మునుగోడులో 30 స్కీముల కింద 1.50 లక్షల మంది

మునుగోడులో 30 స్కీముల కింద 1.50 లక్షల మంది
  • లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్
  • గ్రామాలవారీగా లబ్ధిదారుల వివరాలు సేకరణ 
  • 30 స్కీముల కింద లక్షా 50 వేల మంది ఉంటారని అంచనా
  • లెటర్లు, మెసేజ్​ల ద్వారా ఇంటింటికీ కేసీఆర్ ​సందేశం పంపించాలనే ఆలోచన

నల్గొండ, వెలుగు:  మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు రూలింగ్​ పార్టీ మరోసారి  సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకుంటోంది. నియోజకవర్గంలోని సగం మంది ఓటర్లు.. పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి..ఇలా ఏదో రూపంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినవారేనని, వాళ్లంతా తమవైపే మొగ్గుచూపుతారని భావిస్తోంది. కానీ దుబ్బాక, హుజూరాబాద్ ​ఉప ఎన్నికల టైంలోనూ టీఆర్ఎస్ ​హైకమాండ్​ ఇలాంటి అంచనాలే వేసినప్పటికీ బెడిసికొట్టాయి. హుజూరాబాద్​ నియోజకవర్గాన్ని పైలట్ ​ప్రాజెక్టుగా తీసుకొని ఇంటింటికీ  దళితబంధు ప్రకటించి, అమలుచేసినా అనుకున్న ఫలితం రాలేదు. దీంతో ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని టీఆర్ఎస్​ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా డిపార్ట్​మెంట్ల వారీగా ఊరూరా లబ్ధిదారుల లెక్కలు తీయిస్తున్నారు. అందరి అడ్రస్​లూ తీసుకొని సీఎం కేసీఆర్​ పేరుమీద ముద్రించిన లెటర్లను స్వయంగా పోస్ట్​చేసేలా, ఫోన్లకు, వాట్సప్​లకు మెసేజ్​లు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఫైళ్ల దుమ్ము దులుపుతున్నరు.. 

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సగానికి పైగా అంటే సుమారు లక్షన్నర మంది ఓటర్లు ఏదో ఒక ప్రభుత్వ స్కీం కింద లబ్ధి పొందుతున్నారని టీఆర్ఎస్​ హైకమాండ్​ భావిస్తోంది. ఆయా  లబ్ధిదారులను తమ ఓట్లుగా మలుచుకోవడంలో దుబ్బాక, హుజూరాబాద్​లో విఫలమయ్యామని, ఈసారి అలా జరగకూడదని ముందే అలర్ట్​అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పై ఆఫీసర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు, మూడు రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల పూర్తి వివరాలు బయటికి తీయిస్తోంది. మొత్తంగా ఆరు మండలాల పరిధిలోని 157 గ్రామాల్లోని లబ్ధిదారుల వివరాలను డిపార్ట్​మెంట్ల వారీగా సేకరిస్తున్నారు.  సెలవు దినాలైనప్పటికీ  శని, ఆదివారాల్లోనూ అక్కడి ఆఫీసర్లు, సిబ్బందికి సెలవులు క్యాన్సిల్​ చేశారు.

రైతుబంధు మొదలు బతుకమ్మ చీరల దాకా.. 

రైతుబంధు మొదలుకొని బతుకమ్మ చీరల వరకు సుమారు 30 రకాల స్కీంల కింద లబ్ధిపొందిన వాళ్ల వివరాలు వేర్వేరుగా కావాలని తమ పై ఆఫీసర్లు అడిగినట్లు మునుగోడు మండలంలోని ఓ విలేజ్​ సెక్రెటరీ చెప్పారు. ఇందులో రైతుబంధు, రైతుబీమా మొదలుకొని  కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు,  గొర్రెల పంపిణీ, అన్ని రకాల పింఛన్లు, కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల దాకా అన్నీ ఉన్నట్లు ఆయన వివరించారు. గ్రామాలవారీగా వచ్చిన ఈ సమాచారాన్ని ముందుగా ఆయా డిపార్ట్​మెంట్లు, అక్కడి నుంచి  క్రోడీకరించే బాధ్యతను జిల్లా ప్లానింగ్ విభాగానికి అప్పగించారు. ఈ నెల 20 తేదీన మునుగోడులో జరిగే సీఎం బహిరంగ సభకు ముందే లబ్ధిదారుల వివరాలు సీఎంవోకు అందించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 

లెటర్లు రాస్తరట.. మెసేజ్​లు​ చేస్తరట.. 

జిల్లా ప్లానింగ్​ విభాగం ద్వారా గ్రామాల వారీగా సేకరిస్తున్న సమాచారంలో లబ్ధిదారుల సమగ్ర వివరాలు ఉండేలా చూస్తున్నారు. పేరు, ఊరు, కుటుంబం, ఫోన్ ​నంబర్ ​లాంటి వివరాలతో పాటు ఓటర్లకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇప్పటివరకు ఏమేరకు లబ్ధి చేకూరింది? అనే డిటెయిల్స్​ కూడా తీసుకుంటున్నారు. ఆ వివరాల ఆధారంగా స్వయంగా కేసీఆర్​ పేరుతో ముద్రించిన లెటర్లను లబ్ధిదారుల ఇండ్లకు పంపించనున్నట్టు టీఆర్ఎస్​లీడర్లు చెప్తున్నారు. ఫోన్లకు మెసేజ్​లు,  వాట్సాప్​ ఉన్నవాళ్లకు రికార్డింగ్​ వాయిస్​మెసేజ్​లు కూడా పంపే అవకాశముందని అంటున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని, ఇకముందు ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్కీములన్నీ కొనసాగిస్తామన్నట్లుగా సీఎం సందేశం ఉంటుందని భావిస్తున్నారు.