
- ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు
- బీజేపీ గెలిచే సీట్లు, చీల్చే ఓట్లపైనే ప్రధాన పార్టీల భవితవ్యం
- ఓట్ల చీలికతో తమకే మేలు జరుగుతుందని ఆశిస్తున్న బీఆర్ఎస్
- ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయన్న ధీమాలో కాంగ్రెస్
వెలుగు, నెట్వర్క్: ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్తున్నప్పటికీ.. దాదాపు 30 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఆయా చోట్ల ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ గెలిచే సీట్లు, చీల్చే ఓట్లపైనే బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. వారం కింది వరకు బీజేపీలో పెద్దగా జోష్ లేనప్పటికీ.. ఇటీవల ప్రధాని మోదీ వరుస పర్యటనలు, బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామన్న హామీలతో పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీలో జోష్ పెరిగింది.
బీసీ సీఎం నినాదం ఏ కొద్దిగా పని చేసినా, ఎస్సీ వర్గీకరణ హామీతో మాదిగ సామాజిక వర్గం ఎంతో కొంత బీజేపీ వైపు మొగ్గు చూపినా ఎన్నికల ఫలితాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక పసుపు బోర్డు ఏర్పాటు హామీతో ఉత్తర తెలంగాణలోని మూడు, నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ కాస్త బలపడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏయే వర్గాల ఓట్లను, ఏ మేరకు చీలుస్తుంది? ఏయే పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు సిర్పూర్, పటాన్చెరు, సూర్యాపేట లాంటి నియోజకవర్గాల్లో బీఎస్పీ సైతం గట్టి పోటీ ఇస్తున్నది. ఈ మూడు చోట్ల ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్‌ఫిగర్ సాధించాలి. ఎంఐఎం తప్పనిసరి గెలిచే 6 సీట్లను వదిలేస్తే, మిగిలే 113 స్థానాల్లోనే మిగతా పార్టీలు కొట్లాడాలి. కానీ ఇటీవల వెలువడిన పలు సర్వేలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్మధ్య పోటాపోటీ ఉంటుందని.. హంగ్కూడా రావచ్చని తేల్చాయి. చాలా నియోజకవర్గాల్లో టఫ్ఫైట్ఉంటుందని, ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో బయటపడ్తారని పేర్కొన్నాయి. ప్రధానంగా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న 30 నియోజకవర్గాల వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని పొలిటికల్అనలిస్టులు అంటున్నారు.
బీజేపీ నుంచి కరీంనగర్లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, దుబ్బాకలో రఘునందన్‌రావు, హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, గోషామహల్లో రాజాసింగ్, ఉప్పల్‌లో ఎన్వీఎస్ఎస్ప్రభాకర్, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్రావు, నిజామాబాద్అర్బన్లో ధన్పాల్ సూర్యానారాయణ లాంటి బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆయా చోట్ల బీజేపీ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల తమకే మేలు జరుగుతుందని బీఆర్ఎస్ఆశిస్తోంది. పది చోట్ల తప్ప బీజేపీకి సొంత ఓటు బ్యాంకు లేదని, బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని జనం భావిస్తున్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా తమకే పడ్తాయని కాంగ్రెస్అంటున్నది. కానీ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే మాత్రం హంగ్ వచ్చే అవకాశంలేకపోలేదని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.
ఈ సెగ్మెంట్లలోనే హోరాహోరీ..
- కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సంజయ్‌లాంటి బలమైన నేత బీజేపీ నుంచి బరిలో ఉండడం, కాంగ్రెస్ గాలి వీస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీల మధ్య చీలి తాను బయటపడ్తానని గంగుల భావిస్తున్నారు.
- హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్ పోటీ పడుతున్నారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ.. ఈటలపై సానుభూతి తగ్గడం, కాంగ్రెస్ బలం పుంజుకోవడం తనకు కలిసి వస్తుందని కౌశిక్‌రెడ్డి భావిస్తున్నారు.
- కోరుట్లలో బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగరావు, బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. పసుపు బోర్డు మంజూరు, షుగర్ ఫ్యాక్టరీ హామీలతో అర్వింద్ముందుకెళ్తుండగా.. కాంగ్రెస్ హవా, గతంలో ఓడిన సానుభూతిపై నర్సింగరావు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వీరిద్దరూ చీల్చకుంటే తాను బయటపడ్తానని సంజయ్‌కుమార్ ఆశిస్తున్నారు.
- జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్, బీజేపీ నుంచి బోగ శ్రావణి బరిలో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న శ్రావణి.. బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో అధికార పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందంటున్నారు.
- ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న ఐదోసారి బరిలో నిలిచారు. ఆయనకు కాంగ్రెస్ క్యాండిడేట్కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గట్టి పోటీ ఇస్తున్నారు. మూడుసార్లు ఓడిపోయిన పాయల్శంకర్ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోరాడుతున్నారు.
- నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు మధ్య నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్‌కు సైతం బలమైన క్యాడర్ ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అంతుచిక్కడం లేదు.
- సిర్పూర్లో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
- పటాన్ చెరులో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన నీలం మధు ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు.
- మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్‌రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సునీల్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. 2014లో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
- వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి వికాస్‌రావు మధ్య పోటీ నెలకొంది. నాలుగుసార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్ సింపతీ వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నా, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కొడకు వికాస్‌రావు ఏం చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు.
- హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాం చక్రవర్తి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారింది. శ్రీరాం పేరు ఆలస్యంగా ప్రకటించడంతో ఆయన ప్రచారంలో వెనుకబడ్డారు. ఇది పొన్నం ప్రభాకర్ కు లాభిస్తుందా? వ్యతిరేక ఓట్లు చీలి సతీశ్‌కు మేలు జరుగుతుందా? అనే చర్చ నడుస్తోంది.
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి కొండా సురేఖ గట్టి పోటీ ఇస్తుండగా, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇరు పార్టీల అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు.
- నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ నుంచి బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ బరిలో ఉన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉండడం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి ధన్‌పాల్‌కు కలిసిరావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లపై షబ్బీర్ అలీ నమ్మకం పెట్టుకున్నారు.
- ఆర్మూర్‌లో బీఆర్ఎస్ నుంచి జీవన్‌రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వినయ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. జీవన్‌రెడ్డి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మైనస్‌గా మారుతోంది. బీజేపీ ఓటుబ్యాంకు మీద రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ వేవ్ మీద వినయ్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.
- మహేశ్వరంలో బీఆర్ఎస్ నుంచి సబితారెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీ చేస్తున్నారు. సబితా రెడ్డిపై బీఆర్ఎస్ క్యాడర్‌తో పాటు పబ్లిక్‌లోనూ వ్యతిరేకత ఉంది. గతంలో ఓడిన సెంటిమెంట్‌తో పాటు స్థానికుడు కావడం బీజేపీ అభ్యర్థికి కలిసివచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు పడ్తాయనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.