బాబుపై కోపంతో టీఆర్ఎస్.. మోడీపై గుస్సాతో బీఆర్ఎస్

బాబుపై కోపంతో టీఆర్ఎస్.. మోడీపై గుస్సాతో బీఆర్ఎస్

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఎండ్ కార్డు పడింది. ఇరవై ఒక్క ఏండ్ల రాజకీయ ప్రయాణాన్ని ముగించి.. బీఆర్ఎస్‌‌గా మారింది. నేషనల్ రూట్‌‌లో జర్నీని షురూ చేసింది. నాడు ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కోపంతో టీఆర్ఎస్‌‌ను ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని మోడీపై కోపంతో దాన్ని బీఆర్ఎస్‌‌గా మార్చారు. 

మంత్రి పదవి ఇవ్వలేదని..

1999 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి 27 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. కేసీఆర్ మంత్రి పదవి ఆశించగా.. చంద్రబాబు ఇవ్వలేదు. కేసీఆర్‌‌‌‌ను డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా నియమించారు. చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం కేసీఆర్ కోపానికి కారణమైంది. 1999లో కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్​బాగ్‌‌లో నిరసనలు చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. నాడు డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఉన్న కేసీఆర్.. సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు, కాల్పుల ఘటనపై బహిరంగ లేఖ రాశారు. తర్వాత 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంతపురి రఘువీర రావు, మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన ప్రొఫెసర్ జయశంకర్ వంటి తెలంగాణవాదులు, ఉద్యమకారులు కేసీఆర్‌‌‌‌తో 2000 సంవత్సరంలో చర్చలు జరిపారు. పార్టీ ఆఫీసుకు జలదృశ్యాన్ని కొండా లక్ష్మణ్​ బాపూజీ ఇచ్చేశారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఏర్పాటైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ మ్యాప్‌‌తో గులాబీ జెండాను రూపొందించారు. పార్టీ ఏర్పాటైన 9 రోజుల్లోనే 19 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. 2001 మే 17న కరీంనగర్‌‌‌‌లో నిర్వహించిన సింహగర్జన సభకు జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు శిబూ సొరెన్ హాజరయ్యారు.

తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ

తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. 2001 జులైలో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కేసీఆర్ తమ అభ్యర్థులను బరిలోకి నిలిపారు. కంకి నాగలి గుర్తు మీద పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 87 జెడ్పీటీసీ, 100కుపైగా ఎంపీటీసీ స్థానాలను గెలిచింది. అదే ఏడాది ఆగస్టులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించింది. 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్‌‌కు రాజకీయ పార్టీ హోదా వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలిచారు. తర్వాత పార్టీ ఆఫీసు హైదరాబాద్ నంది నగర్‌‌‌‌లోని కేసీఆర్ ఇంటికి మారింది. ఆరు నెలలకు మాజీ మంత్రి వేదాంతరావు ఇంట్లోకి ఆఫీసును షిఫ్ట్​ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్​తో జట్టు కట్టి పోటీ చేసింది టీఆర్ఎస్. బంజారాహిల్స్ రోడ్ నం.12లో టీఆర్ఎస్ ఆఫీసుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థలాన్ని కేటాయించారు. 2006లో తెలంగాణ భవన్​ను ప్రారంభించారు.

సొంత రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా..

తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచీ వైఎస్ వ్యతిరేకంగా ఉండేవారు. దీంతో ఆయన విధానాలు నచ్చని కేసీఆర్.. కాంగ్రెస్‌‌తో పొత్తును విరమించుకున్నారు. 2009లో టీడీపీతో జట్టు కట్టారు. వామపక్షాలు, టీడీపీ, టీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది కేవలం 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లే. 2009లో జరిగిన పలు పరిణామాలతో తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటన చేసింది. తర్వాత నాలుగేండ్లకు తెలంగాణ కల సాకారమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారుల బలిదానాలతో 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది. నాటి ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచి సొంత రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. టర్మ్​ పూర్తి కాకముందే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. 2018 డిసెంబర్‌‌‌‌లో జరిగిన ఎన్నికల్లో 87 స్థానాల్లో గెలిచింది.

జాతీయ రాగం

2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటనలు గుప్పించారు. ఎప్పుడూ లేనంతగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టడం, అడుగడుగునా టీఆర్ఎస్​కు గట్టిపోటీనిస్తూ ప్రత్యామ్నాయంగా మారడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులు విమర్శల తీవ్రతను పెంచారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతునిచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ నుంచే అడుగు పడుతుందని ప్రకటించారు. ఈ ఏడాది దసరా నాడు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్​గా మారుస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు ఈసీకి లెటర్ అందజేశారు. తాజాగా పార్టీ పేరుకు అంగీకారం తెలుపుతూ గురువారం (డిసెంబర్ 8)న ఈసీ లేఖ రాసింది. దానికి శుక్రవారం కేసీఆర్ అంగీకారం తెలుపుతూ సంతకం చేసి ఈసీకి పంపించారు. దాంతో టీఆర్ఎస్ కథ కంచికి చేరి.. బీఆర్ఎస్ కథ మొదలైంది.