు.  అందులో ‘మీ కుటుంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయి.  మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి విద్యుత్​ ఏసీడీ చార్జీల పేరిట ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారు. గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకేషన సెస్​ లు, గ్రీన్​ సెస్ ల పేరితో భారం మోపారు’ అని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ఊరువాడ డబ్బాకొట్టుకుంటున్న కేసీఆర్.. పరిపాలనలో విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే 20 వేల కోట్ల మేర బకాయి పడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు..  కరోనా దెబ్బ, ఇంధన ధరలు, నిత్యావసరాల రేట్లు పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడానికి తెగబడటం క్షమించరాని విషయం అన్నారు.  ఈ విషయంలో ప్రభుత్వం  ఉపసంహరించుకోకుంటే  ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకుంటుందని రేవంత్ హెచ్చరించారు.