దుబ్బాకలో ఏం అభివృద్ధి జరుగుతున్నదో కనుక్కోండి

దుబ్బాకలో ఏం అభివృద్ధి జరుగుతున్నదో కనుక్కోండి

హుజురాబాద్: టీఆర్‌‌ఎస్‌కు ఓటు వేయకపోతే అభివృద్ధి జరగదని ప్రజలను పరోక్షంగా హెచ్చరించారు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరులో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. వీణవంక మండలం నుంచే అత్యధిక మెజారిటీ రావాలని అన్నారు. టీఆర్‌‌ఎస్‌ను గెలిపిస్తే ఈటల చేయని అభివృద్ధిని చేసి చూపిస్తామని లేకుంటే 2023లో ఓట్లు అడగబోమని కౌశిక్‌ రెడ్డి చెప్పారు. గతంలో ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన దుబ్బాకలో ఏం అభివృద్ధి జరుగుతుందో అక్కడ మీ బంధువులు ఉంటే తెలుసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తేనే అభివృద్ధి అన్నట్టుగా పరోక్షంగా హెచ్చరించారు.

ఈటల రాజేందర్ అవినీతి చేస్తే సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని, ఇప్పుడు ఆయన ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతారని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఈటలకు ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. హరీశ్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేసినట్టుగా హుజురాబాద్‌ను ఈటల ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని నిలదీశారు. రెండు ఎకరాలు ఉన్న ఈటల మూడు వేల ఎకరాలు సంపాదించాడని, తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కౌశిక్ రెడ్డి చెప్పారు. దమ్ముంటే అవినీతి, అక్రమాలపై ఈటల చర్చకు రావాలని సవాలు విసిరారు.