పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన

పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన
  • భూములు దున్ని నిరసన  ట్రాక్టర్లు సీజ్​ చేసిన 
  • ఫారెస్ట్​ అధికారులు  అడ్డుకుని గాలి తీసేసిన ట్రైబల్స్
  • కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత 

మాచారెడ్డి (కామారెడ్డి), వెలుగు : తాము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నా పోడు పట్టాలు ఇవ్వట్లేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి శివారులోని మర్రితండా, నెమలి గుట్ట తండా గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. అటవీ శాఖ భూముల్లో ట్రాక్టర్లతో దున్నారు. అందులోని బోర్డులను కూల్చేశారు. దీంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు, సిబ్బంది వచ్చి రెండు ట్రాక్టర్లను సీజ్​ చేశారు. వాటిని ఆఫీసుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా గిరిజనులు అడ్డుకున్నారు. ట్రాక్టర్ల టైర్లలో గాలి తీసేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న  పోలీసులు అక్కడికి వచ్చి సర్ది చెప్పబోయారు.

తాము ఈ భూముల్లో 20  ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, మిగతా చోట్ల అందరికీ పట్టాలు ఇస్తున్నారని, తమకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమకు కాంగ్రెస్​హయాంలో పట్టాలు ఇచ్చినా, ప్రతి ఏటా పంటల సాగు టైంలో  ఫారెస్ట్​ సిబ్బంది అడ్డుకుంటున్నారని, భూములు వదులుకునే ప్రసక్తే లేదని బైఠాయించారు. నచ్చజెప్పిన ఫారెస్ట్​ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫారెస్ట్​ భూముల్లో హద్దులను తొలగించడంతో పాటు చెట్లను ధ్వంసం చేశారని ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.