బండి సంజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసేయండి

బండి సంజయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసేయండి
  • బీజేపీ ఎంపీ సంజయ్ కామెంట్లపై టీఆర్ఎస్ ఎంపీలు
  • నామా నేతృత్వంలో స్పీకర్ ను కలిసి ఫిర్యాదు
  • రాష్ట్ర అంశాల ప్రస్తావించేందుకు అసెంబ్లీలున్నాయని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని, అందువల్ల పలువురు ఎంపీలు సభలో లేవనెత్తిన రాష్ట్ర అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని టీఆర్ఎస్​ ఎంపీలు లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్‌ బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అంశాలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీలు గందరగోళం సృష్టిస్తున్నారని వారు స్పీకర్ కు​ఫిర్యాదు చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపీలు పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో స్పీకర్‌ను కలిశారు. ఇంటర్​ స్టూడెంట్ల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉద్దేశపూర్వకంగానే సభలో లేవనెత్తి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలోనే చర్చించాలిః నామా

సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం సరికాదని.. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు అసెంబ్లీలో, లోక్ సభలో ప్రస్తావించాల్సిన అంశాలు లోక్​సభలో లేవనెత్తాలని టీఆర్ఎస్​ లోక్​సభ పక్ష నేత నామా నాగేశ్వర్​రావు సూచించారు. గురువారం పార్లమెంట్​ ఆవరణలో టీఆర్​ఎస్​ ఎంపీలతో కలిసి నామా మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలు అనవసరంగా స్టూడెంట్ల ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర సమస్యలుంటే అసెంబ్లీలో చర్చించాలని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి లోక్​సభలో చర్చించాలి తప్పా.. మిగతా విషయాలపై కాదని, సభలో రాజకీయాలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు, తాగు నీటి అభివృద్ధి జరుగుతోందని నామా చెప్పారు.

పాస్​పోర్ట్​ కేంద్రం కావాలి: ఎంపీ లింగయ్య

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం, కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రం లేకపోవడంతో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. గురువారం రాజ్యసభ జీరోఅవర్ లో రాష్ట్ర సమస్యలను ఆయన ప్రస్తావించారు. కేంద్రీయ విద్యాలయాల చట్టం ప్రకారం జిల్లాకు ఒక కేవీ ఉండాలని, రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లు గడిచినా వాటిని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నేషనల్​ హైవే 65కు పక్కనే ఉన్న సర్వీసు రోడ్ల మరమత్తులు చేయడం లేదని, అండర్ పాస్ లు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారని చెప్పారు.