సంజయ్‌‌.. నీ అధ్యక్ష పదవి ఎందుకు పోయింది? : పొన్నం ప్రభాకర్

సంజయ్‌‌.. నీ అధ్యక్ష పదవి ఎందుకు పోయింది? : పొన్నం ప్రభాకర్
  •    ముందు సమాధానం చెప్పి ప్రజలను ఓట్లు అడుగు : పొన్నం
  •     అవినీతికి పాల్పడ్డ నీకు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే అర్హత ఉందా?
  •     నీటి ఎద్దడిపై బీఆర్ఎస్ నేతల మాటలు అవివేకమని ఫైర్

 హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం ఎందుకు తొలగించిందో బండి సంజయ్‌‌ సమాధానం చెప్పాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే కరీంనగర్ ప్రజలను ఆయన ఓట్లు అడగాలన్నారు. గాంధీ భవన్‌‌లో బుధవారం మీడియాతో మంత్రి పొన్నం చిట్ చాట్ చేశారు. యాత్రల పేరుతో సంజయ్ అవినీతికి పాల్పడ్డారని బీజేపీలోనే అప్పుడు చర్చ జరిగిందన్నారు. గతంలో కరీనంగర్ ఎంపీగా పనిచేసిన ఎవరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఈ క్రమంలో సంజయ్‌‌ కి కరీనంగర్ ఎంపీగా పోటీ చేసే అర్హత ఉందా?

అని మంత్రి ప్రశ్నించారు. కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేశారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా బండి సంజయ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్,- కాంగ్రెస్ ఒక్కటై కరీంనగర్‌‌లో గంగుల కమలాకర్‌‌ ను గెలిపించినట్లు సంజయ్ ఆరోపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘‘బండి సంజయ్, గంగుల కమలాకర్‌‌కు మధ్య ఉన్న స్నేహం, గ్రానైట్ వ్యాపార లావాదేవీల గురించి అందరికీ తెలుసు. బీజేపీలో సంజయ్ కి, ఈటలకు పొసగడం లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. బీజేపీలో సంజయ్ ఆస్కార్ అవార్డు స్థాయి నటుడు”అని పొన్నం ఎద్దేవా చేశారు. 

సెప్టెంబర్‌‌లో వర్షాలు పడకపోవడం వల్లే నీటి ఎద్దడి.. 

కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అని బీఆర్ఎస్ నేతలు అనడం అవివేకమని పొన్నం ఫైర్​ అయ్యారు. సెప్టెంబర్‌‌లో వర్షాలు పడకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్‌‌లో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, కాబట్టి కరువుకు ఆ పార్టే కారణమని తాము అనడం లేదన్నారు. వాతావరణ పరిస్థితులే ప్రస్తుత నీటి ఎద్దడికి కారణమన్నారు. అలాగే అధికార యంత్రాంగం పంట నష్టం వివరాలు సేకరిస్తున్నదని, వివరాలు వచ్చాక పరిహారం చెల్లింపు గురించి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. 

కవిత అరెస్టు విషయంలో - బీజేపీ నాటకాలు

కవిత అరెస్టు విషయంలో బీజేపీ,- బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని పొన్నం మండిపడ్డారు. కవిత అరెస్టుతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నమ్మించే ప్రయత్నం చేస్తోందన్నారు. కవితను అన్యాయంగా అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. అలాగే, తన ఫోన్ కాల్ రికార్డు చేసి..  ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపారని, ఈ విషయంలో హనుమకొండ ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

మహాలక్ష్మి @ 30 కోట్ల టికెట్లు 

మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 30 కోట్ల టికెట్ల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి పొన్నం వెల్లడించారు. ఈ స్కీమ్​ను ప్రారంభించిన తరువాత బస్సుల్లో ప్రయాణించే మహిళల శాతం పెరిగిందన్నారు. రోజుకు 33 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉచిత ప్రయాణం ద్వారా రవాణా చార్జీలు ఆదా అవుతుండడంతో ప్రతి ఇల్లు ఆర్థిక వృద్ధిని సాధిస్తోందన్నారు. ఇదే ప్రజలు కోరుకున్న ప్రజా పాలన అని పొన్నం వివరించారు.