మూడు జిల్లాల్లో మూడు పరీక్షలు రాయాలె..గురుకుల పరీక్ష కేంద్రాల కేటాయింపులో లీలలు

మూడు జిల్లాల్లో  మూడు పరీక్షలు రాయాలె..గురుకుల పరీక్ష కేంద్రాల కేటాయింపులో లీలలు

గురుకుల పోస్టుల పరీక్షలకు  టీఆర్ఈఐఆర్​బీ హాల్ టికెట్లను వెబ్ సైట్​లో పెట్టింది. అయితే, అభ్యర్థులు ఒక్కో ఎగ్జామ్ ఒక్కో జిల్లాలో రాయాల్సి వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో గురుకుల పోస్టుల పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ రెసిడెన్షియల్  ఎడ్యుకేషనల్  ఇన్ స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తున్నది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆన్​లైన్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీఆర్ఈఐఆర్బీ వెబ్ సైట్​లో పెట్టింది. అయితే, అభ్యర్థులు ఒక్కో ఎగ్జామ్ ఒక్కో జిల్లాలో రాయాల్సి వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. వివిధ సొసైటీల పరిధిలోని గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్‌, పీడీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్  టీచర్ పోస్టులకు ఆగస్టు1 నుంచి 23 వరకూ ఆన్​లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. 17 జిల్లాల్లో 104 ఆన్​లైన్ పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. పోస్టులు, సబ్జెక్టుల వారీగా రోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్ట్  షిఫ్ట్ ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు, సెకండ్  షిఫ్ట్  మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. చాలా మంది అభ్యర్థులకు మూడు పరీక్షలను మూడు జిల్లాల్లో రాసేలా సెంటర్లు కేటాయించారు. దీన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు.  మూడు పరీక్షలు రాస్తేనే, ఆ క్యాండిడేట్​ ఎగ్జామ్ రాసినట్లు పరిగణిస్తారు. రాసే మూడు పేపర్లు సీరియల్​గా కాకుండా.. జంబ్లింగ్​లో రాసేలా ఏర్పాట్లు చేశారు. అంటే కొందరు సెకండ్  పేపర్  తొలిరోజు రాస్తే, ఇంకొందరు థర్డ్  పేపర్  రాస్తారు. దీనివల్ల కూడా అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.  కొందరు అభ్యర్థులకు హన్మకొండ, హైదరాబాద్​లో  మూడు పరీక్షలు రాసే చాన్స్ వచ్చింది. ఇంకోపక్క ఈవినింగ్ సెషన్​ ఒక జిల్లాలో ఒక పరీక్ష రాసి.. మరుసటి రోజే ఉదయం మరో పరీక్షకు ఇంకో జిల్లాలో సెంటర్ పడిన వాళ్లు వందల్లో ఉన్నారు. 

నాలుగు రోజులు ఇబ్బందే...

ఈ నెల 10, 11, 12, 13వ తేదీల్లో ఎక్కువ మంది జన రల్  స్టడీస్  రాస్తున్నారు. దీంతో ఆ నాలుగు రోజులు మాత్రం పరీక్షా కేంద్రాలు మార్చినట్టు అధికారులు చెప్తున్నారు. టీజీటీ మ్యాథ్స్  26 వేల మంది రాస్తున్నారు. వారందరినీ ఒకేసారి సర్దుబాటు చేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో టెక్నాలజీపరంగా వేగంగా ముందుకు పోతున్నట్టు సర్కారు ప్రకటిస్తున్నా.. ఆచరణలో కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 33 వేల మందే ఆన్​లైన్ పరీక్షలు రాసే అవకాశముంది. మ్యానువల్​గా అయితే ఒకేసారి 10 లక్షల మంది రాసే చాన్స్​ ఉంటుంది. 

ఆన్​లైన్ కావడంతోనే :  మల్లయ్యభట్టు, సెక్రటరీ 

ఆన్​లైన్ పరీక్షలు కావడంతోనే ఎగ్జామ్  సెంటర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో వేర్వేరు జిల్లాల్లో సెంటర్ల అలాట్మెంట్‌ జరిగింది. వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు పడిన అభ్యర్థులకు పరీక్షల తేదీల్లో గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. సాయంత్రం పరీక్ష రాసి.. మళ్లీ ఉదయమే ఎగ్జామ్  ఉన్న అభ్యర్థుల వివరాలు సేకరించాం. వారికి ఎలా న్యాయం చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం.  

కొన్ని ఉదాహరణలు..

 జగిత్యాల జిల్లాకు చెందిన ఓ టీజీటీ తెలుగు అభ్యర్థికి ఆగస్టు 7న పేపర్– 2 మేడ్చల్ జిల్లాలో సెంటర్  పడితే, పేపర్ –3 కరీంనగర్​లో, పేపర్ –2 పెద్దపల్లిలో సెంటర్​ పడింది.  ఫిజికల్ సైన్స్ అభ్యర్థికి ఆగస్టు 4న పేపర్ –2 పరీక్ష మేడ్చల్​ జిల్లాలో సెంటర్  పడగా, 14వ తేదీన పేపర్ –1 కరీంనగర్ జిల్లాలో, 22న పేపర్ –3  హన్మకొండలో పరీక్ష కేంద్రం అలాట్ అయింది. మరో అభ్యర్థికి ఆగస్టు5న పేపర్–2 పరీక్ష మేడ్చల్​లో , 11న పేపర్–1 ఎగ్జామ్ మెదక్ లోని నర్సాపూర్ లో, పేపర్– 3 సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో సెంటర్ పడింది.