
- సిద్దిపేట జిల్లాలో రెండు నేషనల్ హైవేల నిర్మాణ పనులు ప్రారంభం
- ఆరు వేల చెట్లకు పొంచి ఉన్న ముప్పు
- ఇప్పటికే వెయి చెట్ల నరికివేత
- జాడలేని ట్రీ ట్రాన్స్ లొకేషన్
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టని అధికారులు
సిద్దిపేట, వెలుగు: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు నేషనల్ హైవే నిర్మాణం కోసం వేల సంఖ్యలో చెట్లను నరికివేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లాలో రెండు నేషనల్ హైవేల నిర్మాణ పనులు ప్రారంభం అవుతుండటంతో దాదాపు ఆరు వేలకు పైగా చెట్లు కొట్టివేయాల్సి వస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి చెట్లను నరికి వేశారు. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట మీదుగా మెదక్ వరకు 765 డీజీ, జనగామ నుంచి దుద్దెడ మీదుగా సిరిసిల్ల వరకు 365బీ నేషనల్ హైవేల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు వెళ్లే నేషనల్ హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో ఎల్కతుర్తి నుంచి సిద్దిపేటకు 64 కిలో మీటర్లు రెండవ ప్యాకేజీ కింద పనులను ప్రారంభించారు. జనగామ జిల్లా నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు సుమారు 105 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే నిర్మాణ పనులను చేర్యాల వద్ద చేపడుతున్నారు. రెండు నేషనల్ హైవేలు సిద్దిపేట జిల్లా పరిధిలో దాదాపు 200 వందల కిలో మీటర్ల మేర సాగుతోంది. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే చెట్ల నరికివేతను ప్రారంభించినా అర్ధ శతాబ్దానికి పైగా చల్లని నీడనిస్తున్న మహావృక్షాలు హైవే నిర్మాణ పనుల మూలంగా కనుమరుగవుతున్నాయి.
నేలమట్టం కానున్న ఆరు వేల చెట్లు
సిద్దిపేట జిల్లాలో ఎల్కతుర్తి నుంచి మెదక్ మార్గంలో ఐదు వేలు, జనగామ నుంచి సిరిసిల్ల మార్గంలో వెయ్యి చెట్లను నరికివేయనున్నారు. ఎల్కతుర్తి నుంచి మెదక్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా రెండో ప్యాకేజీ హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని జిల్లెల్లగడ్డ నుంచి సిద్దిపేట డివిజన్ లోని రంగథాంపల్లి వరకు 47 కిలో మీటర్ల మేర ఇప్పటికే పనులను ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 500 వందల చెట్లను నరికివేశారు. జనగామ నుంచి దుద్దెడ వరకు 45 కిలోమీటర్ల నేషనల్ హైవేకు సంబంధించి చేర్యాల సమీపంలోని గురిజకుంట వద్ద 500 వందల చెట్లను నరికివేశారు. అలాగే సిద్దిపేట నుంచి సిరిసిల్లా జిల్లా ఇల్లంత వరకు చేపట్టిన సుమారు 30 కిలోమీటర్ల రోడ్డు విస్తరణలోనూ భారీ చెట్లను నరికివేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ?
హైవే నిర్మాణంతో తొలగించిన చెట్లకు ప్రత్యామ్నాయంగా మరోచోట మొక్కలు నాటి పెంచాల్సి ఉన్నా ఎలాంటీ ఏర్పాట్లు జరగడం లేదు. హైవే నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపునకు నిబంధనల ప్రకారం ఒక్కో చెట్టుకు రూ.500 డిపాజిట్ చెల్లించినా వాల్టా చట్టం ప్రకారం ఒక్కో చెట్టుకు రెండు మొక్కలు పెంచాలనే నిబంధనను పట్టించుకోవడం లేదు.
తరలించే అవకాశమున్నా..
పనులు జరుగుతున్న రోడ్లలో 60 ఏండ్లు పైబడిన మహా వృక్షాలు అనేకం ఉన్నాయి. ట్రీ ట్రాన్స్ లోకేషన్ ద్వారా వీటిని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నా ఆర్థిక భారం పేరిట దీన్ని పట్టించుకోవడం లేదు. ఒక్కో చెట్టు తరలింపునకు కనీసం పాతిక వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం వుండటంతో దీనిపై ఎవరు దృష్టి సారించడం లేదు.
మహా వృక్షాలనైనా కాపాడుకోవాలి
హైవే నిర్మాణంతో చెట్లను నరికి వేసే బదులు కొన్ని మహావృక్షాలనైనా కాపాడుకునేలా అధికారులు ప్లాన్ చేయాలి. దాతల సహకారంతో ముఖ్యమైన చెట్లను ట్రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా తరలించేలా చూడాలి.
–బీ.సత్యనారాయణ, చేర్యాల