తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మేడారం వెళ్లి వస్తుండగా ఘటన

తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మేడారం వెళ్లి వస్తుండగా ఘటన

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డులో ఇద్దరు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు.  163వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను  వెనుక నుంచి వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.  భద్రాది కొత్తగూడెం, జిల్లాలోని అశ్వాపురానికి చెందిన భక్తులు ట్రాక్టర్ లో మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శనం చేసుకునేందుకు ట్రాక్టర్ లో బయల్దేరారు.  దర్శనం అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు. మండల కేంద్రంలో తాగు నీరు కోసం రోడ్డు పక్కనే పార్కింగ్ చేశారు.

ALSO READ | అడవిలో దూప దూప!..ట్రాఫిక్‌  జామ్‌తో తాగునీటి కోసం భక్తుల తిప్పలు

ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ సుమారు 30 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు కాళ్లు తెగిపోగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన క్షతగాత్రులను 108 వాహనంలో ములుగు ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు విరిగిపోయిన ఇద్దరు  మహిళలు మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన వారికి ములుగు ఆసుపత్రిలో చికిత్స అందించారు.