కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ను నమ్మం : రేవంత్

కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ను నమ్మం : రేవంత్

మన్మోహన్ సింగ్ను పొగిడి కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరవ్వాలనుకుంటున్నారని.. కానీ అది జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాలనాగునైనా కౌగిలించుకుంటాం కానీ కేసీఆర్ ను నమ్మం అని చెప్పారు. కేసీఆర్ రద్దైన వెయ్యి నోటు లాంటివారని విమర్శించారు.బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ.. టీఆర్ఎస్ దొరల పార్టీ అని అన్నారు.  కాంగ్రెస్ పేదలు, దళిత, గిరిజన, మైనారిటీల పార్టీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెన్ను గెలిపిస్తేనే తెలంగాణ కష్టాలు తీరుతాయన్నారు. అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని కాంగ్రెస్ చెప్పగానే కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. గోదావరి ముంపు బాధితులకు ఇళ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల సాయం అందిస్తామన్నారు. అదేవిధంగా 500లకే సిలిండర్ ఇచ్చి పేదలను ఆదుకుంటామన్నారు.

ప్రగతిభవన్ను పేలుస్తామన్న వారి కాళ్లు విరగ్గొడతానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి కార్యకర్తలతో వెళ్తా.. ఎవరి కాళ్లు విరుగుతాయో తేల్చుకుందామని సవాల్ విసిరారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా ఎలా మారుస్తారని మండిపడ్డారు. కబ్జా చేసిన పార్టీ అఫీసును తిరిగిచ్చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవినీతి పరుల ఆట కట్టిస్తామన్నారు. పినపాకలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని..  డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు.