సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఏర్పాటుకాని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు అవుతుందని సీఎం కేసీఆర్ప్రకటించి రెండేళ్లయినా ఇంతవరకు అతీగతీ లేదు. బిజినెస్, ఇతర పనుల మీద కామారెడ్డికి నిత్యం వేల మంది వచ్చిపోతుంటారు. దీంతో మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య గా మారింది. అటు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కాకపోవటం, ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఎలాంటి ప్రత్యామ్నాయంగా ఆఫీసర్లు చర్యలు చేపట్టకపొవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సరిహద్దు కూడలిగా..
హైవేతో పాటు, రైల్వే లైన్ ఉండడంతో సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు కూడలిగా కామారెడ్డి ఉంది. టౌన్ లో లక్షకు పైగా జనాభా నివసిస్తున్నారు. వివిధ పనుల కోసం ప్రజలు పట్టణానికి వస్తుంటారు. దీంతో వేల సంఖ్యలో వెహికిల్స్రావడంతో మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యగా మారింది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయటానికి ప్రత్యేక వ్యవస్థ లేదు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఇవి సరిగ్గా పని చేయడం లేదు. ట్రాఫిక్ కోసం టౌన్‌పోలీస్ స్టేషన్‌తో పాటు, హెడ్ క్వార్టర్స్ నుంచి ఆరుగురు సిబ్బందిని కేటాయించారు. వీరు కేవలం ఫైన్లు వేయటానికే పరిమితమవుతున్నారు.
సీఎం చెప్పినా..
కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించేందుకు 2020 జూన్20న సీఎం కేసీఆర్ వచ్చారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తో పాటు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆప్‌గ్రేడ్ చేయాలని సీఎంకు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. జిల్లా కేంద్రంగా మారిన దృష్ట్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబధించిన ప్రక్రియ చూడాలని అక్కడే ఉన్న హోం మంత్రికి, ఆఫీసర్లకు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ప్రపోజల్స్ పంపారు. కానీ ఇప్పటికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాలేదు.
ట్రాఫిక్‌కు ఆరుగురే ..
వెహికిల్స్ రాకపోకలతో మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. పాత హైవే, మెయిన్‌రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, సుభాష్ రోడ్డు, తిలక్‌రోడ్డు, జేపీఎన్రోడ్డు, పాతబస్టాండు, ఇందిరాచౌక్, నిజాంసాగర్ రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా,రామారెడ్డి చౌరస్తాల్లో రద్దీ ఉంటుంది. స్కూల్స్,ఆఫీసులు టైమ్ లో ట్రాఫిక్ ఎక్కువ. ఎక్కడబడితే అక్కడ వెహికిల్స్ పార్కింగ్ చేయటంతో సమస్యలు వస్తున్నాయి. కేవలం నిజాంసాగర్ చౌరస్తా దగ్గరే ట్రాఫక్ పోలీసులు ఉంటున్నారు. మిగతా చౌరస్తాల దగ్గర ఏవరూ ఉండటం లేదు. జిల్లా కేంద్రం విస్తరించినా టౌన్‌కు ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది. వీరు నేరాల నియంత్రణతో పాటు, ట్రాఫిక్‌ను కూడా చూడాలి. సిబ్బంది తక్కువ ఉన్న దృష్ట్యా టౌన్ పోలీసు ఆఫీసర్లు ట్రాఫిక్ కంట్రోల్ పట్టించుకోవటం లేదు. ఒక ఎస్సై, ఆరుగురు సిబ్బందిని తాత్కాలికంగా ట్రాఫిక్ కోసం కేటాయించగా ఒకరిద్దరు చౌరస్తాలో ఉంటున్నా మిగతా వారంతా ఫైన్లు వేస్తుంటారు.