జగిత్యాల జిల్లా నర్సింగాపూర్​లో విషాదం

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్​లో విషాదం

జగిత్యాల, వెలుగు: భూమి పరిహారం కోసం ఏండ్లకేండ్లు కోర్టులో కొట్లాడిన రైతు.. చివరకు ఆ భూమి పరిహారం వచ్చినా లాయర్ ఇప్పించకపోవడంతో మనస్తాపం చెందాడు. కోర్టు కేసు కోసం బయట తెచ్చిన అప్పులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసేసి, పురుగుమందు తాగి తానూ సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ లో జరిగింది. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ కు చెందిన గడ్డం జలపతి రెడ్డి (40),  కవిత దంపతులకు ముగ్గురు బిడ్డలు జాస్మిత (13), ప్రణిత్య (11), మధుమిత (8) ఉన్నారు. జలపతి రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం బంధువుల ఫంక్షన్ కోసమని ప్రణిత్య, మధుమితను తీసుకొని జలపతి రెడ్డి జగిత్యాలకు వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తెలిసిన చోట్ల గాలించినా జాడ దొరక లేదు. శనివారం తెల్లవారుజామున గ్రామంలోని తన అన్న రాజిరెడ్డి వ్యవసాయ బావి సమీపంలో అనుమానాస్పద స్థితిలో జలపతి రెడ్డి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్సై అనిల్ అక్కడికి చేరుకొని ఎంక్వైరీ చేపట్టగా సూసైడ్ నోట్ దొరికింది. జలపతి రెడ్డి తన బిడ్డలను బావిలో తోసేసి.. తానూ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న సెల్ఫీ వీడియోను ఆయన ఫోన్ లో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దాని ఆధారంగా పోలీసులు ఆ బావిలోని నీళ్లను మోటార్ల ద్వారా బయటకు తీస్తూ, గజ ఈతగాళ్లతో వెతికారు. మొదట ప్రణిత్య డెడ్ బాడీ దొరకగా, గంట తర్వాత మధుమిత మృతదేహం దొరికింది. జలపతి దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైనప్పటికీ, ఆయన ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో స్పాట్ లో పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   

లాయర్ వేధింపులే కారణం: జలపతి రెడ్డి భార్య  

గతంలో నర్సింగాపూర్ లోని వ్యవసాయ భూములను టీఆర్ నగర్ హౌసింగ్ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం సేకరించింది. ఇందులో జలపతి రెడ్డి భూమి కూడా పోయింది. అయితే ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో జలపతి రెడ్డి, మరికొందరు కలిసి కోర్టులో కేసు వేశారు. ఈ కేసును మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కొలుగూరి దామోదర్ రావు వాదిస్తున్నారు. ‘‘ప్రభుత్వం నుంచి పరిహారం అందినా, అది మాకు ఇవ్వకుండా దామోదర్ రావు వేధిస్తున్నాడని నా భర్త నాతో చాలాసార్లు చెప్పుకుంట బాధపడ్డాడు. లాయర్ వేధింపులతోనే బిడ్డలను బావిలో పడేసి నా భర్త సూసైడ్ చేసుకున్నాడు’’ అని జలపతి రెడ్డి భార్య కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నా చావుకు కారణం దామోదరే : జలపతి రెడ్డి 

‘‘నా చావుకు కారణం.. ధరూర్ కు చెందిన వకీల్ కొల్లూరి దామోదర్ రావు. 1985లో తారకరామనగర్ కాలనీ కోసం 45 ఎకరాల 20 గుంటలను ప్రభుత్వం సేకరించగా, ఆ పరిహారం మాకు ఇంకా రాలేదు. దీనిపై రైతులందరం కలిసి హైకోర్టులో కేసు వేసినం. ఎకరానికి రూ.16వేల చొప్పున వడ్డీతో కలిపి ఇవ్వాలని 2014లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు మొత్తం రూ.45,95,516  రెవెన్యూ డిపార్టుమెంట్ వాళ్లు కోర్టులో జమచేసినారు. ఆ డబ్బులు ఇప్పించాలని మేము చాలా సార్లు దామోదర్ రావును కలిసినం. కానీ ఆయన డబ్బులు ఇప్పిస్తలేడు. వేరే వకీల్ ను ఆ పని చెయ్యనిస్తలేడు. 1997 సంవత్సరంలో మా దగ్గరి నుంచి దామోదర్ రావు రూ.3,60,000 తీసుకున్నాడు. ఇప్పుడు కోర్టులో ఉన్న డబ్బులు ఇప్పియడానికి రేపు మాపు అని తిప్పుతున్నాడు. ఈ కేసు కోసం నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. బయట అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నాను” అని సూసైడ్ నోట్ లో జలపతి రెడ్డి పేర్కొన్నారు.