
- ప్రపంచంతో పోటీపడేలా రైల్వే అభివృద్ధి: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ
- వరంగల్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్‌కు హాజరు
వరంగల్, వెలుగు: రాబోయే రోజుల్లో దేశంలో బుల్లెట్ రైళ్లు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని బికనీర్ నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. వరంగల్ స్టేషన్ వద్ద నిర్వహించిన ప్రోగ్రామ్‌లో భూపతిరాజు శ్రీనివాస శర్మ మాట్లాడారు. ‘‘ప్రపంచంతో పోటీ పడేలా దేశంలో రైల్వే రంగ అభివృద్ధి జరుగుతున్నది.
తెలంగాణ రైల్వే బడ్జెట్‌ను మోదీ రూ.5,300 కోట్లకు పెంచారు. 2014 కంటే ముందు బడ్జెట్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. వరంగల్ అంటే ప్రధానికి ఎంతో అభిమానం. అందుకే అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో సమ్మక్కసారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు’’అని శ్రీనివాస శర్మ అన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
హైదరాబాద్‌తో సమానంగా గ్రేటర్ వరంగల్‌ను డెవలప్ చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో రూ.24,500 కోట్లతో 76 కిలో మీటర్ల మేర విస్తరించే ప్రపోజల్స్ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. దానికి ఆమోదం తెలపాలని కోరారు. వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ విస్తరించాలని, కాజీపేట రైల్వే స్టేషన్‍లో వుడ్ షీట్ ఏర్పాటు చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కేంద్రాన్ని కోరారు. రూ.425 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసినట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో పాటు ఆర్వోబీ ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా 3 స్టేషన్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, యశస్విని రెడ్డి పాల్గొన్నారు.