డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అడ్‌‌‌‌హాక్ ప్రమోషన్ల‌‌‌‌ గండి

డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అడ్‌‌‌‌హాక్ ప్రమోషన్ల‌‌‌‌ గండి

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. చాన్నాళ్ల తర్వాత కొలువుల భర్తీకి పూనుకోవడంతో నిరుద్యోగులు, స్టూడెంట్లలో ఎన్నో ఆశలు రేకెత్తాయి. డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తే మంచి పోస్టులు దక్కుతాయని వారంతా భావించారు. కానీ, డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కింద భర్తీ చేయవలసిన గ్రూప్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ పోస్టులకు కొందరు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అక్రమ ప్రమోషన్లు ఇస్తున్నారు. చాలా శాఖల్లో అడ్‌హాక్ ప్రమోషన్ల పేరు మీద ఎన్నో పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంతే కాదు ఖాళీలను లెక్కించడంలోనూ సక్రమంగా పని చేయడం లేదు. దీంతో నేరుగా భర్తీ అయితే లాభపడే నిరుద్యోగులకు అడ్‌హాక్‌‌‌‌ ప్రమోషన్ల కారణంగా తీరని అన్యాయం జరుగుతోంది.

రాష్ట్రంలో 16 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివిన వీరంతా డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటాలో గ్రూప్స్ పోస్టుల నోటిఫికేషన్ల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది లేక పాలనా యంత్రాంగం బలహీనపడింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు దెబ్బతింటోంది. రాజ్యాంగం ప్రకారం బలమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటేనే పాలన సజావుగా సాగుతుంది. పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే ప్రజలకు పాలనపై నమ్మకం కలుగుతుంది. ప్రజల పనులు కూడా త్వరగా జరుగుతాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు పెరిగి ప్రజలకు సరైన సౌకర్యాలు అందడం లేదు.

పదేండ్లుగా పోస్టుల భర్తీ జరగట్లే

గ్రూప్–1 సర్వీస్ కింద పదేండ్లుగా పోస్టులు భర్తీ చేయడం లేదు. గ్రూప్–2 సర్వీస్ కింద ఐదేండ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల్లో ఎంతమంది రిటైర్ అయ్యారనే లెక్కలు పక్కాగా లేవు. ఎంత మందికి ప్రమోషన్లు ఇచ్చారనే డేటా కూడా లేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో 40 శాఖలకు చెందిన జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 డీఎస్పీ ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ ఆఫీసుల్లో గ్రూప్–1, గ్రూప్–2 సర్వీస్ పోస్టులు భారీ సంఖ్యలో ఏర్పడ్డాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటాను లెక్కించాలి. గ్రూప్–1 సర్వీస్ ఉద్యోగాల్లో 50 శాతం, గ్రూప్–2లో 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కింద భర్తీ చేయాలి. కానీ, కొందరు ఉన్నతాధికారులు అడ్‌హాక్ ప్రమోషన్ల పేరు మీద ఈ కోటాను కూడా కొట్టేస్తున్నారు.

అడ్‌హాక్‌‌‌‌ పేరుతో ప్రమోషన్లు

డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాలను పూర్తి స్థాయిలో లెక్కించి, భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపడం లేదు. ఇప్పటికే అన్ని శాఖల్లో అడ్‌హాక్ ప్రమోషన్ల పేరు మీద ఎన్నో పోస్టులను అక్రమంగా భర్తీ చేశారు. చాలా శాఖల్లో డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కిందకు వచ్చే పోస్టులను కూడా ప్రమోషన్లతో భర్తీ చేశారు. కొందరు ఉన్నతాధికారులు డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా పోస్టులను లెక్కించడంలో సరిగ్గా వ్యవహరించడం లేదు. ఏదో నామమాత్రంగా ఖాళీలను లెక్కించి ప్రతిపాదనలు పంపుతున్నారు. మరోవైపు పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో ఉద్యోగులు లేక ప్రభుత్వ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. ప్రజల పనులు కూడా సక్రమంగా జరగడం లేదు. నలుగురు సిబ్బంది ఉండాల్సిన చోట ఒకరితోనే పని సాగుతోంది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడంతో గ్రూప్–1, గ్రూప్–2 సర్వీస్ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అలాగే క్లర్కులు, సూపరింటెండెంట్లు తదితర 40 వేల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు దెబ్బతింటోంది.

పదేండ్లుగా గ్రూప్– 1 నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వలే

గ్రూపు–1 సర్వీస్ ఉద్యోగాల్లో డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కింద 50 శాతం ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గత పదేండ్లుగా ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రూప్‌‌‌‌ 1 కేటగిరీలోని 18 సర్వీసుల్లో డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోటా కింద దాదాపు 1,600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్స్, డీఎస్పీ(పోలీస్), వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, రిజిస్ట్రార్, జిల్లా పంచాయత్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ వెల్ఫేర్‌‌‌‌ ఆఫీసర్స్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితర 18 కేటగిరీల పోస్టులు ఉన్నవి. పదేండ్లుగా గ్రూప్–1 ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్ పోస్టుల కొరత పెరిగింది. ఒక్కో ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్ మూడు నుంచి నాలుగు పోస్టులను ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లుగా నడుపుతున్నారు. దీని వల్ల పాలనా సామర్థ్యం కూడా దెబ్బతింటోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఇప్పటికే రెండుసార్లు గ్రూప్‌‌‌‌ 1 నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయగా, కర్నాటకలో ఏటా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం గ్రూప్‌‌‌‌ –1 నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్–1 నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లి రాత్రింబవళ్లు చదువుతూ ప్రిపేర్ అవుతున్నారు. కొంత మంది అయితే ఇప్పటికే ఏజ్‌‌‌‌ లిమిట్‌‌‌‌ దాటిపోయారు.

గ్రూప్‌‌‌‌-2లో 4 వేలకుపైగా ఖాళీలు

గ్రూప్–2 సర్వీస్‌‌‌‌కు సంబంధించి 14  ప్రభుత్వ శాఖల్లో 30 శాతం నుంచి 40 శాతం పోస్టుల లెక్కన డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ కోటా కింద 4 వేల వరకూ ఖాళీలు ఉంటాయని అధికార వర్గాల అంచనా. ముఖ్యంగా డిప్యూటీ తహసిల్దార్లు, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, ఎక్సైజ్‌‌‌‌ ఎస్ఐ, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్, రెవెన్యూ సబ్–రిజిస్ట్రార్, అసిస్టెంట్ సోషల్ వెల్‌‌‌‌ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీసీ వెల్‌‌‌‌ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్‌‌‌‌ఫేర్‌‌‌‌ ఆఫీసర్స్ తదితర 14 శాఖల పోస్టులు ఇందులోకి వస్తాయి. కొత్త జిల్లాలు, కొత్త మండలాల ఏర్పాటులో ఈ పోస్టులే ఎక్కువ క్రియేట్‌‌‌‌ అయ్యాయి. రిటైర్‌‌‌‌మెంట్, ప్రమోషన్ల వల్ల కూడా ఎక్కువ పోస్టులు వచ్చాయి.

కొత్త తరానికి చాన్స్‌‌‌‌ ఇవ్వాలి

కొత్త తరాన్ని, యువతరాన్ని డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకొస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన ప్రజలకు అందుతుంది. యువత శక్తియుక్తులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి. యువత పాలనా రంగంలోకి ప్రవేశిస్తే ఉత్సాహంతో, ఉరుకులు–పరుగులతో అంకితభావంతో పని చేస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్‌‌‌‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేసి యువతరానికి పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. అందువల్ల వెంటనే డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ పోస్టులను భర్తీ చేసి.. ప్రజలను ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకోవాలి.

గ్రూప్‌‌‌‌–3, గ్రూప్‌‌‌‌–4ను కూడా పట్టించుకోలే

గ్రూప్​-3 సర్వీస్‌‌‌‌లో 2 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకంగా సెక్రటేరియట్, ప్రభుత్వ డైరెక్టరేట్స్, ఇతర శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. అలాగే గ్రూప్​-4 సర్వీస్‌‌‌‌లో 40 వేల జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టులు ప్రభుత్వాన్ని నడపడంలో కీలకమైనవి. ప్రతి ఫైల్‌‌‌‌ జూనియర్ అసిస్టెంట్ ద్వారానే క్రియేట్‌‌‌‌ అవుతుంది. ఇట్లాంటి కీలకమైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడింది. జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 25 ఏండ్లుగా డైరెక్టు రిక్రూట్‌‌‌‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయడం లేదు.  సచివాలయం, డైరెక్టరేట్లలోని క్లరికల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. జిల్లా ఆఫీసుల పోస్టులు, తాలుకా ఆఫీసుల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడ్డది. అటెండర్లు, తల్లిదండ్రులు చనిపోయిన వారి స్థానాల్లో తప్ప కొత్త వారిని గ్రూప్-4 సర్వీస్‌‌‌‌ కింద రిక్రూట్ చేయడం లేదు. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలి.-ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం.

ఇవి కూడా చదవండి

పెద్ద మనసుతో మనసులు గెలిచారు

విదేశాల ​వైపు సంపన్నుల పరుగు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌