సంగారెడ్డిలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల నయాదందా

సంగారెడ్డిలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల నయాదందా
  • పర్మిషన్ ఉంటే ఒక రేటు.. లేకపోతే మరో రేటు
  • ఇవ్వకపోతే వాళ్లే కంప్లైంట్ ఇస్తారు.. మళ్లీ వాళ్లే 
  • సెటిల్మెంట్ చేస్తారు..  అధికార పార్టీ సర్పంచ్​తోనే బేరాసారాలు.. 
  • వైరల్​గా మారిన ఆడియో     కౌన్సిలర్ల తీరుపై పార్టీ హై కమాండ్ నజర్

సంగారెడ్డి, వెలుగు:  జిల్లాలో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డిలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగ డాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. సంగారెడ్డిలో సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి మున్సిపల్ పర్మిషన్ ఉంటే ఒక లెక్క.. లేకుంటే మరో లెక్క అన్నట్టుగా కొందరు కౌన్సిలర్లు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే కొత్త ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపడుతున్నారో అక్కడ కౌన్సిలర్ల వసూల్ టీం ప్రత్యక్షమవుతోంది. అనుమతులు న్నా సెట్ బ్యాక్ వదలలేదని, సెల్లార్ కు అనుమతి లేదని, ఇలా ఏదో ఒక తప్పు తీసి ఓనర్లను బెదిరిస్తూ లక్షలు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. డబ్బులు ఇవ్వకపోతే కౌన్సిలర్లే అధికారులకు ఫి ర్యాదు చేసి కూల్చి వేయిస్తూ ఆపై సెటిల్మెంట్లకు దిగుతున్నట్టు కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. 

చిన్న తప్పుకు రూ.5 లక్షలు

మున్సిపల్ పరిధిలోని ఒక కాలనీలో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి రూ.30 లక్షలు లోన్ తీసుకుని ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. అన్ని డాక్యుమెంట్లతో టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని మున్సిపాలిటీకి రూ.1.20 లక్షల ఫీజు చెల్లించి 90 శాతానికి పైగా ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. అతడిని టీ ఆర్ఎస్ వసూల్ బ్యాచ్ సెట్​బ్యాక్​  విష యంలో చిన్న తప్పును చూపిస్తూ 
రూ. 5 లక్షలు డిమాండ్ చేసింది. అందుకు ఆ ఇంటి యజమాని ఒప్పు కోలేదు. డబ్బులు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో మున్సిపల్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసి తనను ఇబ్బందికి గురి చేస్తు న్నారని  బాధితుడు మొర పెట్టకున్నాడు.

బేరసారాల ఆడియో వైరల్​

మునిపల్లి మండల పరిధిలోని ఓ టీఆర్ఎస్ సర్పంచ్ తో సొంత పార్టీ కౌన్సిలర్లు బేరసారాలు చేస్తున్న ఓ ఆడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. సర్పంచ్ సంగారెడ్డి లో  ఇల్లు కట్టుకుంటుండగా డబ్బులు ఇవ్వాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆ ఆడియో ఉంది. తాను కూడా టీఆర్ఎస్ సర్పంచ్ అని, తనను ఇబ్బంది పెట్టొద్దని ఆ సర్పంచ్​ వేడుకుంటున్నట్లుగా ఉంది. పైగా మంత్రి హరీశ్​రావు తో దిగిన ఫొటో ఈ సంభాషణలో చర్చకు రాగా మంత్రితో ఫొటో దిగితే ఊరుకుంటామా? అనే మాటలు ఆడియోలో వినిపించడంతో పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తాము 12 మంది కౌన్సిలర్లం ఉన్నామని, వచ్చి కచ్చితంగా సెటిల్మెంట్ చేసుకోవాలని ఆ  ఆడియోలో ఓ కౌన్సిలర్ భర్త వాయిస్​ ఉంది. 

రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు

సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కొన్ని కాలనీల్లో ఈ కౌన్సిలర్ల టీమ్​ వసూళ్ల దందా కొనసాగిస్తోంది. పర్మిషన్ ఉన్న ఇండ్లకు రూ.20 వేల నుంచి రూ 30 వేల వరకు, పర్మిషన్ లేని కమర్షియల్ బిల్డింగులకు రూ. 50 వేల నుంచి రూ.2 లక్షలు, సెట్ బ్యాక్ వదలకపోతే రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇండ్లకు తామే పర్మిషన్లు ఇప్పిస్తామని చెప్పి మున్సిపాలిటీ ఫీజుతో పాటు అదనపు ఖర్చులు కలుపుకొని మొత్తం రూ.25 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే సెల్లార్లకు భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.