అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్ లో ట్రెండ్స్ రిలయన్స్ బట్టల దుకాణంలో మంగళవారం చోరీ జరిగింది. స్టోర్ మేనేజర్ నాగరాజు తెలిపిన వివరాలు ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు షో రూమ్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఐటీ ఎక్విప్మెంట్కు సంబంధించిన సర్వర్స్, సీసీ కెమెరాల డివైస్ లను చోరీ చేశారు.
అనంతరం క్యాష్ సేఫ్ లాకర్ ను పగులగొట్టి రూ .38,500 నగదుతోపాటు బట్టలను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం షోరూం తీసేందుకు సిబ్బంది రాగా తాళాలు పగులగొట్టి, షట్టర్ తెరచి ఉండటాన్ని గమనించారు. సుమారు రూ.2లక్షలకు పైగానే చోరీ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కొత్తగూడెం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు.