
- రాళ్లు రువ్వి.. కత్తులతో వెంటాడి..
- ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ దాడి
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఇస్సాపల్లిలో ఘటన
- కాన్వాయ్‌లో ఏడు కార్లు ధ్వంసం
- ఎంపీ పీఏ, కార్యకర్తలకు గాయాలు
- టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తారని, ముందే రక్షణ కోరిన అర్వింద్
- ‘రైతులు మేం చెప్తున్నా వినడం లేదు’ అంటూ సమాధానమిచ్చిన పోలీసులు
- పోలీసుల తీరుకు నిరసనగా అర్వింద్ ధర్నా.. తర్వాత కొద్దిసేపటికే దాడులు
- గవర్నర్, లోకసభ స్పీకర్, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ
నిజామాబాద్, ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటనలో టీఆర్ఎస్ లీడర్లు వీరంగం సృష్టించారు. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకుని దాడులకు దిగారు. బీజేపీ కార్యకర్తలను వెంటాడి కత్తులు, రాడ్లతో అటాక్ చేశారు. కార్లపై రాళ్లు రువ్వారు. అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆర్మూరు నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడి వెనుక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ పెద్దలీడర్ల ప్రమేయం ఉందని, తనపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర గవర్నర్, లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీలకు ఫిర్యాదులు చేస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.
రక్షణ కల్పించాలని కోరితే.. పోలీసులు సహకరించలే
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలోని గ్రామాల్లో ఎంపీ ఫండ్స్‌తో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అర్వింద్ మంగళవారం ఉదయాన్నే బయల్దేరారు. ఆర్మూరు నుంచి నందిపేట వెళ్లే రూట్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని దారిపొడవునా కాపుకాశారు. దీంతో తన పర్యటన సజావుగా సాగేందుకు రోడ్ల పక్కన ఉన్న వాళ్లను క్లియర్ చేయాలని నిజామాబాద్ సీపీ, ఆర్మూర్ఏసీపీలను అర్వింద్ కోరారు. దారిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కత్తులు, కట్టెలు పట్టుకుని ఉన్నారని, రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి, టైర్లు కాలపెడుతున్నారనే సమాచారం ఉందని చెప్పారు. తమపై దాడి చేసేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. రోడ్ల మీదకొచ్చిన రైతులను వెళ్లిపోవాలని తాము చెప్తున్నా వినడం లేదని చెప్పి పోలీసులు చేతులుదులుపుకున్నారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా ఆర్మూర్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో అర్వింద్, బీజేపీ కార్యకర్తలుగంటన్నరపాటు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు టీఆర్ఎస్ లీడర్లు కలిసే కుట్ర చేస్తున్నారని, అభివృద్ధి పనులను ప్రారంభించకుండా అడ్డుకుంటున్నారని అర్వింద్ ఆరోపించారు. తర్వాత అక్కడి నుంచి ఆయన నందిపేటకు బయల్దేరారు. ఇస్సాపల్లి గ్రామానికి చేరుకోగానే పోలీసులు మళ్లీ ఎంపీ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. గొడవలు జరగకుండా జనాలను క్లియర్ చేస్తే.. ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని వెళ్తామని పోలీసులను అర్వింద్ కోరారు. అందుకు అనుమతివ్వని పోలీసులు.. లా అండ్ ఆర్డర్‌కు సహకరించాలని చెప్పడంతో బీజేపీ కార్యకర్తలను సముదాయించి ఆర్మూరుకు అర్వింద్ పయనమయ్యారు.
ఆరు కార్లు ధ్వంసమయ్యాయి..
ఆర్మూర్‌కు తిరిగి వెళుతున్న క్రమంలో ఆందోళనకారులు ఒక్కసారిగా ఎంపీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. కత్తులు, ఇతర ఆయుధాలతో విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలు భయంతో పరుగులు పెట్టగా.. తరుముకుంటూ వెళ్లి దాడి చేశారు. రాళ్లు విసరగా.. ఎంపీ కారుతోపాటు బీజేపీ లీడర్లకు చెందిన మరో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. అధికార పార్టీ లీడర్ల దాడిలో బీజేపీ కార్యకర్తలు విజయ్, అరుట్ల రమేశ్, చిన్నయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ పీఏ నారాయణకు స్పల్వ గాయాలయ్యాయి.
జీవన్‌రెడ్డిని 50 వేల మెజారిటీతో ఓడిస్త
బీజేపీ ఎదుగుదలను ఓర్వలేని టీఆర్ఎస్ సర్కారు.. తమ పార్టీ ఎంపీలను, ప్రజాప్రతినిధులను మర్డర్ చేసేందుకు కుట్రపన్నుతోందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. టీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొంటానని, వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఓడించకపోతే తన పేరు అర్వింద్ ధర్మపురి కాదని చాలెంజ్ విసిరారు. కనీసం 50 వేల మెజారిటీతో ఓడిస్తానన్నారు.
నా హత్యకు సర్కార్ కుట్ర: అర్వింద్
తన హత్యకు రాష్ట్ర సర్కారు కుట్ర పన్నిందని, పోలీసులు దగ్గరుండి మరీ టీఆర్ఎస్గూండాలతో తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజుపై మర్డర్‌కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడులపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన ఎంపీ.. అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు. రైతు కండువాలు ధరించిన టీఆర్ఎస్ కార్యకర్తలతో తనపై, తన అనుచరులపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని ఆరోపించారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో చాలా మంది కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టిన 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాడ్లు, కత్తులతో దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు. తన కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌వాళ్లు అడ్డుకుంటారని ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని, తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చినా ఒక్క అధికారి కూడా సీపీ కార్యాలయంలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్.. నువ్వు సీఎంవా? గూండావా?
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
నల్గొండ, వెలుగు: ‘‘ఎంపీ అర్వింద్ తన నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు వెళితే టీఆర్ఎస్ గూండాలు, పోలీసులు కలిసి దాడి చేసిన్రు. సీఎం కేసీఆర్ నువ్వు సీఎం పనిచేస్తున్నావా ? గూండా పనిచేస్తున్నావా ?” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ఏమైనా.. నీ ఫామ్ హౌస్ కు వచ్చిండా? ప్రగతి భవన్ కు వచ్చిండా? అని సీఎంను ప్రశ్నించారు. ‘‘టీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్‌గా తాగొచ్చి సీసాలు, కర్రలతో ఎంపీ పై దాడికి దిగారు, మా ఎంపీ సీపీకి కాల్ చేస్తే ఆయన ఎత్తలేదు. ఈ రాష్ట్ర డీజీపీ ఎప్పుడూ ఫోన్ ఎత్తడు, అసలు ఆయన ఉన్నాడా? లేడా? తెలియడం లేదు’’ అని సంజయ్ మండిపడ్డారు.