భువనగిరిలో బీఆర్ఎస్​కు ట్రిపుల్​ఆర్ ఎఫెక్ట్​

భువనగిరిలో బీఆర్ఎస్​కు ట్రిపుల్​ఆర్ ఎఫెక్ట్​

యాదాద్రి, వెలుగు అసెంబ్లీ ఎన్నికలు యాదాద్రి జిల్లాలో బీఆర్​ఎస్​కు సవాల్​గా మారనున్నాయి. ట్రిపుల్​ఆర్​, బస్వాపురం అంశాలు మళ్లీ తెరమీదికి వచ్చాయి. ఎన్నికల సమయంలో బస్వాపూర్  నిర్వాసితులు రోడ్డెక్కారు. ట్రిపుల్ ఆర్​ బాధితులు ఏకంగా నామినేషన్లు వేస్తున్నారు. బస్వాపురం నిర్వాసితులు మళ్లీ ఆందోళనకు దిగారు. వారు కూడా నామినేషన్లు వేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు సమస్యలు బీఆర్ఎస్​తో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి తలనొప్పిగా మారాయి.  

రెండు మండలాల్లో ట్రిపుల్​ఆర్ ఎఫెక్ట్​

యాదాద్రి జిల్లా మీదుగా వెళ్లే 59.33 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు కారణంగా జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 1,917 ఎకరాలను రైతులు కోల్పోతున్నారు. భువనగిరి అసెంబ్లీ పరిధిలోని నాలుగు మండలాలు ఉండగా వలిగొండ, భువనగిరి మండలాల నుంచి దాదాపు వెయ్యి ఎకరాలను సేకరించనుండడంతో  ట్రిపుల్ ఆర్​ ప్రభావం ఉంది. వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి కూడా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న బీఆర్ఎస్​కు ట్రిపుల్ ఆర్, బస్వాపురం అంశాలు ఇబ్బందికరంగా మారాయి. ట్రిపుల్​ఆర్​గడిచిన మూడేండ్లుగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు రోడ్డెకి నిరసన తెలిపారు. అయిన్పటికీ.. వారికి ఉపశమనం కలిగేలా బీఆర్ఎస్​ నుంచి సంకేతాలు రాలేదు. ఇదే సమయంలో ఈ ఏడాది మే 31న యాదాద్రి కలెక్టరేట్ కు వచ్చిన మంత్రి జగదీశ్​రెడ్డిని ట్రిపుల్​ఆర్​ బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అదే రోజు రాత్రి రైతు కుటుంబానికి చెందిన గడ్డమీది మల్లేశ్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును పోలీసులు అరెస్టు చేసి నాన్​బెయిలబుల్​ కేసు పెట్టి 14 రోజులు రిమాండ్​కు తరలించారు. 

బెయిల్​ కోసం రైతులు ప్రయత్నం చేయగా వారిని జూన్​13న చేతులకు బేడీలకు వేసి భువనగిరి తీసుకొచ్చారు. దీంతో అధికార పార్టీపై ట్రిపుల్ ఆర్  బాధితుల్లో వ్యతిరేకత మరింత పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీలోకి రాయగిరికి వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి కూతురు మన్విత, మామ మోహన్​ రెడ్డిని ట్రిపుల్ ఆర్​ బాధితులు అడ్డుకున్నారు. ట్రిపుల్​ఆర్​ అంశంపై బీఆర్ఎస్​ నుంచి సహకారం లేకపోవడంతో బాధితులు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బాధిత కుటుంబాల నుంచి పలువురు నామినేషన్​ వేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాయగిరి మున్సిపాలిటీకి చెందిన అవిశెట్టి పాండు శనివారం నామినేషన్​ వేశాడు. మరికొందరు కూడా నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. అయితే నామినేషన్​ వేసిన ఒక్క రైతునే అందరూ బలపరచాలని కొందరు భావిస్తున్నారని సమాచారం. ట్రిపుల్​ఆర్​ వద్దు అన్న నినాదంతో ఎన్నికల్లో ఒక్కతాటిపై నిలబడాలని బాధితులు భావిస్తున్నారు.  

మళ్లీ భూ నిర్వాసితుల ఆందోళన

జిల్లాలోని భువనగిరి మండలం బస్వాపురంలో 11.39 టీఎంసీల కెపాసిటీతో  నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్​ నిర్మాణం ఏండ్ల తరబడి కొనసాగుతోంది. ఈ రిజర్వాయర్​ కారణంగా బీఎన్​ తిమ్మాపురం, లప్ప నాయక్​ తండా, చోక్లా నాయక్​ తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. ఇండ్లు మునిగిపోతున్నందున బీఎన్​ తిమ్మాపురం ఇండ్ల స్ట్రక్చర్​ వ్యాల్యూ రూ.95 కోట్లు, ఇంకా రావాల్సిన భూముల పరిహారం రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.145 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్​ 16న టోకెన్​ నంబర్​ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకూ బాధితులకు డబ్బులు అందలేదు. భూమికి సంబంధించిన పరిహారం పూర్తిగా అందకపోగా.. స్ట్రక్చర్​ వ్యాల్యూ కూడా రాకపోవడంతో నిర్వాసితులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

ALSO READ : ఐదేండ్లలో అభివృద్ధి ఏంటో చూపించా : పువ్వాడ అజయ్ కుమార్

ఇందులో భాగంగా తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర్​ వ్యాల్యూ, పరిహారం కలిపి రూ.145 కోట్లు వెంటనే ఇప్పించాలని డిమాండ్​ చేస్తూ రిజర్వాయర్​ పనులను అడ్డుకొని కట్టపైనే టెంట్​ వేసుకొని ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు డిసెంబర్​ 15 నాటికి అమౌంట్​ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు డైలమాలో పడిపోయారు. ఆందోళన విరమించాలని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ఆందోళన చేస్తున్నారు. ఇలా గడిచిన ఐదేండ్లుగా నిర్వాసితులు చాలాసార్లు అందోళన చేస్తున్నా.. వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ట్రిపుల్​ఆర్​ బాధితులు నామినేషన్​ వేయడంతో తాము కూడా నామినేషన్లు వేయాలని బస్వాపురం బాధితులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా నిర్వాసితుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఎన్నికల్లో ప్రభావం

భువనగిరి ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి పరిధిలోని ఈ రెండు అంశాలు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిగా మారి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. భూములు కోల్పోతున్న రైతులకు నచ్చజెప్పి ఎక్కువ నష్టం జరగకుండా, పరిహారం ఎక్కువగా ఇప్పిస్తామని చెప్పిన సందర్భాలు కూడా లేవు. ట్రిపుల్​ఆర్  అలైన్​మెంట్​ మార్చాలని భువనగిరి మున్సిపాలిటీలో తీర్మానం చేసినా అప్పటికే గెజిట్, అనుబంధ గెజిట్లు వచ్చినందున ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే బస్వాపురం నిర్వాసితులకు పరిహారం తక్కువగా రావడంతో వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పైగా నిర్వాసితులు కోల్పోతున్న ఇంటి స్థలానికి గజానికి కేవలం రూ.1300గా నిర్ణయించారు. ఇంత తక్కువ ధర మారుమూల గ్రామాల్లో కూడా లేదు. దీంతో నిర్వాసితుల్లో మరింత అసంతృప్తి పెరిగింది. ఈ రెండు సవాళ్లను ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి ఎలా అధిగమిస్తారని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.