దేవుడితోపాటు ఆళ్వార్లు కొలువై ఉండడం.. యాదగిరిగుట్ట ఆలయ ప్రత్యేకత : రామానుజ జీయర్ స్వామి

దేవుడితోపాటు ఆళ్వార్లు కొలువై ఉండడం.. యాదగిరిగుట్ట ఆలయ ప్రత్యేకత : రామానుజ జీయర్ స్వామి

యాదగిరిగుట్ట, వెలుగు : హిందూ దేవాలయాల్లో ఎక్కడా లేనివిధంగా భగవంతునితోపాటు ఆళ్వార్లు కొలువై ఉండడం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర విశిష్టత, ప్రత్యేకత అని త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ప్రవచించారు.  సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన తన పీఠం బృందంతో కలిసి దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. తూర్పు రాజగోపురం నుంచి త్రితల గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శనం కల్పించారు. 

అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బందికి జీయర్ స్వామి పండిత గోష్టి నిర్వహించారు. అనంతరం జీయర్ స్వామికి ఆలయ ఏఈవో జూషెట్టి కృష్ణ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాతుర్మాస్య దీక్ష ప్రారంభ మాసంలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ధన్యులమైనట్లు పేర్కొన్నారు. ప్రతి క్షేత్రంలో భగవంతుడు మాత్రమే కొలువై ఉండగా యాదగిరిగుట్ట క్షేత్రంలో మాత్రం భగవంతునితోపాటు ఆళ్వార్లు కూడా కొలువై ఉండడం ఆలయ ప్రత్యేకత అని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు రాజన్ బాబు, శంకర్ నాయక్, ఆలయ ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితులు తదితరులు ఉన్నారు.