
రాబోయే జల్లికట్టు పండుగ కోసం మధురైకి చెందిన కీర్తన అనే ట్రాన్స్‌జెండర్ ఎనిమిది ఎద్దులకు శిక్షణ ఇస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కీర్తన ఈ పనికే అంకితమై ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన మరో ఇద్దరు సభ్యులు కూడా ఈ ఎద్దుల సంరక్షణలో కీర్తనకు సహాయం చేస్తున్నారు. సాధారణంగా జనవరిలో జరిగే పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళనాడులో జల్లికట్టును నిర్వహిస్తారు. అయితే ఈ పోటీలు ఇంతకు ముందు పురుషులకు మాత్రమే సంబంధించిన వీరోచిత క్రీడగా భావించేవారు. ఆ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ కీర్తన మరో అధ్యాయానికి పునాది వేశారు.
శిక్షణ ఇస్తున్న మూగజీవాలను కీర్తన కంటికి రెప్పల్లా చూసుకుంటున్నారు. తన వద్ద ప్రస్తుతం 8 ఎద్దులు ఉన్నాయని చెప్పారు. త్వరలో జరగనున్న జల్లికట్టు పోటీలకు వీటికి శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. సంప్రదాయ క్రీడ అయిన ఈ జల్లికట్టులో విజయం సాధించాలనేదే తన కోరిక అని కీర్తన చెబుతున్నారు. తనకు పిల్లలు ఉంటే ఎలా అయితే చూసుకునేవారో..ఇప్పుడు వీటిని ఆ మాదిరిగానే చూసుకుంటున్నానని, అవి విజయం సాధిస్తే తన పిల్లలు విజయం సాధించినట్టు సంబరపడుతామని కీర్తన తెలిపారు.