వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు

వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు
  • రాజకీయాల కోసం రైతులను పణంగా పెడతారా..?
  • 52వ రోజు షర్మిల పాదయాత్ర.. బయ్యారంలో మాటా మంతీ

ఖమ్మం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 52వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఖమ్మం జిల్లా బయ్యారంలో రైతులకు మద్దతుగా నిరసన దీక్ష నిర్వహించి మాటా మంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసిన రైతులకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎవర్నడిగి కేంద్రానికి సంతకం చేశారని కేసీఆర్ ని ప్రశ్నించారు. రాజకీయాల కోసం రైతుల్ని పణంగా పెడతారా...అని మండిపడ్డారు వైఎస్ షర్మిల. రైతుల రక్తం తాగుతున్న టీఆర్ఎస్, బీజేపీ.. రాబంధుల్లా మారి ధర్నాల పోటీ పెట్టుకున్నారని విమర్శించారు. 
ప్రజలకు సమస్యలే లేవు అంటున్నారు నిజమేనా..? ప్రజలతో  షర్మిల
ప్రజలకు సమస్యలే లేవు... పథకాలన్నీ అద్భుతంగా అమలవుతున్నాయని సీఎం కేసీఆర్ చెబుతుండు.. నిజమేనా..? మీరు గొంతు విప్పి చెప్పండి అని వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్నాడు.. కుర్చీ వేసుకుని కూర్చుని పరిష్కరిస్తానని చెప్పాడు.. పరిష్కారం అయ్యాయా.. ? రేవు దాటే వరకే ఓడ మల్లన్న.. రేవు దాటాక బోడి మల్లన్న అనే రీతిలో ఓట్లేయించుకుని కేసీఆర్ మరచిపోయాడని షర్మిల విమర్శించారు. కేసీఆర్ కేంద్రంలో బీజేపీతో డ్యూయెట్లు పాడి.. ఇప్పుడేమో హడావుడి చేస్తున్నారని అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే వేల మందికి ఉద్యోగాలొచ్చేవని.. రాష్ట్ర విభజన సమయంలోనే ఇచ్చిన హామీ అని షర్మిల గుర్తు చేశారు. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనేది ఉద్దేశం అన్నారు. అయితే సీఎం కేసీఆర్ సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత బయ్యారం ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని ఏ ఒక్కరోజు ప్రశ్నించలేదన్నారు. ప్రజలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఫుడింగ్ పబ్ కేసులో నిందితులకు పోలీసు కస్టడీ

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు