నిజామాబాద్‌‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఇంటిపై టీఆర్​ఎస్​ దాడి

నిజామాబాద్‌‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఇంటిపై టీఆర్​ఎస్​ దాడి

పోలీసుల ఎదుటే విధ్వంసం.. రాళ్లు విసురుతూ బీభత్సం
ఫర్నీచర్‌‌, కిటికీ అద్దాలు, దేవుడి పటాలు పగులగొట్టారు
ఇంట్లో పనిచేసే మహిళ, సెక్యూరిటీ గార్డును కొట్టారు
అర్వింద్‌‌ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
దాడిని తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి, తరుణ్‌‌చుగ్, బండి సంజయ్, వివేక్
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్, కవిత దిష్టిబొమ్మలు దహనం

హైదరాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడికి తెగబడ్డారు. బంజారాహిల్స్‌‌ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలోకి పోలీసులు చూస్తుండగానే దూసుకెళ్లి ఫర్నీచర్‌‌, కిటికీ అద్దాలు, దేవుడి పటాలు ధ్వంసం చేశారు. కార్లతో పాటు ఇంట్లో ఉన్న పలు వస్తువులూ పగులగొట్టారు. తమ ఇంటిపై 50 మంది టీఆర్‌‌ఎస్‌‌ గూండాలు దాడి చేసి, విధ్వంసం సృష్టించారంటూ బంజారాహిల్స్‌‌ పోలీసులకు అర్వింద్‌‌ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. పని మనిషి, సెక్యూరిటీ గార్డును గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ దాడులు అప్రజాస్వామికమని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, నేతలు తరుణ్​చుగ్​, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కేసీఆర్‌‌, కవిత దిష్టిబొమ్మలు దహనం చేశారు.

ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్‌‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌‌ఎస్‌‌ నేత రాజారాం యాదవ్‌‌, తెలంగాణ ఫుడ్స్‌‌ చైర్మన్‌‌ రాజీవ్‌‌ సాగర్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు వంద మందికి పైగా అర్వింద్ నివాసం ఎదుట బైఠాయించారు. ఆందోళన పేరుతో పథకం ప్రకారం ఇంట్లోకి దూసుకెళ్లారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. పార్కింగ్‌‌లో ఉన్న కారుపై రాళ్ల తో దాడి చేశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ జెండా కర్రలతో ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించారు. హాల్‌‌లో ఉన్న గ్లాస్‌‌ టేబుల్‌‌, టీ పాయ్‌‌, షోకేస్‌‌ అద్దాలను పగులగొట్టారు. దేవుడి ఫొటోలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. ఫర్నిచర్‌‌‌‌ను చెల్లాచెదురు చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు రమణ, హౌస్‌‌ కీపర్‌‌ సత్యవతిపై దాడి చేశారు. వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు దాడికి తెగబడిన సమయంలో అర్వింద్‌‌ తల్లి విజయలక్ష్మి ఇంట్లో రెండో అంతస్తులో పూజ చేసుకుంటున్నారు. భారీ శబ్దాలు రావడంతో ఆమె కిందికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు దాడి చేశారని తెలుసుకొని భయంతో పైనే ఉండిపోయారు.

తెలంగాణ భవన్‌‌, కవిత ఇంటికి భారీ భద్రత

ఎంపీ అర్వింద్‌‌ ఇంటిపై దాడికి నిరసనగా తెలంగాణ భవన్‌‌ను ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. తెలంగాణ భవన్‌‌తో పాటు ఎమ్మెల్సీ కవిత ఇంటికి భారీగా భద్రత కల్పించారు. అర్వింద్‌‌ ఇంటి నుంచి తెలంగాణ భవన్‌‌ ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు. తెలంగాణ భవన్‌‌ వద్ద వంద మందికిపైగా పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి సెక్యూరిటీ పెంచారు. ప్రగతి భవన్‌‌ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో వారిని కంట్రోల్‌‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మరికొందరు బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి సిద్ధం కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: చింతల

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు బంజారాహిల్స్‌‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీసుకు వెళ్లారు. ఎంపీ అర్వింద్‌‌ ఇంటిపై దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌‌ సీపీ సీవీ ఆనంద్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే డీజీపీని కలుస్తామని, ఆయన కూడా స్పందించకుంటే హైకోర్టు ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు.

చోద్యం చూసిన పోలీసులు

ఎంపీ అర్వింద్‌‌ ఇంటి ముట్టడి, దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపించింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌, జాగృతి లీడర్లు, కార్యకర్తలు అర్వింద్‌‌ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి.. దాడి చేయాలని ప్లాన్‌‌ చేసుకున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ జాగృతి నేతలు ఆందోళన చేస్తున్న టైంలో బంజారాహిల్స్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌, ఎస్‌‌ఐ, కానిస్టేబుళ్లు అక్కడికొచ్చారు.  నిరసన తెలుపుతున్న వారిని కట్టడి చేసే అవకాశమున్నా అలాంటి ప్రయత్నం చేయలేదు. టీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు పోలీసులను తోసుకొని ఇంట్లోకి దూసుకెళ్లినా, రాళ్లు విసురుతూ, కర్రలతో దాడి చేస్తున్నా రియాక్ట్‌‌ కాలేదు. విధ్వంసం పూర్తయ్యాక తాపీగా లోపలికెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. అయినా అరెస్టు చేయలేదు. తర్వాత ఇంటి ముందు మళ్లీ బైఠాయించి అర్వింద్‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాతే వారిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో నిజాం తరహా పాలన : కిషన్‌‌రెడ్డి

రాష్ట్రాన్ని నిజాం రాజ్యంలా మార్చారని, అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ పార్టీ గూండాల దాడి హేయమైన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్‌‌‌‌ అయ్యారు. టీఆర్ఎస్ గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. అర్వింద్‌‌తో కలిసి ఆయన ఇంటిని కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరాశ, నిస్పృహలతోనే టీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘‘రాజకీయ విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోవచ్చు.. అందులో తప్పు లేదు.. ముఖ్యమంత్రి కుమారుడు ప్రధాని మోడీని ఎన్నో మాటలు అన్నాడు.. కానీ ప్రధాని ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదు.. ఇక్కడ ఏక్ నాథ్ షిండేలు అవసరం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలను కావాలని మా పార్టీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.. కేసీఆర్ కూతురును, కల్వకుంట్ల కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచనే మాకు లేదు” అని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్న వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని.. అలాంటి ఆయన ఫిరాయింపులు, నైతిక విలువల గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఫిరాయింపులపై కేసు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్ పైనే పెట్టాలని డిమాండ్ చేశారు.

అర్వింద్​ ఇంటిపై దాడి.. పిరికిపంద చర్య: తరుణ్ చుగ్

అర్వింద్ ఇంటిపై టీఆర్‌‌ఎస్ గూండాల దాడి పిరికిపంద చర్య అని, అధికార పార్టీ నేరపూరిత చర్యలతో తెలంగాణలో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ తరుణ్ చుగ్ మండిపడ్డారు. దాడులకు తెగబడ్డ వారిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అర్వింద్‌‌ను దూషించడమే కాకుండా హత్య చేస్తామంటూ బెదిరించినందుకు ఎమ్మెల్సీ కవితపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాటలతో జవాబు చెప్పే ధైర్యం లేకనే టీఆర్ఎస్ గూండాలు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పోలీసుల సహాయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఒక ప్రకటనలో ఆరోపించారు. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ దాడిని బీజేపీ నేతలు బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, విఠల్, కృష్ణ ప్రసాద్, ఎస్ కుమార్, ఎన్వీ సుభాష్, గీతామూర్తి ఖండించారు.

అవినీతిపరులు మాకెందుకు?: ప్రహ్లాద్ జోషి

కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నందునే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని,  ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దిల్‌‌సుఖ్ నగర్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను ఆమె కుటుంబ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నామని, అవినీతికి పాల్పడే వాళ్లు మాకెందుకని ప్రశ్నించారు.

బంజారాహిల్స్ పీఎస్​లో కవితపై అర్వింద్ ఫిర్యాదు

బంజారాహిల్స్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫిర్యాదు చేశారు. కొట్టి కొట్టి చంపుతామంటూ కవిత వ్యాఖ్యలు చేశారని, ఆ వెంటనే 50 మంది టీఆర్ఎస్ గూండాలు తన ఇంటిపై దాడి చేశారని కంప్లయింట్‌‌లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులని ఉసిగొల్పి కవితే తన ఇంటిపైకి దాడికి పంపించారని, తన ఇంటిపై దాడి ఘటనలో కల్వకుంట్ల కవిత హస్తం ఉందని ఆరోపించారు.

టీఆర్‌‌ఎస్‌‌ నాయకులపై నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు

అర్వింద్‌‌ ఇంటిపై దాడి చేసిన పలువురు టీఆర్‌‌ఎస్‌‌ నాయకులపై బంజారాహిల్స్‌‌ పోలీసులు నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు నమోదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌‌లు పరిశీలిస్తున్నామని, దాడిలో పాల్గొన్న నేతలపై 148, 452, 354, 323 రెడ్‌‌విత్‌‌149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎవరెవరిపై ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టామనే వివరాలు త్వరలో చెబుతామన్నారు.

రౌడీయిజం చేస్తారా : సంజయ్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులు చేసి ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నారని మండిపడ్డారు. దాడి ఘటన తర్వాత ఆయన అన్ని జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఆర్ఎస్ దాడులను, గూండాయిజాన్ని తెలంగాణ ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు, ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ సహనాన్ని చేతగాని తనంగా భావించవద్దని, తమ పార్టీ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

అవినీతిపరులు మాకెందుకు?: ప్రహ్లాద్ జోషి

కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నందునే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. టీఆర్ఎస్ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని,  ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దిల్‌‌సుఖ్ నగర్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను ఆమె కుటుంబ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నామని, అవినీతికి పాల్పడే వాళ్లు మాకెందుకని ప్రశ్నించారు.

ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వండి

డీజీపీకి గవర్నర్‌‌‌‌ తమిళిసై ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఇంటిపై టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల దాడి ఘటనపై డిటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డిని గవర్నర్​ తమిళిసై ఆదేశించారు. ఈ అంశాన్ని టాప్ ప్రయారిటీగా పరిగణించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇంట్లోకి వెళ్లి దాడి చేసి, పని మనుషులను గాయపర్చటం, అర్వింద్‌‌ ఫ్యామిలీ మెంబర్లను భయబ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఎంపీ అర్వింద్‌‌కు అమిత్ షా ఫోన్

హైదరాబాద్‌‌, వెలుగు: ఎంపీ అర్వింద్‌‌ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. అర్వింద్‌‌కు ఫోన్‌‌ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా నిలుస్తుందని షా భరోసా ఇచ్చారు. మరోవైపు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా శుక్రవారం సాయంత్రం ఎంపీ అర్వింద్‌‌కు ఫోన్ చేసి పరామర్శించారు. టీఆర్ఎస్ దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే ముందుకు పోవాలని సంతోష్ సూచించారు.