కాల్వలు పూర్తికాకుండానే ట్రయల్ రన్

కాల్వలు పూర్తికాకుండానే ట్రయల్ రన్
  • కొసెల్లని గౌరవెల్లి కెనాల్స్ 
  • గోదావరి జలాలు తెచ్చామని చెప్పుకునేందుకు సర్కారు ఆరాటం
  • ఎడుమ కాలువ పనులు ఆగమాగం
  • పర్యవేక్షణ లేక దెబ్బతిన్న కుడి కాలువ
  • నత్తనడకన సాగుతున్న కెనాల్ వర్క్స్ 

సిద్దిపేట, వెలుగు: గౌరవెల్లి రిజర్వాయర్ ఆరంభ శూరత్వంలా మారింది. ఆగమేఘాల మీద ప్రాజెక్టు నిర్మించిన ప్రభుత్వం.. కాల్వలు పూర్తి చేయకుండానే ట్రయల్ రన్ నిర్వహించింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు తెచ్చామని చెప్పుకునేందుకు ఆరాటపడ్డ నేతలు.. పొలాలకు నీళ్లు అందించే కాలువల నిర్మాణంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రిజర్వాయర్ కు చెందిన కుడి, ఎడమ  కాలువల నిర్మాణాన్ని ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.43 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు రీడిజైన్ చేసిన సర్కారు.. అందుకు అనుగుణంగా కాలువల నిర్మాణం చేపట్టడం లేదు. పాత డిజైన్ ప్రకారం ఐదేండ్ల కింద పనులు ప్రారంభించగా.. నేటికీ ‘సాగుతూ..’ ఉన్నాయి.

కుడి కాలువపై పర్యవేక్షణ కరువు..
గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి 46 కిలోమీటర్ల మేర కుడి కాలువ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భీమదేవరపల్లి, సైదాపూర్, ధర్మసాగర్, స్టేషన్ ఘన్ పూర్, జాఫర్ గడ్, హనుమకొండ, రఘునాథపల్లి తదితర మండలాల్లో 90వేల ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పించింది. కానీ ఈ కాలువ పనులు కొంతమేరే పూర్తి చేశారు. పర్యవేక్షణ లేక కాలువలో చెట్లు, ముళ్లపొదలు పెరిగాయి. చాలాచోట్ల సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. అలాగే ప్రాజెక్టులో కుడి కాలువకు నీళ్లు వదలడానికి ఉద్దేశించిన తూము నిర్మాణం కూడా ఇంకా పూర్తికాలేదు.

ముక్కలుముక్కలుగా ఎడమ కాలువ పనులు
గౌరవెల్లి నుంచి 20 కిలోమీటర్ల మేర సాగే ఎడమ కాలువ పనులు.. ముక్కలు ముక్కలుగా చేసి వదిలిపెట్టారు. కేవలం 10 కిలోమీటర్ల మేరే కాలువ తవ్వారు. అవి కూడా అక్కడక్కడే నిర్మించారు. ఈ కెనాల్ ద్వారా అక్కన్నపేట, హుస్నాబాద్, కొహెడ, చిగురుమామిడి మండలాల్లోని 16వేల ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ కాలువ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ అక్కడక్కడ మట్టి పనులు చేసి వదిలిపెట్టాడు. సిమెంట్ లైనింగ్, అవసరమైన చోట్ల బ్రిడ్జి పనులు చేపట్టలేదు. దాదాపు ఆరేండ్ల కిందే ఈ పనులు మొదలుపెట్టగా ప్రస్తుతం కాలువ మొత్తం చెట్లు,పొదలతో నీళ్లు వెళ్లని పరిస్థితి ఏర్పడింది.

డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఊసే లేదు..
రూ.వేల కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించిన ప్రభుత్వం.. కాలువల ద్వారా పొలాల్లోకి నీటిని మళ్లించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాన్ని మాత్రం మరిచింది. కుడి, ఎడమ కాలువలను కొంతమేర ప్రారంభించి వదిలేసినా..  వీటి ద్వారా పొలాలకు వెళ్లే పిల్ల కాలువల నిర్మాణాన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. అటు ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా పూర్తికాకపోవడంతో.. ఒకవేళ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలితే.. చెరువుల్లోకి, అటు నుంచి పొలాల్లోకి నీళ్లు ఎలా వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలువలు పూర్తి చేయకుండానే ట్రయల్ రన్ ప్రారంభించడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు కట్టకుండా ప్రాజెక్టు కట్టి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.

చాలావరకు పూర్తి చేశాం
గౌరవెల్లి రిజర్వాయర్ కు సంబంధించి కుడి, ఎడమ కాల్వల పనులు చాలా వరకు పూర్తి చేశాం. ఎడమ కాల్వ విషయంలో కొన్ని పనులు  అసంపూర్తిగా మిగిలాయి. పనులు నిర్వహించే  కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలి  వేయడం వల్ల పూర్తి చేయలేకపోయాం. మిగిలిన పనులు నిర్వహించడానికి  అసరమైన  చర్యలు తీసుకుంటున్నాం. వీటికి సంబంధించి ఎస్టిమేషన్లు తయారు చేసి ఎడమ కాల్వ పనులు ప్రారంభిస్తాం. కుడి కాల్వ పనులు చాలావరకు కంప్లీట్ చేశాం.                            – రాములు నాయక్, ఈఈ గౌరవెల్లి ప్రాజక్టు