
- పొలాల మీదుగా ఐదు కిలోమీటర్ల నడిచి పుష్కరఘాట్‌కు చేరుకున్న భక్తులు
- ఇబ్బందులు పడిన వృద్ధులు, మహిళలు, పిల్లలు
జయశంకర్‌భూపాలపల్లి, వెలుగు : సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. భారీ సంఖ్యలో ప్రైవేట్ వాహనాల రాకకు తోడు బస్సులు బ్రేక్‌డౌన్ కారణంగా నడిరోడ్డు మీదే నిలిచిపోతుండడంతో వెహికల్స్ ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. పుష్కరాలకు వచ్చే వెహికల్స్ కోసం పోలీసులు వన్‌వే అమలు చేస్తున్నారు. కాళేశ్వరం వెళ్లే వెహికల్స్‌ను మహదేవ్‌పూర్ దాటిన తర్వాత అన్నారం మీదుగా పంపిస్తున్నారు. శుక్రవారం ఈ రూట్‌లో నాలుగు ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్ అయి నడిరోడ్డు మీదే ఆగిపోయాయి. మరో వైపు భారీ సంఖ్యలో ప్రైవేట్ వాహనాల రాకతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఐదు కిలోమీటర్ల నడక
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తులు ట్రాఫిక్ జాం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేక వాహనాలు దిగి నడుచుకుంటూ కాళేశ్వరం చేరుకున్నారు. ముద్దులపల్లి గ్రామం దాటిన తర్వాత పంటపొలాల మీదుగా ఐదు కిలోమీటర్లు ఎండలోనే నడుచుకుంటూ సరస్వతిఘాట్‌కు చేరుకున్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జాం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వన్ వే అమలు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.