మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : కలెక్టర్ వెంకట్​రావు  

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : కలెక్టర్ వెంకట్​రావు  
  •     జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్​రావు  

సూర్యాపేట, వెలుగు : శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ రోజున చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు. ఓటర్లు ఎక్కువగా ఎపిక్ కార్డులు వినియోగించుకునేలా చూడాలని

12 గుర్తింపు కార్డులు చూపి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలోని 22 కేంద్రాల్లో 800 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని పీవో డైరీలో నమోదు చేయాలని, సీలింగ్ ప్రాసెస్ ను నిశ్చితంగా పరిశీలించాలని చెప్పారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ రోజు చేపట్టే విధివిధానాల గురించి వివరించారు.

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస రాజు, మాస్టర్ ట్రైనర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు 

శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

మహిళా ఓటర్లు 34,176 మంది, పురుష ఓటర్లు 17,321 మంది మొత్తం 51,497 మంది ఉన్నారని తెలిపారు. అంతకుముందు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఆయన పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు తెలుసుకున్నారు.