రోడ్ల కనెక్టివిటీ కలేనా?..గిరిజన పల్లెల్లో ముందుకు సాగని రోడ్లు, వంతెనల పనులు

రోడ్ల కనెక్టివిటీ కలేనా?..గిరిజన పల్లెల్లో ముందుకు సాగని రోడ్లు, వంతెనల పనులు
  • నిధులు మంజూరైనా రాని అటవీ అనుమతులు
  • ప్రయాణానికి గిరిజనుల పాట్లు
  • సమయానికి అంబులెన్స్​ రాలేని దుస్థితి
  • వానాకాలంలో పరిస్థితి మరీ అధ్వానం
  • ఆసిఫాబాద్​ జిల్లాలో నేటికీ సుమారు 200 గ్రామాల్లో రోడ్లు లేవు

ఆసిఫాబాద్, వెలుగు: మారుమూల గిరిజన పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆయా నిర్మాణాలు చేపట్టేందుకు అటవీ శాఖ పర్మిషన్ రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా గిరిజన ప్రాంతాలకు రోడ్ల కనెక్టివిటీ దూరమై, మట్టి, బురద, రాళ్లు తేలిన దారులపై వెళ్తూ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు, పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు, అనారోగ్యానికి గురైనప్పడు ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పల్లెలకు అంబులెన్స్​ రాలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు.

అడవిని ఆనుకొని ఎన్నో పల్లెలు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని  సుమారు 200 పల్లెలు ఉన్నాయి. జైనూర్, లింగాపూర్, కెరమెరి, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్(యు) మండలాల్లో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు 100కు పైనే, తిర్యాణి మండలం మంగి, గుండాల, మాణిక్యాపుర్, రొంపల్లి, కౌటగాం పంచాయతీ పరిధిలో సుమారు 62 పల్లెలున్నాయి. మండలాల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే సరైన రోడ్డు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.  

క్లియరెన్స్​ వస్తేనే పనులు

రోడ్లు నిర్మించాలని గిరిజనులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ప్రభుత్వం స్పందించి, 33 వంతెనలు, 31 రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తేనే పనులు జరగనున్నాయి. అలాగే పీఎంజీఎస్ వై కింద మంజూరైన13 రోడ్ల పనులు కూడా నిలిచిపోయాయి. 

అడవుల రక్షణ అంటూ ఇవ్వట్లే

చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రలోని అహేరికి రోడ్డు సౌకర్యం ఉంది. ఇక్కడ ఐదేళ్ల క్రితం హైలెవెల్ బ్రిడ్జి నిర్మించారు. కానీ కర్జెల్లి నుంచి గూడెం వరకు ఉన్న రోడ్డు రిపేర్​కు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వడం లేదు. అడవుల రక్షణ పేరిట దాటవేస్తున్నారు. దిందాకు వెళ్లే రోడ్డులో లో లెవెల్ వంతెన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం రూ.2.50 కోట్లు మంజూరయ్యాయి. అనుమతులు రాకపోవడంతో తట్టెడు మట్టి తీయలేదు. ఈ ఏడాది ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో మొరం పోశారు. ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో మళ్లీ బురద తయారవుతోందని స్థానికులు అంటున్నారు.

రోగాలు వస్తే తిప్పలే

వానాకాలంలో రోగాలు వస్తే తిప్పలు పడుతున్నం. బురద, సరైన రోడ్డు సౌలత్ ఉండకపోవడంతో నిత్యావసర సరుకులు తేవడం కష్టంగా ఉంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే కనీసం అంబులెన్స్ రావడానికి వీల్లేకుండా పోయింది. అధికారులు, లీడర్లకు సమస్య పరిష్కారం కాలే. ఇప్పటికైనా స్పందించి, రోడ్డు సౌకర్యం కల్పించాలి.- పంద్రం భీము, మంగి, తిర్యాణి

ఆస్పత్రికి సకాలంలో చేరలేం

మెయిన్ రోడ్డు నుంచి మా ఊరికి నాలుగు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది. రాళ్లు తేలి అధ్వానంగా మారింది. వానాకాలంలో రోగాలు వస్తే సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోతున్నం. గర్భిణులను ఎడ్ల బండిపై రోడ్డుకు  చేరుస్తున్నం. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్​మా ఊరికి రాదు. రోడ్డు వేసి, మా కష్టాలు దూరం చేయాలి.– పెందోర్ కేశవ్ రావు, తాడిగూడ, జైనూర్