ఎంపీ కాన్వాయ్‌‌పై దాడి చేసింది రైతులేనట!

ఎంపీ కాన్వాయ్‌‌పై దాడి చేసింది రైతులేనట!
  •     ఎమ్మెల్యే జీవన్‌‌‌‌రెడ్డి చెప్పిందే ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన పోలీసులు
  •     అర్వింద్ ఫిర్యాదును, రైతు ఐక్యవేదిక ప్రకటన పట్టించుకోలే
  •     కత్తితో దాడి చేసిన వ్యక్తి పేరే లేదు
  •     సుమోటోగా కేసు.. గుర్తుతెలియని వ్యక్తులపై పలు సెక్షన్లు నమోదు
  •     మంగళవారం దాడి జరిగితే.. గురువారం ఎఫ్‌‌‌‌ఐఆర్ కాపీ బయటపెట్టిన్రు

నిజామాబాద్/హైదరాబాద్​, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌‌‌‌పై దాడి చేసినోళ్లు టీఆర్ఎస్ లీడర్లు కాదట. పసుపు రైతులట!! ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు రాసుకొచ్చింది ఇదే మరి. ఎంపీ కాన్వాయ్‌‌‌‌పై మంగళవారం దాడి జరిగితే బుధవారం రాత్రి దాకా కేసు ఫైల్ చేయని పోలీసులు.. గురువారం ఎఫ్‌‌‌‌ఐఆర్ కాపీని బయటపెట్టారు. అందులో మాత్రం మంగళవారమే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పేర్కొన్నారు. అర్వింద్ కాన్వాయ్‌‌‌‌పై పసుపు రైతులు దాడి చేశారని, అదే రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్మూర్ ఎస్ఐ యాదగిరి ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమోటోగా కేసు ఫైల్​చేసినట్లు పేర్కొన్నారు. దాడి చేస్తారని, రక్షణ ఇవ్వాలని ఎంపీ అర్వింద్ ముందే చెప్పడం గానీ, తనపై దాడి జరిగాక ఇచ్చిన ఫిర్యాదును గానీ, దాడి చేసింది తాము కాదని రైతు ఐక్యవేదిక ఇచ్చిన ప్రకటనను గానీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దాడిలో ముందుండి, కత్తితో ఎంపీ అనుచరుడిని పొడిచేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్త గురించి ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

          పోలీసుల సమాచారం మేరకు 

         పోలీసులే నమోదు చేసిన ఎఫ్ఐఆర్

ఈ నెల 25న నిజామాబాద్ ఎంపీ అర్వింద్​తన అనుచరులతో కలిసి నందిపేటలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఎస్ఐ యాదగిరి బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇస్సాపల్లిలో అర్వింద్ కాన్వాయ్‌‌‌‌కి పసుపు రైతులు, సమీప గ్రామస్తులు అడ్డుతగిలారు. ఎంపీ తన కారులోంచి కిందికి దిగడంతో అందరూ కలిసి ఆయన్ను పసుపు బోర్డు ఏర్పాటుపై నిలదీశారు. ఇది వాగ్వాదానికి దారితీయడంతో ఎంపీ అనుచరులు ఓ రైతును కట్టెతో కొట్టారు. దీంతో ఇరువర్గాల నడుమ గొడవ జరిగింది. ఆ గొడవలో ఎంపీ అనుచరుల్లో కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఎంపీ కారు సహా పలువురి వాహనాల అద్దాలు పగిలాయి. వెంటనే ఎస్ఐ యాదగిరితోపాటు పోలీసులంతా రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు’’ అని ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఈ వివరాలన్నీ ఆర్మూర్ ఎస్ఐ చెప్పినవే. కేసును సుమోటోగా తీసుకుని, గుర్తు తెలియని వ్యక్తులపై 147, 148, 427, 324 r/w 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్​చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే చెప్పిన్రు.. పోలీసులు పాటించిన్రు..

తన కాన్వాయ్‌‌‌‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులే దాడి చేశారని, ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు ఉన్నాయని నిజామాబాద్​సీపీకి ఎంపీ అర్వింద్ ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన వెంటనే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి స్పందించారు. ఎంపీపై దాడి చేసింది టీఆర్ఎస్​వాళ్లు కాదని, పసుపు రైతులేనని ప్రకటించారు. దీనిని అదే రోజు రైతు ఐక్య వేదిక ప్రతినిధులు ఖండించారు. ఎంపీపై జరిగిన దాడికి పసుపు రైతులకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఐక్య వేదిక ప్రతినిధులు సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ అర్వింద్‌‌‌‌పై జరిగిన దాడిని రైతు ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తోందని, కొంతమంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దాడి చేసి పసుపు రైతుల పేరును వాడుకోవడం ఏమిటని ఫైర్​అయ్యారు. కానీ పోలీసులు.. ఎంపీ ఫిర్యాదును, రైతు ఐక్యవేదిక ప్రతినిధుల కామెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే చెప్పినట్లే ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి.

శిఖండి రాజకీయాలొద్దు: ఎంపీ అర్వింద్

ఎమ్మెల్యే జీవన్​రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హితవు పలికారు. ‘నువ్వు మొగోడివైతే అకాల వానలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించు’ అని సవాల్ ​విసిరారు. నందిపేటలో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దద్దమ్మ పనులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలకు నిజామాబాద్ సీపీ వకల్తా ఇస్తున్నారని మండిపడ్డారు. తమకు ఎందుకు రక్షణ ఇవ్వలేదో జిల్లా కలెక్టర్ కూడా జవాబివ్వాలన్నారు. తనపై హత్యాయత్నం వెనుక సీపీ హస్తం ఉందని ఆరోపించారు. తాను నేరుగా ఫిర్యాదు చేసినా.. ఎందుకు కేసు ఫైల్ చేయలేదని నిలదీశారు.

కేంద్ర హోం శాఖకు నివేదిస్త: అర్వింద్‌‌‌‌కు గవర్నర్ హమీ

అర్వింద్ కాన్వాయ్‌‌‌‌పై దాడి గురించి కేంద్ర హోం శాఖకు నివేదించి, నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు. గురువారం ఎంపీ అర్వింద్‌‌‌‌కు ఫోన్ చేసి ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలోనే తన హత్యకు కుట్ర జరిగిందని గవర్నర్‌‌‌‌‌‌‌‌కు అర్వింద్ చెప్పారు. తాను ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి వివరించారు. దాడి జరిగే అవకాశం ఉందని తాను ముందు నుంచీ హెచ్చరిస్తున్నా  రౌడీ మూకలను అదుపు చేయలేదని చెప్పారు. తన సొంత నియోజకవర్గంలోనే పోలీసులు కనీస భద్రత కల్పించలేదన్నారు.

అర్వింద్‌‌కు నడ్డా ఫోన్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. అర్వింద్‌‌పై, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. తనను చంపాలన్న కుట్రలో టీఆర్ఎస్ సర్కార్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ సీపీ పాత్ర ఉందని నడ్డాకు అర్వింద్ వివరించారు.  రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పాత్రపై ఫిర్యాదు చేసేందుకు లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా అపాయింట్‌‌మెంట్ ఇప్పించాలని నడ్డాను కోరారు.