ఇందూర్​లో గంజాయి ఘాటు.. టెక్నిక్​లు మారుస్తూ సరఫరా

ఇందూర్​లో గంజాయి ఘాటు.. టెక్నిక్​లు మారుస్తూ సరఫరా
  • ఉల్లిలోడు, ఖాళీ డాంబర్​డబ్బాలు, స్టెప్నీ టైర్లలో సరుకు రవాణా
  • విక్రేతల్లో మహిళా నేరస్తులు
  • యూత్, కాలేజీ స్టూడెంట్స్​టార్గెట్​గా అమ్మకాలు
  • గంజాయి మత్తులో నేరాలు 

నిజామాబాద్, వెలుగు:  ఇందూరు జిల్లాలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. పక్కనున్న మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా నుంచి జిల్లాకు సరుకు రవాణా అవుతోంది. గంజాయి రవాణాకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్​లు వాడుతున్నారు. రైలు, కారు, స్టెప్నీ టైర్లు, ఉల్లిగడ్డల లోడు, ఖాళీ డాంబర్​డబ్బాల వ్యాన్​లను రవాణాకు వినియోగిస్తున్నారు.సమాచారం తెలిసినప్పుడే ఎక్సైజ్, పోలీస్​ అధికారులు దాడులు చేస్తున్నారే కానీ దందాను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. యువత, కాలేజీ స్టూడెంట్స్​లక్ష్యంగా గంజాయి సేల్స్​కొనసాగుతున్నాయి. పలువురు సరదా కోసం గంజాయి తాగడం ప్రారంభించి, దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని నేరాల వెనుక గంజాయి మత్తు ఉన్నట్లు తేలింది. 

ఉదాహరణలు అనేకం.. 

నగర శివారులోని ఐటీఐ కాలేజీ గ్రౌండ్​లో నెల కింద సాయంత్రం పూట ఓ యువకుడు అచేతనంగా పడి ఉన్నాడు. గమనించిన పోలీసులు దగ్గరికెళ్లి చూడగా, గంజాయి మత్తులో సోయిలేకుండా పడి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేస్తే భవిష్యత్తు పాడవుతుందని అతడి పేరెంట్స్​ని పిలిపించి కౌన్సిలింగ్​ఇచ్చారు. అయినా ఆ యువకుడి అలవాటు మానలేదు. జిల్లా కేంద్రంలో నివాసముండే ఓ రెవెన్యూ ఆఫీసర్​ గంజాయికి బానిసగా మారి ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నాడు. నగరంలోని విక్రయదారుల ఫోన్​నెంబర్లు, అడ్రస్​లు మెయింటెన్​ చేస్తున్నాడు. క్వాలిటీ గంజాయి ఏ అడ్డాలో దొరుకుతుందో చెప్పే స్థాయికి చేరాడు. మలేపల్లి శివారులో జనవరిలో జరిగిన మర్డర్​కేసులో నిందితుడు గంజాయి తాగినట్లు రక్త పరీక్షలో పోలీసులు తేల్చారు. సిటీ నడిబొడ్డున కోర్ట్​కాంప్లెక్స్​ చౌరస్తాలో నెల కింద గంజాయి తాగిన ఇద్దరు యువకులు బైక్​తో చేసిన హంగామా వైరలైంది.

ఎప్పటికప్పుడు కొత్తగా..

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్​ కేంద్రాలుగా గంజాయి బిజినెస్​నడుస్తోంది. పొరుగున ఉన్న నాందేడ్​ నుంచి సరుకును ఉల్లిగడ్డల లోడు వ్యాన్​లలో, ఖాళీ డాంబర్​డబ్బాల్లో తరలిస్తున్నారు. కారు స్టెప్నీ టైరును సైతం ఇందుకోసం వాడుతున్నారు.

మారని తీరు..

మూడు నెలల వ్యవధిలో ఎక్సైజ్, పోలీస్​ఆఫీసర్లు 40 కేసులు నమోదుచేసి, 62 మందిని జైలుకు పంపారు. 24 వాహనాలు సీజ్​చేశారు. అయినా తీరు మారడం లేదు. 

అప్పటి ప్లాన్ అవసరం..

గతంలో జిల్లాలో నాటుసారా అమ్మకాలు విపరీతంగా ఉండేవి. దీన్ని ఆపడానికి రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్​ఆఫీసర్లు సమన్వయంతో పనిచేశారు. నాటుసారా కేసులు నమోదైతే రేషన్​బియ్యం, పింఛన్​ఇతర సర్కారు పథకాలు ఇవ్వమని హెచ్చరించేవారు. దీంతో గణనీయమైన మార్పు వచ్చింది. ఇదే విధానాన్ని గంజాయిని సరఫరా చేసేవారి విషయంలోనూ అమలుచేస్తే పరిస్థితిలో మార్పు కనిపించే అవకాశం ఉంటుదని పలువురు అభిప్రాయం వ్యక్తం 
చేస్తున్నారు.

పదేండ్ల నుంచి జీవిత ఖైదు

గంజాయి మాదకద్రవ్యాల లిస్టులో ఉంది. గంజాయితో పట్టుబడే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదేండ్ల నుంచి జీవిత ఖైదు శిక్ష పడే వీలుంది. అమ్మకందారులకు కౌన్సిలింగ్​ ఇస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. 

మల్లారెడ్డి, జిల్లా ఎక్సైజ్​  సూపరింటెండెంట్​