నాలుగు లేబర్‌‌‌‌ కోడ్ లను రద్దు చేయాలి .. ఏఐటీయూసీ కార్మిక సంఘాల నిరసన

నాలుగు లేబర్‌‌‌‌ కోడ్ లను రద్దు చేయాలి .. ఏఐటీయూసీ కార్మిక సంఘాల నిరసన

దేవరకొండ, యాదగిరిగుట్ట, నల్గొండ అర్బన్,  వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టాయి. దేవరకొండ పట్టణం లో సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహా రెడ్డి పాల్గొని మాట్లాడారు.  కేంద్రంలోని బీజేపీ సర్కార్ 44 కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించి నాలుగు కోడ్ లుగా తీసుకువచ్చిందన్నారు. కార్మిక రంగానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఉద్యోగులకు భద్రత ఉండదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు, సీపీఐ మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి గుట్టలో.. 

యాదగిరిగుట్టలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్ఎస్ కేవీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వైకుంఠ ద్వారం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పలువురు మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్రమోదీ తెచ్చిన లేబర్ కోడ్‌‌ ల వల్ల కార్మికుల రోజువారి పని గంటలు 8 గంటల నుంచి 10 గంటలకు పెరుగుతుందని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, టీఎన్టీయూసీ అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

నల్గొండలో.. 

నల్గొండలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్ టీయూ, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్‌‌ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.  వివిధ రంగాల కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించి పెద్ద గడియారానికి చేరుకొని సభ నిర్వహించారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌‌లను ముందుకు తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.