
- పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నం
- డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- పార్టీలతో సంబంధం లేకుండా ఇండ్లు ఇస్తున్నాం: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ/ వరంగల్, వెలుగు: గత ప్రభుత్వంలో గూడు కోసం ఎదురుచూసిన పేదలందరికీ నిరాశే మిగిలిందని, కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో ఆరేండ్ల కింద కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి పొంగులేటి శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇండ్లు కట్టి ఆరేండ్లయినా పేదలకు ఇవ్వలేక ఓటు బ్యాంక్ రాజకీయం చేసిందన్నారు. గుడిసెవాసులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చింది చాలా ప్రైమ్ ఏరియా అని, జీవనోపాధికి అన్ని అవకాశాలున్నాయన్నారు. వరంగల్ తోపాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్లమ్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, ఈ మేరకు అదనపు ఇండ్లకు ప్రపోజల్స్ రెడీ చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
ట్విట్టర్ టిల్లుకు బుద్ధి చెప్పాలి..
రోటీ, కప్డా, మకాన్ నినాదంతో ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, ఫ్రీ కరెంట్.. ఇలా వాగ్ధానాలన్నీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారన్నారు. ట్విట్టర్ టిల్లు సీఎం అనే రెస్పెక్ట్ లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
తమకు పుట్టిన బిడ్డను ఎత్తుకుంటున్నారని పింకీ గొర్రెలు మాట్లాడుతున్నాయని, మరి పదేండ్లలో ఇండ్లు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. రాఖీ పండుగ సందర్భంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆడబిడ్డలకు కానుక ఇచ్చాడని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లలో చేయని పని, కేవలం 18 నెలల్లోనే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసి చూపించారన్నారు.
మాకెందుకు ఇల్లు ఇయ్యరు..?
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభిస్తుండగా, కొంతమంది మహిళలు నిరసనకు దిగారు. తమది అంబేద్కర్ నగరేనని, తమకు ఇల్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల దారిలో వరంగల్ ప్రెస్ క్లబ్ వద్ద ఆందోళన చేపట్టగా, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు మాట్లాడుతూ తాము అంబేద్కర్ నగర్ లోనే ఉంటున్నామని, ఇల్లు కేటాయిస్తామని స్వామి అనే వ్యక్తి డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. నిరసనకు దిగిన మహిళలను సుబేదారి పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించడంతో బాధితులు డబ్బులు తీసుకున్న వ్యక్తులపై ఫిర్యాదు చేశారు.
పార్టీలతో సంబంధం లేకుండా ఇండ్లు..
అంబేద్కర్ నగర్ లో ఏ పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయబోమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారని, కొందరు దళారులు రూ.3 లక్షల చొప్పున దాదాపు 2 వేల మంది నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ఇండ్లు పంచితే డబ్బులు ఇచ్చినవాళ్లంతా మీదపడతారనే ఇండ్ల పంపిణీ చేయలేదన్నారు.
గత పాలకుల హయాంలో దళారులకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ముందుకు వచ్చి చెప్తే, తిరిగి ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. గుడిసె వాసులు వర్షాలకు తడవద్దనే ఉద్దేశంతోనే ఇప్పటికిప్పుడు ఇండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనిపై తప్పులు వెతకవద్దని విజ్ఞప్తి చేశారు. తన హయాంలో ఇంత మందికి డబుల్ ఇండ్లు ఇవ్వడం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషాన్నిస్తోందన్నారు. వరంగల్ ను 18 నెలల్లో హైస్పీడ్ డెవలప్ చేస్తున్నామన్నారు. మరింత డెవలప్మెంట్ కోసం వరంగల్ వెస్ట్ నియోజక వర్గాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, 592 ఇండ్లలో ఎస్సీలకు 277, ఎస్టీలకు 40, బీసీలకు 235, మైనార్టీలకు 31, ఇతరులకు 9 కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, వరంగల్ కలెక్టర్ సత్యశారదా, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.