
- ట్రీట్‌మెంట్ తీసుకుంటూ భర్త మృతి, అపస్మారక స్థితిలో భార్య
- కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో ఘటన
గంగాధర, వెలుగు: అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న దంపతులను హాస్పిటల్‌లో చేర్పించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ భర్త చనిపోగా, భార్య అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య (75), లక్ష్మి (70) దంపతులకు సంతానం లేకపోవడంతో ఇద్దరే ఉంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ బయట కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇంటి బయట బోటి క్లీన్ చేస్తూ శంకరయ్య, కిచెన్‌లో వంట చేస్తూ లక్ష్మి కుప్పకూలిపోయి కనిపించారు. వెంటనే 108లో కరీంనగర్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం మధ్యాహ్నం శంకరయ్య చనిపోగా, లక్ష్మి అపస్మారక స్థితిలో ఉంది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వంశీకృష్ణ, సీఐ ప్రదీప్‌కుమార్, రూరల్ ఏసీపీ విజయకుమార్ గ్రామానికి చేరుకొని శంకరయ్య ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. దంపతులిద్దరూ ఒకేసారి అపస్మారకస్థితిలోకి వెళ్లడం, లక్ష్మి మెడలోని పుస్తెలతాడు కనిపించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులెవరైనా ఇంట్లోకి వచ్చి మత్తుమందు చల్లి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారా ? లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. శంకరయ్య బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.