అందని బ్యాంకు రుణాలు

అందని బ్యాంకు రుణాలు

తెలంగాణ వ్యవసాయం ఒక గందరగోళ దశలో కొనసాగుతున్నది. జాతీయ రాజకీయాల సన్నాహాల్లో ఉన్న కేసీఆర్ రాష్ట్ర పాలనను, ముఖ్యంగా వ్యవసాయాన్ని గాలికొదిలేశారు. ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను ఆహ్వానించిన ఆయన.. ఇక్కడ రైతులకు చాలా మేలు జరుగుతున్నట్లు, ఇక్కడి పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. రైతు బంధు పైసలు పంచుడు తప్ప, ఇతర ఏ విషయంలోనూ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో ఒక ప్రణాళిక అంటూ లేదు. రైతు బంధు కూడా కౌలు, పోడు చేసే వాస్తవ సాగు దారులకు కాకుండా, వ్యవసాయం చేయని రైతులకు, భూములకూ ఇస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నరు. ఉద్యాన పంటల్లో కూరగాయల సాగుకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆయిల్ పామ్ పంట గురించి ప్రచారం చేస్తున్నరు.  

పంటల ప్రణాళిక ఉత్తదే..

గత మూడేండ్ల చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర రైతులు కూడా పంటల ప్రణాళిక విషయంలో ప్రభుత్వం మాట వినే స్థితిలో లేరని, ఈసారి సాగైన పంటల విస్తీర్ణం స్పష్టం చేస్తున్నది. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 50 లక్షల ఎకరాల్లో వరి,15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి రైతులకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అనేక జిల్లాల్లో రైతులతో, అధికారులతో సమావేశాలు జరిపి పంటల ప్రణాళిక అవసరాన్ని వివరించారు. అయితే రైతులు తమకు తోచినట్లుగా పంటలు వేసుకున్నారు. 2021 సెప్టెంబర్14 నాటికి రైతులు 50,95,678 ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులు ఈ సారి ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా కేవలం 49,79,225 ఎకరాలకు పరిమితం అయ్యారు. మూడేండ్లుగా భారీ వర్షాల వల్ల దిగుబడులు పడిపోయి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవడమే దీనికి కారణం. వరి విషయానికి వస్తే 2021లో 52,09,639 ఎకరాల్లో వరి పెట్టిన రైతులు ఈసారి 63,82,345 ఎకరాల్లో సాగు చేశారు. వరి వేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిరుడు ప్రచారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీజన్ చివరిలో కనీస మద్దతు ధరకు వడ్లు కొన్నది. అదే సమయంలో ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులను అసలు పట్టించుకోలేదు. ప్రభుత్వం మాట విని వరి మానేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకే ఈ సారి ప్రభుత్వం మాట వినకుండా తిరిగి వరి సాగు వైపు మళ్లారు. 2021లో 42,558 ఎకరాల్లో మినుము సాగు చేసిన రైతులు ఈసారి కేవలం 29,293 ఎకరాలకే పరిమితమయ్యారు. నిరుడు1,39,355 ఎకరాల్లో పెసర వేసిన రైతులు ఈసారి 66,838 ఎకరాల్లోనే సాగు చేశారు. నిరుడు  ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసిన రైతులను ప్రభుత్వం పట్టించుకుని ఉంటే, ఈసారి ఆయా పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగి ఉండేది. 

అమలు కాని పంటల బీమా

2020 వానాకాలం నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు కావడం లేదు. భారీ వర్షాలు, వడగండ్లు, వరదలతో రైతులు పంటలు నష్ట పోతూనే ఉన్నారు. కానీ వారికి ఒక్క పైసా కూడా బీమా పరిహారం అందుతలేదు.  పైగా నష్ట పోయిన సందర్భంలో ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఇన్​పుట్ సబ్సిడీ కూడా దక్కుత లేదు. 2020 ఖరీఫ్ లో భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ  రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర  హైకోర్టు 2021 సెప్టెంబర్ 28న తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోపు నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించి జనవరి 28 లోపు పరిహారం చెల్లించాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా అందజేయాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా, సుప్రీంకు వెళ్లింది. రెండేండ్లుగా ఏ సీజన్ లోనూ నష్ట పోయిన రైతుల వివరాలను సేకరించలేదు. పరిహారం చెల్లించలేదు. మూడేండ్లుగా ఏటా ఎత్తిపోతల రిజర్వాయర్ల తప్పుడు డిజైన్లతో పంట పొలాలు మునిగి నష్టపోతున్న రైతుల గురించి కూడా ప్రభుత్వం అసలు మాట్లాడుత లేదు. ఈ సీజన్ లో కూడా రైతులు అతి భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయారు. అయినా ఇంత వరకు బాధిత రైతుల వివరాలు ప్రభుత్వం సేకరించలేదు. అసలు ఎక్కడా దాని ఊసే లేదు. ఏడాది క్రితం రాష్ట్ర మిరప రైతులు తీవ్రంగా నష్ట పోయిన సందర్భంలో హడావుడి చేయడం తప్ప, ఆ రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం 
ఇయ్యలేదు.   

అందని బ్యాంకు రుణాలు

ఎన్నికల ముందు ఇచ్చిన రుణ మాఫీ హామీలను టీఆర్ఎస్​ సర్కారు సక్కగా అమలు చేస్తలేదు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీని ఐదు విడుతలుగా అమలు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగలేదు సరి కదా, మొత్తం సంస్థాగత రుణ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. పెండింగ్ బకాయిలు ఉన్నాయనే కారణంగా బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇస్తలేవు. పైగా జీరో శాతం వడ్డీ రాయితీ పథకం కూడా రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రాయితీ బకాయిలను రాష్ట్ర సర్కారు బ్యాంకులకు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 2018-–2022 మధ్య కూడా ప్రభుత్వం రెండోసారి ఇచ్చిన రుణ మాఫీ హామీ అమలుకూ దిక్కు లేదు. అందుకే రైతుల పేరిట బ్యాంకుల్లో బకాయిలు పేరుకు పోతున్నాయి. పంట సాగు పెట్టుబడి కోసం రైతులకు వానాకాలం పంట రుణాలు అందడం అత్యంత కీలకం. సర్కారు ఇచ్చే రైతు బంధు పెట్టుబడికి ఏ మూలకూ సరిపోదు. పత్తి, వరి లాంటి పంటల సాగుకు ఎకరానికి 35,000 వరకు పెట్టుబడి కావాలి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఇచ్చే రుణాలు కీలకం. 2020 ఖరీఫ్ లో  58,02,000 మంది రైతులకు ప్రభుత్వం రైతు బంధు ఇస్తే, బ్యాంకులు కేవలం17,35,999 ఖాతాలకు పంట రుణాలు అందించాయి. 2021 ఖరీఫ్ లో ప్రభుత్వం 60,84,000 మంది రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయం అందిస్తే, బ్యాంకులు 15,46,804 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు ఇచ్చాయి. 2022 ఖరీఫ్ రుణ పంపిణీ కూడా ఇందుకు భిన్నంగా ఉండక పోవచ్చు. పైగా నిజంగా వాటిలో ఎన్ని కొత్తగా పంట రుణంగా అందించాయి, ఎన్ని కేవలం బుక్ అడ్జస్ట్ మెంట్ చేశాయన్నది చిదంబర రహస్యమే! 

కొనుగోళ్లకు ఏర్పాట్లేవి? 

రెండేండ్లుగా ప్రతి సీజన్ లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. పంట చేతికొచ్చే సమయానికి ప్రభుత్వం కేంద్రాలను తెరవకుండా, కనీసం ఒక నెల ఆలస్యం చేస్తున్నది. ఈ లోపు రైతులు పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. బార్​దాన్, హమాలీల కొరత, ట్రాన్స్ పోర్ట్ వాహనాల కొరత ప్రతి సీజన్ లో తప్పడం లేదు. పంట తడిస్తే ఆరబెట్టుకోవడానికి గిడ్డంగులు లేవు. రైస్ మిల్లర్లు ఇదే అదనుగా నాణ్యత పేరుతో ధాన్యంలో కోత పెడుతున్నారు. మరో15 రోజుల్లో పంటలు కోతకు వస్తాయి. ఎఫ్‌‌సీ‌‌ఐ ఈ సీజన్ లో 50 లక్షల టన్నుల బియ్యం(70 లక్షల టన్నుల వడ్లు) సేకరిస్తామని ఇప్పటికే చెప్పింది. ఈ సీజన్ లో వరి సాగు విస్తీర్ణాన్ని బట్టి రాష్ట్రంలో సుమారు కోటీ 30 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం సేకరించే ధాన్యానికి రెట్టింపు అన్నమాట. మరి ఇంత ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు సరిగా చేయకపోతే ఈ సీజన్ లో కూడా రైతులు నష్ట పోయే ప్రమాదం ఉంది. 

- కన్నెగంటి రవి, 
రైతు స్వరాజ్య వేదిక